వాట్సప్ లో అసభ్య, అనుచిత పోస్టులను సభ్యులు ఎవరైనా పెడితే.. కేసులు నమోదు అవుతాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ.. ఈ కేసులు.. సదరు పోస్టులు పెట్టిన వారి మీద మాత్రమే కాదు.. ఆ గ్రూప్ ఎడ్మిన్ల మీద క డా నమోదు అవుతాయి. వారు కూడా శిక్షలు అనుభవించాల్సిందే. ఏదో like minded మిత్రులను ఒక చోట చేర్చడానికి ఒక వాట్సప్ గ్రూపు స్టార్ట్ చేసి ఎడ్మిన్ గా నడుపుతున్న వారు.. గ్రూపులో ఎవరో ఒకరు తుంటరి పని చేస్తే.. తాము కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
వాట్సప్ గ్రూపులకు ఎడ్మిన్ బాధ్యతలు నిర్వహించే వారికి ఇప్పుడు ఆ బాధలు తొలగిపోనున్నాయి. కనీసం తగ్గనున్నాయి. కాకపోతే.. వారు కొంచెం కఠినంగా, కొంచెం అప్రమత్తంగా.. వాట్సప్ గ్రూపు నిర్వహణ అనేది ఒక రెగ్యులర్ డ్యూటీలాగా కష్టపడాల్సి ఉంటుంది. సభ్యులు పెట్టే పోస్టులను ఎడ్మిన్ లు తొలగించడానికి, డిలీట్ చేయడానికి వీలుగా వాట్స్ కొత్తగా ఆప్షన్ ఇవ్వనుంది. దీంతో ఎడ్మిన్ కష్టాలు తగ్గుతాయి.
ప్రస్తుతం గ్రూపు ఎడ్మిన్ లకు గ్రూపులో మెంబర్లను చేర్చడానికి మాత్రమే అధికారం ఉంటుంది. ఎవరైనా తుంటరి, అసభ్య, వివాదాస్పద పోస్టులు పెట్టినప్పుడు.. ఆ సభ్యులను డిలిట్ చేయాల్సిందిగా కోరడం మాత్రమే వారు చేయగలిగిన పని. పోస్టు వివాదంగా మారితే.. శిక్షను వారు కూడా పంచుకోవాల్సి ఉంటుంది. ఆ పోస్టుతో ఎలాంటి సంబంధం లేకపోయినా శిక్ష తప్పదు. సదరు పోస్టు పెట్టిన వ్యక్తి తమ మాట వినకపోయినా, దానిని డిలీట్ చేయించడానికి అందుబాటులో లేకపోయినా.. ఎడ్మిన్లు కూడా శిక్షార్హులే!
ఇప్పుడు సభ్యులు పెట్టే పోస్టును ఎడ్మిన్ కూడా డిలీట్ చేయడానికి అధికారం ఇవ్వబోతోంది వాట్సాప్. దీనివలన సభ్యులు పోస్టు పెట్టేసి.. తర్వాత డిలిట్ చేయడం గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా.. స్వయంగా ఎడ్మిన్లే దానికి కత్తెర వేసేయగలరు. తొలగించగలరు. ఇప్పటిదాకా ఈ ఫీచర్ లేకపోవడం వలన చాలా మంది ఎడ్మిన్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. సభ్యులు అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు.. డిలీట్ చేయమన్నప్పుడు వారు మాట వినకపోతే.. వారిని గ్రూపులోంచి రిమూవ్ చేయడం తప్ప మరో దారి ఉండేది కాదు. ఇప్పుడు ఆ కష్టాలు తొలగినట్టే.
డిలిట్ చేయడంలో మరో సౌలభ్యం..
వాట్సప్ లో మనం మెసేజి పెట్టిన తర్వాత.. దానిని delete for everyone కొట్టడానికి ఇప్పటిదాకా 1.08 గంటల టైం మాత్రమే ఉండేది. అంటే ఏదైనా పోస్టును పొరబాటుగా పెట్టేసినా.. లేదా.. పెట్టిన పోస్టును అవతలి వాళ్లకు కూడా కనిపించకుండా డిలిట్ చేసేయదలచుకున్నా.. ఇప్పటిదాకా గంట సమయం మాత్రమే ఉండేది. ఆలోగా డిలిట్ చేయకపోతే ఇబ్బంది పడేవారు. అయితే ఆ కష్టాలు కూడా ఇక తొలగనున్నాయి.
ఈ టైం లిమిట్ అనేదే లేకుండా.. పెట్టిన పోస్టును ఎన్ని రోజుల తర్వాత అయినా delete for everyone చేసేలా వాట్సప్ వెసులుబాటు ఇవ్వనుంది. తాము పెట్టిన మెసేజీలను అవతలివాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని అనుమానం వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఎడ్మిన్లకు లాభమే.
ఎందుకంటే.. ఏదైనా అభ్యంతరకరపోస్టు ఎవరైనా మెంబర్ పెట్టినప్పుడు.. దానిని తొలగించాల్సిందిగా ఎడ్మిన్ కోరుతారు. వాళ్లు ఓ గంట తర్వాత రెస్పాండ్ అయి.. ‘టైం అయిపోయింది.. డిలిట్ కావడం లేదు’ అని తప్పించుకుంటారు. అలాంటి అవకాశం లేకుండా.. టైం లిమిట్ లేకుండా.. delete for all చేయొచ్చు.
విష ప్రచారాలు తగ్గుతాయా?
వాట్సప్ ద్వారా విషపూరిత విద్వేష పూరిత ప్రచారాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. కులాలను మతాలను రెచ్చగొడుతూ పోస్టులు పెడుతున్న వారు అనేకులు. పార్టీలకు అనుకూలంగా ఉండే వ్యక్తులు.. ఇతర పార్టీల గురించి విద్వేష పూరిత ప్రచారాన్ని వాట్సప్ ద్వారానే ఎక్కువగా వ్యాప్తిలో పెడుతూ ఉంటారు. గ్రూపుల్లో ఇలాంటి విషయం మరీ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి విష ప్రచారాలకు ఈ కొత్త ఫీచర్లతో చెక్ చెప్పవచ్చు.
ఎడ్మిన్ల చేతికే కత్తెర వచ్చినట్లయితే.. ఎప్పటికప్పుడు వారు తప్పుడు పోస్టులను డిలిట్ చేసేసి.. వారి గ్రూప్ మర్యాదను కాపాడగలరు. అయితే.. ఎడ్మిన్ లు నిరంతరం అప్రమత్తంగా పోస్టులను గమనిస్తూ ఉండాలి. ఒక గ్రూపులో ఎక్కువమంది ఎడ్మిన్లు ఉన్నా సరే.. వారందరికీ ఈ డిలిట్ చేసే అధికారం ఉంటుంది గనుక.. పనిభారం అనిపించదు. గ్రూపులు సవ్యంగానే నడిచే అవకాశం ఉంటుంది.
.