కడుపులు కాలే కరోనా కాలంలో మన పని మనం చేయడానికి ఒట్టి పుణ్యానికి ఎవడో వచ్చి ఎన్నడూలేని గౌరవం ఇచ్చి రోజూ బిర్యానీ పెట్టి, పొద్దున్న సాయంత్రం మందు బాటిళ్లు తెచ్చిపెట్టి, ఆరో పదో వేలు హార్డ్ క్యాష్ చేతిలో పెడుతుంటే ‘వద్దు పో’ అనడం ఎడ్డెతనం, తెలివితక్కువతనం. మాది ధర్మరాజు కేటగిరీ, మేము సత్య హరిశ్చంద్ర టైపు అని, ఇదేమి పనని క్లాసు పీకడం పిచ్చితనం, ఎర్రిబాగుల తనం.
పనుల్లేక, ఖర్చులు పెరిగి చేతిలో కాసులు ఆడని కాలంలో దక్కింది దక్కుళ్ళ. కొన్ని ఊళ్లలో మాత్రమే ఓటుకు ఆరో, పదో వేలు ఇచ్చి మిగిలిన చోట్ల పదో పరకతో సరిపెట్టడం.. కొంతమందికి మాత్రమే ఫుడ్డు, లిక్కర్, క్యాష్ ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడం మాత్రం ఘోరమైన అన్యాయం. ఇది ప్రజాస్వామ్య వివక్ష, కక్ష, శిక్ష.
హుజురాబాద్ ఓటర్లు ఐదారునెలల పాటు ఇంత ఘనమైన విలువ, కీర్తి తెచ్చిపెట్టినందుకు కేసీఆర్ సారుకు సర్వదా శతధా రుణపడి ఉండాల్సిందే. ఆయనే గనక కరోనా టైంలో ఎగిరెగిరి చక్కగ పనిచేస్తున్న ఈటలకు గునపం దింపకపోతే ఈ స్థితి వచ్చేదా? పెద్దాయనతో అంటకాగి ఛీర్ఫుల్ గా గడిపిన తోపు తురుంఖాన్లు, ఆయన ఛీ కొట్టగానే, తొడపాశం పెట్టగానే, కోదండం ఎక్కించగానే కుళ్లిపోతూ ఇళ్లకు పోయారు. ఈటల కూడా పూచికపుల్లలా పోయేవాడే గానీ, భూ ఆక్రమణ ఉచ్చు బిగిసేసరికి బతుకుపోరాటానికి దిగక తప్పలేదు. పనితనం, మంచితనం, కులబలం కలిసిరావడంతో ఏకు మేకయ్యాడు, ఉప ఎన్నికకు సై అన్నాడు. అందుకే పెద్దన్న పెద్ద ఫోటో అన్ని ఇళ్లలో పెట్టుకోవాలి, ఒక పువ్వో ఫలమో పెట్టాల.
తెలంగాణ జాతిపిత పుణ్యానే కదా.. హుజురాబాద్ జనాలకు ఈ రోజున ఇంత మంచీ మన్నన! ఏక్ ఎలక్షన్ కా సుల్తాన్లు అయ్యారు కదా అయన దెబ్బతో. పోతే పోనీలే.. తమ్ముడ్ని ఏదో ఒక పార్టీ తరఫున అసెంబ్లీ కి రానిద్దాం.. అని కేసీఆర్ పెద్దమనసుతో అనుకుంటే ఇంత హడావుడి ఉండేదా? వాళ్లకు ఇంత మర్యాద దక్కెడిదా? చూడచక్కని దళిత బంధు లాంటి మంచి స్కీం పుట్టేదా? గులాబీ మంత్రులు, కీలక నేతలు (పార్టీ వర్కింగ్ కింగ్ తప్ప) అన్ని ఊళ్లు తిరిగేవారా? అన్ని వాగ్దానాలు చేసేవారా? అధికార మంది మార్బలాలకు దీటుగా బీజేపీ, కాంగ్రెస్ దండ్లు ఇంతలా కదిలివచ్చేవా? బీరువాలో ఉన్న కట్టలు బైట పడేవా? వైరస్ దెబ్బకు బిక్కుబిక్కున బతుకుతున్న జనాలకు ఇంత కనువిందు దొరికేదా?
ఒకప్పుడు నాయకులు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు చడీ చప్పుడు లేకుండా బీరు, బిర్యానీ ఇచ్చేవారు. జనం తప్పుచేసినట్లు ఫీలై, పోనీలే అని వాటిని మూడోకంటికి తెలియకుండా తీసుకుని ఓటు వేసేవారు. ఇప్పుడు చూడండి.. పోరాటాల పురిటి గడ్డ లో ఏ అన్యాయాన్నైనా ఎలుగెత్తి ఎదుర్కునే మనోళ్లు ఎంత చైతన్య వంతులయ్యేరు? మందికో న్యాయం, మాకో న్యాయమా? అని ధర్నాలకు కూడా దిగారు. ఇంత ఓపెన్ గా ప్రజా పోరాటాలు జరుగుతుంటే ఎవడ్రా పనికిమాలినవాడు అన్నది.. ఇది మేడిపండు ప్రజాస్వామ్యమని? ఇది ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనం. జనచైతన్యానికి ప్రతీక. ఫీల్ కావాల్సిన పనిలేదు. జీనా హైతో లడ్నా సీఖో.
నేతలకు మాట ఇచ్చిన హుజురాబాద్ ఓటర్లు, చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా, 86.57 శాతం మంది (2018 తో పోలిస్తే రెండున్నర శాతం అదనంగా) ఓటువేసి మాట నిలుపుకున్నారు. నీతి నిజాయితీ కట్టుబాటు అంటే ఇవీ!
ఒక బద్వేల్ ఉప ఎన్నికను, ఒక హరీశ్ రావును చూస్తే ఎవ్వరికైనా అయ్యో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని బద్వేల్ లో కూడా నిన్ననే ఉప ఎన్నిక జరిగింది. కానీ అక్కడ 68.12 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. గత ఎన్నికలతో పోలిస్తే 8.25 శాతం తక్కువ. నన్నడిగితే, ఇది ఓటర్ల కన్నా నేతల వైఫల్యం. హుజూరాబాద్లో పుట్టకపోవడం బద్వేల్ వాళ్ళు చేసిన తప్పా? మందూ మాకూ ముక్కా బొక్కా తృణమో పణమో రాకపోవడానికి వాళ్ళు చేసుకున్న పాపమేమిటి? దిసీజ్ టూ బ్యాడ్.
ఇక హరీశ్ ముచ్చట. అదో చిన్న ఉప ఎన్నిక.. వచ్చేది లేదు పోయేది లేదని కేటీఆర్ తేలిక చేసి అన్నా.. హుజురాబాద్ ప్రచారంలో తలమునకలై తన మాజీ దోస్తును కుమ్ముతూ హరీశ్ పార్టీ ప్లీనరీకి కూడా రాకపాయె! పైకి టేకిట్ ఈజీ అనిపిస్తూనే.. అధికార పార్టీ అన్ని ఏర్పాట్లు చేయబట్టే కదా బద్వేల్ వాళ్ళు కుళ్లిపోయేలా హుజురాబాద్ ఓటర్లు మస్తీ మజా చేసింది. అయ్యా, కొడుకులు- పార్టీ ఢమాల్ అనే చోటికి ప్రచారం కోసం రారని, దీన్ని బట్టి తమ విజయం ఖాయమని కమలం నేతలు అంటుండగా, ఈ పాడు ఎలక్షన్ కమిషన్ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల తన చేతులాడకుండా పోయాయని ప్లీనరీ సాక్షిగా పెద్ద బాసు బుస్సుమన్నారు. సరిగ్గా ఓటింగ్ సమయానికి చిన్న బాసు ఫ్రాన్స్ లో తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడుల కోసం సూటు బూటుతో కృషి చేస్తూ పేపర్లలో కనిపించారు.
హుజూరాబాద్ లో కాసుల-గ్లాసుల గలగలలు, బిర్యానీ ఘుమఘుమలు చూసాక ఒక ఐడియా వచ్చింది. ఈ గోలంతా ఎందుకు, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఓట్ల కొనుగోలును చట్టబద్ధం చేస్తే పోలా? బాజాప్తా పారదర్శకంగా ఈ పనిచేస్తే? ఎక్కడైనా ఓట్ల తేదీలు ప్రకటిస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ‘నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ’, ‘నామినేషన్ విరమణ తేదీ’ వంటి వివరాలతో షెడ్యూల్ ఇస్తుంది కదా. అందులో ‘వేలంపాట తేదీ’ అని కూడా పోలింగ్ కు రెండు రోజుల ముందు ఒక ప్రత్యేకమైన డేట్ చేర్చాలి. చేపల చెరువు వేలం వేసినట్లు ఆ ఊరి ఓట్లను రాజకీయ పార్టీలు వేలంలో పాడుకోవచ్చు. వచ్చిన డబ్బులో సగం ఓటర్లకు, సగం గ్రామ అభివృద్ధికి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఉదాహరణకు- హుజురాబాద్ లో పోలింగుకు ముందే ఈ వేలం జరిగితే.. టీఆర్ఎస్ లేదా బీజేపీ 2,36,873 ఓట్లను పాడుకోవాలి. బిడ్డింగ్ లో ఒక 700 కోట్లకో 1000 కోట్లకో పాడుకుంటే.. అందులో సగం ఓటరుకింతని పంచాలి. మిగిలింది నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రో, వరల్డ్ క్లాస్ స్కూలో కట్టడానికి వాడుకోవాలి. ఇంకా బోలెడు డబ్బు మిగులుతుంది. ఆ డబ్బులను రోడ్లు వంటి ఇతర సౌకర్యాలకు వాడుకోవాలి. ఎలాగూ ఈ నాయకులు అధికారంలోకి వచ్చి పీకేది పెద్దగా ఉండదని జనాలకు తెలుసు కాబట్టి.. ఈ రకంగానైనా తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చు.. తమకు ప్రాజాస్వామ్యం ప్రసాదించిన ఓటు అనే పెట్టుబడితో. ఈ విధంగా పదవి తీట నేతలకు తీరుతుంది. జనాలకు మేలు జరుగుతుంది.
ఇట్లా చేస్తే.. మరి పేదోడు నాయకుడు అయ్యేది ఎప్పుడు? అన్న ప్రశ్న రావడం సహజం. మీరే చెప్పండి.. పేదోడు నామినేషన్ వేసి, పోటీ చేసి ఈ ఎన్నికల వ్యయాన్ని తట్టుకుని నిలిచి గెలిచే పరిస్థితి ఉందా? డబ్బుకు మరిగిన జనాలను మార్చే శక్తి మనకుందా? అది కాని పని. రాజకీయ నేతలు కలివిడిగా విడివిడిగా వ్యవస్థను దుంపనాశనం చేశారు. స్వచ్ఛమైన పాలిటిక్స్ అంటూ సదాశయాలతో బరిలోకి దూకిన వారు కూడా ఎన్నికల సమయంలో ఆస్తులు అమ్ముకోవడమో, ఆత్మీయుల నుంచి చందాలు తెప్పించుకోవడమో చేయక తప్పని దుస్థితి. జాతిపిత మహాత్మా గాంధీ గారు, లేదా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు వచ్చి మన ఆధునిక ఎన్నికలలో పోటీ చేసినా నోట్ల కట్టలు లేకుండా గెలిచే పరిస్థితి ఉందా?
వ్యవస్థ సర్వనాశనం అయ్యింది, సార్/ మేడమ్. ఈ పోరాటంలో సమాజహితం కోరేవాళ్ళం, నిజమైన దేశభక్తులం మనం దారుణంగా రోజూ ఓడిపోతున్నాం. ఓటు హక్కు వినియోగంపై విద్యావంతులు బాధ్యతగా ఒక దశాబ్దకాలం పాటు ప్రచారం చేసి, నేతల దమన నీతిని మొహమాటం లేకుండా తూర్పారపడితే తప్ప పరిస్థితి మారదు. ఆ తీరిక, ఓపిక మనకు లేవు.
ఓటర్లలో గత దశాబ్దకాలంగా అవగాహన, చైతన్యం కలిగిస్తున్న మీడియా సంస్థలకు ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డు ప్రదానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కావేటి విజయానంద్ ప్రకటించారు. ప్రింట్, టీవీ, రేడియో, సోషల్ మీడియా వారు నవంబర్ 30 లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలని అయన సూచించారు. 2022 జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని అయన చెప్పారు. అదే రోజు, ఓట్ల వేలం బృహత్ పథకాన్ని కూడా ఎన్నికల సంఘం ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఓటరు మహాశయుల పక్షాన, యావత్ భారత ప్రజాస్వామ్య వాదుల తరఫున కోరుకుందాం.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
Discussion about this post