ఆరోగ్యం మహా భాగ్యం అంటారు పెద్దలు. ఇది తిరుగులేని జీవిత సత్యం. ఎన్ని సంపదలు ఉన్నా సరే.. ఆరోగ్యాన్ని మించింది లేదు. కరోనా నిరూపించిన జీవిత సత్యాలలో అది కూడా ఒకటి.
ఎన్నెన్నో కష్టాలు పడి లక్షలకు లక్షలు కూడబెట్టిన కుబేరులంతా ఒక్క కరోనా దెబ్బకు నిరుపేదలు అయిపోయారు. ఉన్నంతలో జాగ్రత్తగా గుట్టుచప్పుడు కాకుండా బతుకుతున్న వాళ్లెందరో ఆస్తుల్ని, పుస్తెల్ని కూడా సమూలంగా అమ్ముకున్నారు. అప్పుల పాలైపోయారు. ఈ కష్టాలన్నీ కలిసి ‘ఆరోగ్యం మహాభాగ్యం’ అని మనం చదువుకున్న సత్యాన్ని మరింత ఘాటుగా, చేదుగా నిరూపించాయి.
అయితే ‘మహాభాగ్యం’ అనేది ఆరోగ్యం మాత్రమేనా? ఇంకేమీ.. దానితో సరితూగగలిగేవి.. మనం మహాభాగ్యంగా ఎంచగలిగేవి లేవా? అంటే, ఉన్నాయి. ఓ సుభాషితం మనకు అసలైన భాగ్యాలేమిటో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఆరోగ్యం విద్వత్తా సజ్జన మైత్రీ మహాకులే జన్మ
స్వాధీనతా చ పుంసాం మహదైశ్వర్యం వినాప్యర్థైః
మంచి ఆరోగ్యం, తెలివితేటలు- జ్ఞానం, మంచివారితో చేసే స్నేహం, గొప్పఇంటిలో జన్మించడం (కులం అంటే మనం అనుకునే అర్థం కాదు- సమూహం అని! మంచివారుండే కుటుంబంలో పుట్టడం అనేది భావం), స్వావలంబన- పనులకు ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం.. డబ్బుతో సంబంధం లేకుండా మహదైశ్వర్యాలుగా, మహద్భాగ్యాలుగా పరిగణించదగినవి. -అనేది శ్లోకభావం.
వీటిలో ఆరోగ్యం గురించి మాత్రం మనకు తెలుసు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేనే లేదని- ఈ సమయంలో ఎవరిని అడిగినా ఒప్పుకుంటారు. ఆ స్థాయిలో కాకపోవచ్చు గానీ.. మిగిలినవి కూడా మహాభాగ్యాలే. తెలివితేటలు, జ్ఞానసంపద ఉన్నవాడు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా నెగ్గుకు రాగలడు. ఏదో ఒక ఆధరవు చూసుకోగలడు.
అలా మంచి వాళ్లతో స్నేహం కూడా. మంచి స్నేహం ఎప్పుడూ కూడా మనకు అతిపెద్ద బలం. మనకు ఏ కష్టం వచ్చినా ఆ స్నేహం ఆదుకుంటుంది కాబట్టి. గొప్ప ఇంటిలో పుట్టడం అంటే.. మంచి అలవాట్లు ఉండే ఇంటిలో పుట్టడం, మంచి ఆలోచనలు ఉండే ఇంటిలో పుట్టడం.
స్వావలంబన, స్వాధీనత అనే పదాలు కూడా మరో రకంగా మన సామెతలు చెప్పే విషయాలే. ‘అప్పులేని వాడు అధిక సంపన్నుడు’ అంటాం మనం. అప్పులేకపోవడం అంటే అదే.. ఇతరుల మీద ఆధారపడకుండా ఉన్నంతలో బతకడం. అలాగే.. ఈ స్వావలంబన అనేది కేవలం ఆర్థిక విషయాలకే కాదు, ఇతర పనులకు కూడా వర్తిస్తుంది. వృద్ధులను పలకరించి చూడండి.. దైనందిన వ్యవహారాలకు ఒకరి మీద ఆధారపడకుండా మరణించడాన్ని మించిన అదృష్టం లేనేలేదని అంటుంటారు. స్వావలంబన అంటే అదే.
అందుకే సుభాషితం ఈ అయిదు లక్షణాలను మహాభాగ్యాలుగా పేర్కొంటుంది.
శుభోదయం.
Discussion about this post