‘అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు..’ చాలా గొప్పవాడని మనకు సుమతి శతకం చెబుతుంది. కానీ అంతటి ఔదార్యం ఎవ్వరికి ఉంటుంది? ప్రాక్టికల్ గా అది సాధ్యమేనా? మరో రకంగా చెప్పాలంటే.. మనకు కీడు చేసిన వాడికి జవాబుగా మనం మేలు చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షనిస్టుల్లాగా పగలు, ప్రతీకారాలతో రగిలిపోయి.. తిరిగి మనం కూడా మరో అపకారం చేయకుండా ఉంటే చాలు.
అపకారం అని మాత్రమే కాదు.. వ్యక్తిత్వ, సంస్కార లోపాలు కూడా ఇతరుల్లో మనకు చాలా కనిపిస్తుంటాయి. అలాంటివి గమనించినప్పుడు, తప్పు అనిపించగానే.. అలాంటి తప్పును మనం గతంలో ఎవరిపట్లనైనా చేశామా.. ఎవరిపట్లనైనా అలాంటి ప్రవర్తనను తలపెడుతున్నామా అనేది ఒకసారి ఆత్మసమీక్ష చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
ఇదే విషయాన్ని ఒక సుభాషితం.. సర్వధర్మాల సారం అని చెబుతుంది. చాలా సరళంగా మనకు వివరిస్తుంది. ధర్మసూత్రంగా ఇదొక్క సంగతి ఆచరిస్తే చాలని అంటుంది.
శ్రుయతామ్ ధర్మ సర్వస్వం శృత్వా చైవావధార్యతామ్
ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్
సకల ధర్మాలు చెప్పే సారం ఏమిటో చాలా శ్రద్ధగా భక్తిగా ఆలకించండి. వినిన ధర్మాసారాన్ని మీ బుర్రలో భద్రపరచుకుని ఆచరించండి. ఆ ధర్మసారం ఏంటంటే.. ఇతరులు చేసే ఏపనులనైతే మీరు హాని, అపకారం, కీడు, ముప్పు అని మీరు భావిస్తున్నారో.. అలాంటి పనులను మీరు ఇతరుల విషయంలో ఎన్నడూ చేయవద్దు! ..అనేది శ్లోకభావం.
స్నేహితుడు మన నుంచి ఓ మంచి పుస్తకం మనం అరువు తీసుకువెళతాడు. ఇచ్చే మనకు, పుచ్చుకునే స్నేహితుడికి కూడా.. ‘పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః’ అనే మాట ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ‘అందరిలా నేనెందుకు చేస్తాను.. చదివిన తర్వాత ఖచ్చితంగా తిరిగి ఇస్తాను’ అని అతడు మనకు ధైర్యం చెప్పి పుస్తకం అరువు తీసుకెళతాడు.
తిరిగి ఇస్తానని చెప్పిన గడువులోగా చదవడం పూర్తి కాదు. గడువు పొడిగిస్తాడు. చదవడం పూర్తవుతుంది. ఆ తర్వాత రకరకాల కాలయాపనలు అనివార్యంగా వాటిల్లుతుంటాయి. ఒక పట్టాన పుస్తకం తెచ్చి ఇవ్వడు. అడగడానికి కొంతకాలం వరకు మనకు మొహమాటం అడ్డొస్తుంది. చిట్టచివరకి అడిగితే.. ‘ఈలోగా ఎవరో తారసపడితే.. ఆ పుస్తకాన్ని వారిని కూడా చదవమని ఇచ్చా’ననే సమాధానం వస్తుంది. మనం హతాశులయిపోతాం.
మిత్రుడిని కాసేపు తిట్టుకుంటాం. కనీస సంస్కారం లేదని అనుకుంటాం. మనకు బుద్ధి తక్కువై పుస్తకం అతడికి ఇచ్చాం అని మనల్ని మనం నిందించుకుంటాం. ఎవరినుంచైనా పుస్తకం తెచ్చుకుంటే.. తప్పకుండా తిరిగి ఇవ్వడం కనీస బాధ్యత కదా.. అంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడసలు అని అనుకుంటూ ఉంటాం.
కానీ అదే మనం.. మరొక మిత్రుడినుంచి ఇంకొక పుస్తకం అరువు తెచ్చుకుంటే ఎలా వ్యవహరిస్తాం. చెప్పిన గడువులోగా తిరిగి ఇచ్చేస్తే సరే. అలా కాకుండా.. పుస్తకం తిరిగివ్వడంలో నిర్లక్ష్యం, దానిని మరోచోట చేజార్చుకోవడం వంటివి జరిగితే ఎలా ఉంటుంది?
ఆ విషయాన్నే ఈ సుభాషితం మనకు చెబుతుంది. ఇతరుల చేసే పని తప్పు అని మనకు చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ.. ప్రతిసారీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. అలాంటి పని మనం చేయకుండా ఉంటే చాలు అని!
మనం సంస్కర్తలు కానక్కర్లేదు..
సాధారణంగా మనం చేసే తప్పు ఒకటి ఉంటుంది. ఇతరుల పనులు తప్పుగా మనకు అనిపిస్తే.. వారిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. వారిని సంస్కరించడానికి ప్రయత్నిస్తాం. వారి తప్పును తెలియజెప్పి.. వారిలో మార్పు తీసుకురావాలని అనుకుంటాం. నిజంగా మనకు సన్నిహితులు, ఆప్తులు అయిన వారి విషయంలో ఇలా చేయడం అవసరం. అయితే మన పట్ల తప్పులు చేసే ప్రతి ఒక్కరినీ బాగు చేసుకుంటూ పోవడానికి మనం సంస్కర్తలు కాదు.
వారు చేసే తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి గొప్ప విషయం అలాంటి తప్పులు మనం చేయకుండా ఉండడం. ఇతరుల్లోని సంస్కార లోపాలను గమనించినప్పుడు.. మనం చేయగలిగిన గొప్ప పని.. మనల్ని మనం సంస్కరించుకోవడం. అంతే తప్ప- ఆ సమయంలో వారిని నిందించి, తప్పు పట్టి, బుద్ధి చెప్పి.. ఆ తర్వాత మరో సందర్బంలో మనం కూడా అలా ప్రవర్తించడం కానే కాదు.
మన లోపాలు మనకు పాఠాలు అయితే బాగు పడతాం. కానీ ఇతరుల లోపాలు కూడా మనకు పాఠాలు అయితే ఇంకా తొందరగా బాగుపడతాం.
శుభోదయం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post