ధర్మం అంటే ఏమిటో నిర్వచించడం, సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పేయడం అంత సులువు కాదు. ధర్మం అంటే మతం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. ధర్మం అనే పదానికి నిర్దిష్టార్ధం కాకపోయినప్పటికీ.. ధర్మం అనేది ఒక ఉదాత్తమైన జీవన శైలి.
మరి ఆ ధర్మం గుణాలు తెలుసుకోవడం ఎలాగ? ప్రత్యేకించి మనకు హిందూ ధర్మం అనే పదం విస్తృతంగా వాడుకలో ఉండడం వలన.. హిందుత్వం అనే మతమే- ధర్మం అని భ్రమపడే పరిస్థితి ఏర్పడింది. మతం వేరు- ధర్మం వేరు. హిందుత్వంలో అయినా ఇస్లాంలో అయినా మరే ఇతర మతంలో అయినా.. ధర్మం, ఆ మతం నిర్దేశించగల జీవనశైలిని మాత్రమే ప్రతిపాదిస్తుంది.
అలాంటప్పుడు.. హిందూ మతం చెప్పే ధర్మం ఏమిటి? హిందూ ధర్మం మౌలిక లక్షణాలను తెలుసుకోవడం ఎలాగ? ఒక సుభాషితం చాలా సరళంగా కొన్ని లక్షణాలను చెబుతుంది.
ధృతిః క్షమా దమో 2స్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహః
ధీర్విధ్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణమ్
ధైర్యం, క్షమించే గుణం, ఆత్మ నియంత్రణ, ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవడం, శుభ్రత- స్వచ్ఛత, ఇంద్రియ నిగ్రహం, తెలివితేటలు, అధ్యయనశీలత నేర్చుకునే తత్వం, నిజాయితీ- సత్యసంధత, కోపం పడకుండా ఉండడం అనే పది గుణాలు ధర్మం యొక్క లక్షణాలు. – అనేది శ్లోకభావం.
ధైర్యం నిజాయితీ లాంటి లక్షణాలు సాధారణంగా మనం ప్రతిసందర్భంలోనూ చెప్పుకునేవే. శుభ్రంగా, క్షమించే తత్వంతో ఉండడం గురించి కూడా ప్రతి ఒక్కరూ చెబుతారు. ఆత్మనియంత్రణ కూడా సరేసరి. ఇవన్నీ మనకు పెద్దలు చెప్పే అన్ని మంచిమాటల్లోనూ అలవాటు అవుతూ ఉంటాయి.
కానీ ఇందులో ప్రత్యేకంగా కనిపించే కొన్నింటిని మనం ప్రత్యేకంగానే గుర్తంచుకోవాలి. అవి- ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవడం. ఈ మాటకు అర్థం కేవలం ఇతరుల సొమ్మును దోచుకోవాలని అనుకోవడం మాత్రమే కాదు. ఇతరులతో పోల్చుకుని మనం కూడా అలా తయారుకావాలని ఎగబడడం. ఇది ఇంకోరకంగా ఉన్నదానితో తృప్తి చెందడం, మనకు అర్హమైనదేదో మనకు కావాలనుకోవాలి తప్ప.. ఇతరులకు ఉన్న స్థాయి మనకు కావాలని కోరుకోవడం తప్పు అనే అర్థాన్ని కూడా ఇది చెబుతుంది.
అధ్యయన శీలత నేర్చుకునే తత్వం ప్రతి మనిషికీ ఎంతో అవసరం. మరణించే వరకు కూడా ఈ తత్వం మనల్ని వీడిపోకూడదు. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే శ్రద్ధ మనలో సజీవంగా ఉండాలి. నిత్యం నేర్చుకునే తత్వం అనేది మనిషిని చివరివరకు కూడా చైతన్యశీలంగా ఉంచుతుంది.
అక్రోధో అనేది కూడా చాలా ముఖ్యం. కోపం రాకుండా ఉండడం. కోపం ఎందుకు వస్తుంది? ఎవరి మీద వస్తుంది? మనం ఆశించినది జరగకుండా, దక్కకుండా భంగపాటు ఎదురైనప్పుడు కోపం వస్తుంది. అవతలి వాళ్ల కోణంలో ఆలోచించలేకపోయినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం రాకుండా చూసుకోవాలి.
ఇలా వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే.. పది లక్షణాల సంతులన జీవనమే ధర్మం అనిపించుకుంటుంది.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post