మనం ఒక మెట్టు దిగితే.. ఇతరులు మనల్ని వంద మెట్లు కిందికి లాగేస్తారు. ఇదేమీ అతిశయమైన విషయం కాదు. లోకసహజం. మనలో చిన్న బలహీనతను మనం బయటపెట్టుకుంటే.. సహస్రగుణంగా దాన్ని పెంచి, లేని బలహీనతల్ని కూడా ముడిపెట్టి మన పతనాన్ని నిర్దేశిస్తారు. పాత్రికేయులు- రాజకీయులు ఇందుకు అతీతం ఎంతమాత్రమూ కాదు!
పాత్రికేయ ప్రపంచం ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించి.. వేల, లక్షల మంది పాత్రికేయులతో ఎంతో పరిపుష్టంగా వర్ధిల్లుతోంది. అదే సమయంలో విలువల పరంగా, పలచబడింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందనే సార్వజనీన సిద్ధాంతం ఈ ప్రపంచానికి కూడా వర్తించింది. విలువలు మాత్రమే కాదు, ప్రమాణాలు కూడా పలచబడ్డాయి. వాటికి అనులోమంగా.. ‘జర్నలిస్టు’ అని చెప్పుకుంటే దక్కే గౌరవం కూడా పలచబడింది.
గౌరవం దక్కకపోతేపోయె.. దూషణలు, తిట్లు, ఎత్తిపొడుపులు, వెటకారాలు, హేళనలు ఎదురవుతుంటే పరిస్థితి ఏమిటి? కొందరు తెరవెనుక అడ్డదారులే జీవనంగా గడుపుతున్నప్పటికీ.. అధికారికంగా సమాజం కోసమే పనిచేసే పాత్రికేయులకు, అదే పని చేస్తున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులకు మధ్య బహిరంగ దూషణలు, హేళనలు ఎదురైనప్పుడు.. అంతో ఇంతో విలువలు పాటించే వారికి మనస్సు చివుక్కుమంటుంది.
జర్నలిజానికి గౌరవం తగ్గిపోయింది. ఈ విషయం ఎవరూ ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒక మిత్రుడు చెప్పినట్టు- ‘రాజకీయ పార్టీలు పత్రికా యాజమాన్యాలుగా.. పత్రికాధిపతులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందడం మొదలైన దగ్గర్నుంచి జర్నలిస్టులంటే- కేసీఆర్, జగన్ లలో మాత్రమే కాదు వేరే రంగాల వారిలోనూ చులకనభావం మొదలైంది’. అలాంటప్పుడు రాజకీయ నాయకులు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అనల్పమైన అధికారాన్ని చెలాయిస్తున్న వారు ఆ ధోరణికి భిన్నంగా.. గౌరవిస్తారని, గౌరవించాలని అనుకోవడం భ్రమ.
అదే సమయంలో ‘పాలకులు నియంతల్లా భ్రమ పడుతున్నప్పుడు అధికారం ప్రజలే ఇచ్చారన్న విషయం మర్చిపోతుంటారు. అహంకారాన్ని దించే ఆయుధం ప్రజల దగ్గర ఉందన్న విషయం గుర్తుండదు. గౌరవం పోవడంలో కొంత జర్నలిస్టుల స్వయంకృతం కావొచ్చు. కానీ నాయకులు చాలా విషయాలు మరచిపోయి ప్రవర్తిస్తుంటారు.’! అనేది మరొక జర్నలిస్టు అభిప్రాయం
ఇప్పుడు, కలంవీరులపై హేళనల గురించిన ఈ చర్చ అంతా కూడా.. హుజూరాబాద్ ఓటమి అనంతర హూంకరింపుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రెండు వరుస ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటల గురించి!
కేసీఆర్‌కు సరైన జవాబు చెప్పిన కె.శ్రీనివాస్
కేసీఆర్ జనరంజకంగా మాట్లాడతారు. సభారంజకంగా మాట్లాడగలరు. కానీ రంజకత్వం గురించిన ధ్యాస ముదిరి సభామర్యాదను మాత్రం ప్రయత్నపూర్వకంగా విస్మరిస్తుంటారు. ప్రెస్ మీట్ లో అయినా అంతే. జర్నలిస్టులను అదే విధంగా శృతిమించిన చతురోక్తులతో ఆడుకుంటూ ఉంటారు. తాజా ప్రెస్ మీట్లలో కూడా అదే జరిగింది. అయితే ఎప్పటిలా ఈసారి జర్నలిజం ప్రపంచం నుంచి మౌనమే సమాధానం కాలేదు. ఆయన హేళనల వీడియో ముక్కలతో యూట్యూబ్ హోరెత్తిపోవడంతో ఆగలేదు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ సరైన జవాబు చెప్పారు.
‘నీగ్గూడ ఉండాలె గదనయ్య జ్ఞానం’ అనే కేసీఆర్ మాటలనే శీర్షికగా పెట్టి.. కేసీఆర్ మాటలను ప్రస్తావిస్తున్నారో, కేసీఆర్‌ను ఉద్దేశిస్తున్నారో స్పష్టత ఇవ్వకుండా ఆయన జర్నలిస్టుల తరఫు నుంచి తన వాదనను బలంగా, గట్టిగా, ఘాటుగా వినిపించారు. కె.శ్రీనివాస్ తన నర్మగర్భాలంకారాన్ని కేవలం శీర్షికకు మాత్రమే పరిమితం చేశారు. ‘సందర్భం’ కాలమ్ కింద ఆంధ్రజ్యోతి గురువారం (11 నవంబరు 2021) ప్రచురించిన విశ్లేషణలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ మీడియా పట్ల, పాత్రికేయుల పట్ల అనుసరిస్తున్న ధోరణులను అందులో తప్పుపట్టారు. పాత్రికేయ సంఘాలు, పెద్దలు ఈ ధోరణిని ఎందుకు నిరసించడం లేదంటూ ప్రశ్నించారు.
ధోరణులు మారుతున్నాయ్..
జర్నలిస్టులకు ఇలాంటి అవమానాలు ఎదురవుతుండడానికి కారణాలు అనేకం. ముందే చెప్పుకున్నట్టు మీడియా యజమానులు రాజకీయ నాయకులుగా, నాయకులు మీడియా యజమానులుగా మారిపోయిన రోజులివి. సహజంగానే ఎదుటిపక్షాన్ని శత్రువులాగా చూసే ధోరణి ఉభయుల్లో ప్రవేశించింది. ఇలాంటప్పుడు- ఈ పోకడలకు మూలమైన పాపం పూర్తిగా జర్నలిస్టులది ఎందుకు అవుతుంది? యాజమాన్యాలదే అవుతుంది. కానీ హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నది మాత్రం జర్నలిస్టులే!
తమ తమ వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా యజమానులు రాజకీయ నాయకుల బూట్లు తుడవడం, అదే సమయంలో కొన్ని పార్టీలను వ్యక్తిగత శత్రువులు లాగా భావించి అనుచిత రంధ్రాన్వేషణతో కూడిన, కల్పిత కథనాలతో దాడులకు దిగడం అనేది మామూలైపోయింది. ఈ పరిణామాల దుష్ఫలితాలు క్షేత్రస్థాయిలో ఉన్నవారే అనుభవిస్తున్నారు.
ఒక రిపోర్టరును వేలెత్తిచూపి ‘నువ్వు ఇకమీదట ప్రెస్ మీట్‌లకు రావొద్దు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన వైనం కూడా కె.శ్రీనివాస్ తన వ్యాసంలో ప్రస్తావించారు. తమ తమ ప్రచారానికి ప్రతి పార్టీ కూడా ఇప్పుడు పత్రికలను, టీవీ ఛానెళ్లను నడుపుకుంటోంది. తమకు ప్రచారం అక్కడ వస్తే చాలునని కూడా అనుకుంటోంది. పార్టీగా ఉన్నప్పుడు- తమ విలేఖరుల సమావేశాలకు కొన్ని పత్రికలను నిషేధించడం అనేది రాజకీయ నాయకుల ఇష్టం. అయితే.. అదే నాయకులు ప్రభుత్వంగా మారిన తర్వాత వారికి ఆ హక్కు లేదు. ప్రభుత్వం అనేది వారి సొత్తు కాదు. విలేఖరుల ప్రశ్నలకు వారు జవాబు చెప్పకపోవచ్చు. కానీ వారిని రావొద్దు అనడం తగదు. హేళన చేస్తూ మాట్లాడడం అనేది వారి వ్యక్తిత్వానికి మచ్చ!
ఆ మాటలు కేసీఆర్ సొత్తు..
ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేలు. కొన్ని పత్రికల ప్రతినిధులను ఆయన శత్రువులుగా చూడవచ్చు. కొన్ని చానెళ్ల ప్రసారాలను అడ్డుకోవచ్చు. విలేఖరుల ప్రశ్నలకు అసలు జవాబులే చెప్పకుండా.. తాను చెప్పదలచుకున్నది మాత్రం చెప్పేసి.. ఒకటిరెండు కొనసాగింపు మాటల తర్వాత లేచి చక్కా వెళ్లిపోవచ్చు. కానీ హేళనగా మాట్లాడడం ఎరగరు. ‘ఎదుట ఉన్నది ఎవరు’ అనే పట్టింపే లేకుండా హేళన చేస్తూ మాట్లాడి వారిని డిఫెన్స్ లోకి పడేయడం అనేది కేసీఆర్ ముద్ర కలిగిన రాజనీతి.
ఇదివరకు చెప్పుకున్నట్టు మీడియా ప్రతినిధులు ఇదివరకటిలా అందరూ పరిపూర్ణులు కాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ప్రెస్ మీట్ కు తగినవాళ్లే వెళ్తారు. అటువంటి వారినుంచి కూడా తలాతోకా లేని ప్రశ్నలు రావని ఖరారుగా చెప్పలేం. అయితే వాటిని తిప్పి కొట్టడానికి కూడా నాయకులకు హుందాతనం నిండిన మార్గాలు అనేకం ఉంటాయి. అలాకాకుండా.. సంస్థల మీద కోపంతో, సంస్థ యజమాని లేదా, ఆ తరహా ప్రశ్నను- వాదనను లేవనెత్తిన రాజకీయ ప్రత్యర్థి ఎదురుగా ఉన్నట్లుగా అవమానకరమైన మాటలతో విరుచుకుపడడం సరికాదు. హేయం.
జర్నలిస్టులందరూ ఖండించాలి..
ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ తన వ్యాసంలో ఈ అంశం కూడా స్పష్టంగా చెప్పారు. ‘పాత్రికేయ సంఘాలు ఎందుకు ఈ ధోరణిని నిరసించడం లేదు? పైగా నవ్వడాలు కూడా!’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. కేసీఆర్ ఒక రిపోర్టరును హేళన చేయగానే.. ఆ వైనంపై యూట్యూబ్ లో క్లిప్పింగులు పెట్టి.. కేసీఆర్ వాక్చాతుర్యాన్ని ఆనందించే అభిమానుల వ్యూస్ పొందడం పెద్ద అలవాటు. ఆ వ్యూస్ కోసం ఆరాటం ఓకే.. కానీ.. ‘కేసీఆర్ అలా మాట్లాడడం సరికాదు’ అనే వ్యాఖ్యను కూడా జోడించి.. యూట్యూబ్‌లో చెబుతున్న వారెందరు? పాత్రికేయ సంఘాల పెద్దలు కూడా నాయకుల అసమంజస ధోరణులకు అడ్డు చెప్పడం లేదు.
ఇటు కేసీఆర్‌తో అయినా, అటు జగన్మోహన్ రెడ్డితో అయినా వ్యక్తిగతంగా మాట్లాడగల, ప్రజాస్పందనలను నివేదించగల పాత్రికేయ పెద్దలు చాలా మందే ఉన్నారు. కానీ అందరూ మౌనధారులే. కానీ.. ఇవాళ్టి ప్రపంచం కేవలం కొందరు పెద్దల చేతుల్లోనే ఇరుక్కుని ఉండిపోలేదు. సోషల్ మీడియా అనేది ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను పంచుకోడానికి, తమకు తోచిన రీతిగా, నచ్చని వారిపై బురద చల్లడానికి అనువైన వేదికగా మారుతోందో.. అదే విధంగా.. అదే వేదిక జర్నలిస్టులకు కూడా అందుబాటులోనే ఉంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఇన్నాళ్లూ ఈ వైఖరులను లోలోన ఈసడించిన వారుంటారు. కానీ ‘నీగ్గూడ ఉండాలె గదనయ్య జ్ఞానం’ అనే శీర్షికతో సంపాదకుడు కె.శ్రీనివాస్ స్పష్టంగా ప్రశ్నించిన తర్వాత.. జర్నలిస్టులందరూ కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రభుత్వ అధినేతలుగా చెలామణీ అవుతున్న వారికి.. తమ ధోరణి సరికాదని జర్నలిస్టు కుల పెద్దలు మాత్రమే చెప్పనవసరం లేదు. ప్రతిఒక్కరూ తమ తమ వెబ్‌సైట్లలో, బ్లాగుల్లో, ఫేస్ బుక్ ఖాతాల్లో, సోషల్ మీడియా అందిస్తున్న అన్ని రకాల వేదికలలో తమ నిరసనను ఏదో ఒక రీతిగా తెలియజెప్పాలి.
పెద్దల మాట మాత్రమే కాదు.. చిన్నా సన్నా జర్నలిస్టులందరూ కూడా స్పందించి ఎలుగెత్తితే ఆ గళం తీవ్రత, అదుపు లేని నాయకుల చెవికి తప్పకుండా సోకుతుంది. తక్షణ స్పందన, క్షమాపణ లాంటివేమీ ఆశించాల్సిన అవసరం లేనే లేదు. అవి రావు. కానీ.. జర్నలిస్టు గళాల ప్రతిధ్వనులు వారి దూకుడును తప్పకుండా తగ్గిస్తాయి.
కారణాలు ఏవైనా జర్నలిజం గౌరవం పలచబడుతుండడాన్నీ ఎవ్వరూ కాదనలేం. కానీ.. మిగిలిఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సింది కూడా మనమే అని తెలుసుకోవాలి. ఉపేక్షతో జర్నలిజం గౌరవాన్ని కాలబెట్టడం పాడికాదు.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు, ఆదర్శిని
Discussion about this post