రాయలసీమ అనగానే కళ్లముందు కరువు ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రాంతం నుంచి నిత్యం ప్రచురితమయ్యే వార్తలు; పత్రికల్లో వెలువడే కవితలు, కథలు, గేయాలు, వ్యాసాలు, విశ్లేషణలు… ప్రతి ప్రక్రియా ఆ ప్రాంతపు వర్షాభావ వ్యధలకు అద్దం పడుతుంది.
సీమకథల సంకలనాలు చదివిన ప్రతిసారీ కడుపు తరుక్కుపోయేది. విత్తనాలు చల్లి, ఆకాశం వంక ఆశగా చూసినా చినుకుజాడ లేకుండానే కార్తెలన్నీ మట్టిలో కలిసిపోయే దుర్భర పరిస్థితుల గురించి చదివినప్పుడల్లా బాధ రెట్టింపయ్యేది.
అలాంటిది, ఇటీవల ఆ ప్రాంతంలో వరద పోటెత్తింది. గొంతెండిపోయి, ప్రాణాలు పోతాయేమో అని భయపడేంతటి పరిస్థితి కాస్తా తలకిందులై గ్రామాలకు గ్రామాలు నీట మునిగాయి. ప్రాజెక్టులకు గండ్లు పడి, ఇళ్లువాకిళ్లు నామరూపాల్లేకుండా నేలమట్టమయ్యాయి.
ఇదీ చదవండి : తిరుపతి ఎమ్మెల్యే భూమన ఎంత మంచివాడో మీకు తెలుసా?
కడప జిల్లా అతలాకుతలమైంది. మొన్న ఉదయం ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఫోన్ చేశారు. ‘‘ఒంటిమీద బట్టలతో మిగిలారబ్బా. మీరు ఏమాత్రం సాయం చేసినా అదే పరమౌషధం’’ అన్నారు.
అప్పటికప్పుడు బోర్డుసభ్యుల అనుమతి తీసుకున్నాను. మా ఫౌండేషన్ సభ్యుల్ని వెంటనే రంగంలోకి దింపాను. దుప్పట్లు, చీరలు, టీ షర్టులు, నైట్‌ప్యాంట్లు, తువాళ్లు, పళ్లేలు, గ్లాసులు, వంటపాత్రలు కొన్నాం. పెద్ద వాహనానికి ఎక్కించి, కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతానికి పంపాం. ఫౌండేషన్ ఉద్యోగి శ్రీనాథ్‌ను ఆ వాహనం వెంట పంపాను.
మరుసటి రోజు పదకొండు గంటలకు ఆ వాహనం చేరుకునేపాటికి వెంకటరామిరెడ్డి ఇరవై మంది వలంటీర్లతో సిద్ధంగా ఉన్నారు. వాటిని విడివిడిగా బ్యాగుల్లో సర్దారు. సుమారు 500 కిట్లు తయారయ్యాయి. అప్పటికే పొద్దుగూకింది. కొన్ని ఊళ్ల గురించి తెలుసుకుని, అక్కడ పంపిణీ చేయటానికి బయల్దేరారు. అదేరోజు ప్రతిపక్ష నాయకుడి పర్యటన కారణంగా దారిమధ్యలోనే ఆటంకం ఎదురైంది. పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదు. ఆ రాత్రికి పంచటం వీలు కాలేదు. మరుసటి రోజు ఏవో తంటాలు పడి జడ్పీ ఛైర్మన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.
ఇదీ చదవండి : నారా భువనేశ్వరి డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నారా?
జిల్లా భౌగోళిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న ఆయన మా బృందం సంకల్పాన్ని అర్థం చేసుకుని ‘మైదాన ప్రాంతంలో ప్రభుత్వం పంచుతోంది. ఏవేవో కంపెనీలు, స్వచ్ఛందసంస్థలు ఈ గ్రామాలన్నీ తిరుగుతూ సాయం అందిస్తున్నాయి. కానీ, కొన్ని గ్రామాలున్నాయి. కొండల్లో ఉన్నాయి. రోడ్లు లేవు. కరెంటు లేదు. ఏ ఒక్కరూ అటువైపు వెళ్లటం లేదు. రాత్రి ఒకతను కాలినడకన వచ్చి, నన్ను కలిసి భోరున ఏడ్చాడు. మనమెందుకు అక్కడికి వెళ్లకూడదు?’ అని ప్రశ్నించారట.
ఇది కూడా చదవండి : ఎమ్వీ రవం : బియ్యపు గింజపైనా బినామీలు
ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకొన్నారు. తీరా బయల్దేరి వెళితే, ఆ గ్రామాల్లోకి ఎలా ప్రవేశించాలో అర్థం కాలేదు. అసలు రోడ్లే లేవు. సరుకులు నింపిన ట్రాక్టర్లు కాలిబాటల్లో ముందుకు కదలటం దుర్లభమైంది. అప్పటికప్పుడు జడ్పీ ఛైర్మన్ డోజర్లు, జేసీబీలు, ట్రాక్లర్లను పురమాయించి రోడ్ల మరమ్మతులు ప్రారంభించారు. రాత్రీ పగలూ గడిస్తేగానీ ఆ పని పూర్తి కాలేదు. మొత్తానికి సరుకులతో నింపిన రెండు ట్రాక్టర్లతో సాయంత్రం పూట ఆ గ్రామాలకు ప్రయాణం ప్రారంభమైంది.
కొండప్రాంతం మొదలయ్యాక కార్లు, బండ్లు అక్కడే వదిలేసి అందరూ ట్రాక్టర్లలోకి ఎక్కారు, జడ్పీ ఛైర్మన్ సహా! మళ్లీ వర్షం. దారి పాడైంది.
‘‘ఇక్కట్లు పడితే పడినాంగానీ చింతలకోన, ఏకిలపల్లె గ్రామాల్లో సరుకులు పంచుతుంటే వరదలు మా కళ్లల్లో పొంగాయి. ఆదుకోటానికి అంతదూరం వెళ్లిన మా పట్ల వాళ్లు చూపిన అభిమానం గురించి మాటల్లో చెప్పలేను. కన్నీటి పర్యంతమవుతూ కాళ్లు పట్టుకున్నంత పనిచేశారు’’ అని వెంకటరామిరెడ్డి చెప్పినప్పుడు నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
* * *
అందించిన సాయం నా జేబులోది కాదు.
కష్టించిన వలంటీర్లు జీతం తీసుకునే ఉద్యోగులు కారు.
కానీ, నా మనసుకు సాంత్వన కూరుస్తున్న ప్రధానాంశాలు కొన్ని ఉన్నాయి…
ఫౌండేషన్‌తో ఎలాంటి సంబంధమూ లేని ఇరవై మంది యువకులు.. ఛైర్మన్ మాటకు విలువిచ్చి ఆ ప్రయాణంలో భాగమైన మరో ఇరవై మంది పౌరులు భవిష్యత్తు మీద గొప్ప భరోసా కల్పిస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
మా ఉద్యోగి శ్రీనాథ్ టీ షర్టులు ఇవ్వబోతే, ‘‘మాకెందుకన్నా! పాతూరు పాతరైపోయింది. స్కూలు పిలకాయలకిద్దాం’’ అని తమ హృదయవైశాల్యాన్ని చాటుకున్న వలంటీర్లు.. ‘బాధ్యతాయుత యువతరం కనుమరుగు కాలేదు’ అని హామీ ఇస్తున్నారు.
Reached the unreached అనే గొప్ప దృక్పథంతో ఆలోచించి, తిరుగు ప్రయాణంలో పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన జడ్పీ ఛైర్మన్.. ‘రాజకీయం సమస్తం పంకిలం కాదు’ అనే నమ్మకానికి పునర్నిర్వచనం తయారు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సూత్రధారి, తన పల్లె నుంచి ఎన్నో కిలోమీటర్లు వెళ్లి అన్నీ సవ్యంగా ముగిసేదాకా శ్రమించిన రచయిత… ‘రాతల్లోనే కాదు, చేతల్లోనూ ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత’ను లోకం ముందు ప్రదర్శనకు పెడుతున్నాడు.
నన్ను నమ్మండి.
వరద మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నాను…
వ్యవస్థ కుళ్లిపోలేదు. లోకమంతా చెడిపోలేదు. మనుషులు సమస్తం మలినమైపోలేదు.
ఉన్నారు… ఎందరో మహానుభావులు!
– ఎమ్వీ రామిరెడ్డి
Discussion about this post