ఈనాటి వేడుకకు ప్రధాన కర్త అయిన మా గురునాథం బావకి, మా బావ సతీమణి శైలజక్కకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు.
‘గురునాథం బావ’ గురునాథం ఆ పేరులోనే గురుతత్వం ఉంది. గురువు అంటే జ్ఞానం. నాథం అంటే శబ్దం, ప్రవాహం అనే అర్థం కూడా వస్తుంది. గురునాథం అంటే జ్ఞాన ప్రవాహం. నిజంగానే మా బావ జ్ఞాన ప్రవాహం. తన జ్ఞానాన్ని ఎంతో మంది విద్యార్థులకు పంచి వాళ్ళ జీవితాలలో జ్ఞానజ్యోతులు వెలిగించిన గొప్ప వ్యక్తి మా బావ. అందుకే గురునాథం అనే పేరుకి సార్థకత సాధించిన ధన్యజీవి.
‘గురునాథం బావ’ అనే పదంలో గురునాథం అంటే ఏమిటో చెప్పాను. ‘గురునాథం బావ’ అనే పదంలో మిగిలిన బావ అనే పదానికి మా బావను చూస్తే నాకు ఒక కొత్త అర్థం స్ఫురిస్తోంది. బావ అంటే బాధలను వదిలించువాడు. నిజంగానే ఎంతోమందికి బాధలను వదిలించిన మంచి మనిషి మా బావ.
సాధారణంగా ఉపాధ్యాయుడు బడికి సమయానికి వెళ్ళి తనకు సంబంధించిన సబ్జక్టు చెప్పుకుని, చివరి గంట కొట్టగానే వచ్చేస్తారు. తర్వాత బడి గురించి ఆలోచించరు. కానీ మా బావ బడి గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు బాగా చదివే విద్యార్థులు స్థోమత లేకపోవడంవలనగాని, కుటుంబ సమస్యల వలనగాని అర్థాంతరంగా చదువు మానేస్తుంటారు. అలాంటి విద్యార్థులను సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ, మా బావ వాళ్ళను వదలరు. వాళ్ళింటికి వెళ్ళి, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, అవసరమైతే ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ విద్యా ఉన్నతికి దోహదపడ్తారు. అందుకే మా బావ బాధలను వదిలించిన వ్యక్తిగా
సఫలీకృతులైనారు.
మనిషి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం. కానీ, చాలామంది ఆ సమస్యలకు భయపడిపోయి బెంబేలెత్తిపోయి జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉంటారు. కానీ, కొంతమంది ఎలాంటి సమస్యనైనా లెక్కచేయకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలకు ఎదురొడ్డి విజయం సాధిస్తారు. అలా విజయం సాధించిన వ్యక్తులలో మా బావ కూడా ఒకరు.
మా బావకు 24 సంవత్సరాల వయస్సులో తండ్రి చనిపోయారు. అప్పటికి తన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు. తమ్ముడు హైస్కూల్లో చదువుకుంటున్నాడు. మా బావ చదువుకున్నా ఆ సమయానికి ఉద్యోగం రాలేదు. దిక్కుతోచని పరిస్థితి. కుటుంబాన్ని ఎలా పోషించాలనే సందిగ్థ పరిస్థితి. అయినా అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతో ఉన్న రెండెకరాల పొలంలో ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ, మరోపక్క కష్టపడి చదివి, చదువు చెప్పే ఉద్యోగం సంపాదించాడు.
తర్వాత క్రమంగా తన ముగ్గురు అక్కచెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశారు. తమ్ముడ్ని చదివించి ఉద్యోగంలో స్థిరపడేటట్లు అవకాశం కల్పించారు. మంచి చేసిన వ్యక్తికి మంచే జరుగుతుంది అనే దానికి ఉదాహరణగా బాగా చదువుకున్న మా శైలజక్కను వివాహం చేసుకున్నారు. పెళైన తర్వాత జీవితం సాఫీగా జరగాలంటే జీవిత భాగస్వామి సహకారం చాలా అవసరం. మా అక్క కూడా మా బావ ఆశయాలను, ఆకాంక్షలను గౌరవించి ఎంతో తోడ్పాటు అందించింది. అందుకే మా బావ అక్కాచెల్లెళ్లను పెళైన తర్వాత కూడా వదిలేయలేదు. వాళ్ళ పిల్లల్ని కూడా తన ఇంటి దగ్గర పెట్టుకుని చదివించారు. ఆ పిల్లలందరూ ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు.
లోకంలో చాలామంది నేను ఆ సేవ చేశాను. ఈ సేవ చేశాను అంటుంటారు. వాళ్ళు చెప్పే సేవలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అసలు సేవ అంటే అర్థం ఏమిటి? ప్రతిఫలం ఆశించకుండా చేసేది ఏదైనా సేవే. ఇప్పుడు మా బావ చేసిందే నిజమైన సేవ. ఎందుకంటే తన అక్కాచెల్లెళ్ళకు పెళైన తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని చదివించారు. బాగా చదివే స్థోమతలేని పిల్లలకు చేయూతనిచ్చారు. ఇందులో తన స్వార్థం ఏమైనా ఉందా? అంటే లేదు. ఇదే నిజమైన సేవ.
అసలు మా బావలాగ వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంపూర్ణంగా న్యాయం చేయగలిగితే అదే అసలైన దేశసేవ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్వరినీ యాచించడం అవసరం ఉండదు. ప్రభుత్వం మీద కూడా ఆధారపడనవసరంలేదు. మనకు ఎవరు ఏమి ఇస్తారు అని కాకుండా మనం ఎవరికైనా ఏమైనా ఇవ్వగలమా అనే మైండ్ సెట్ ని అందరూ అలవరచుకుంటే ఏ కుటుంబమైనా, ఏ దేశమైనా ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అందుకు మా బావే ఉదాహరణ.
మా బావ అలా ఆలోచించారు కాబట్టే ఈరోజు వాళ్ళ అబ్బాయి నవీన్ కుమార్, కోడలు సౌందర్య ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు. అంతేకాదు అద్భుతమైన ఇల్లు కూడా కట్టుకున్నారు. ఒక మనిషికి ఇంతకన్నా ఏంకావాలి.
ఇక ఇవాళ మా బావ పదవీ విరమణ చెందుతున్నారు. ఎందుకో పదవీ వరమణ అనే పదం నాకు నచ్చదు. పదవీ విరమణ కంటే పదవీ విడుదల అంటే సముచితంగా ఉంటుందేమోనని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ప్రధానోపాధ్యాయుల కుర్చీ ముళ్ళ కుర్చీ. అందులో కూర్చోవడం చాలా కష్టం. ఈనాడు పాఠశాలలో రకరకాల యాప్స్, నాడు -నేడు పనులు, ఉపాధ్యాయులను సమన్వయ పరచుకోవడంలో రకరకాల సమస్యలు, పై అధికారుల
నుంచి ఒత్తిడి. ఇన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాలంటే మామూలు మనుషులకు సాధ్యంకాదు. మా బావ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదొడుకులు చూశారు కాబట్టే ప్రధానోపాధ్యాయ పదవిని కూడా సమర్థవంతంగా నిర్వర్తించగలిగారు. ఏది ఏమయినా ఆ పదవి నుంచి ఇవాళ విడుదల అవుతున్నారు. కాబట్టి ఎంతో సంతోషించాలి.
చివరగా ఓ మాట –
ఇలాంటి సందర్భాల్లో చివర్లో ఓ మాట అంటుంటారు. వీరి శేష జీవితం ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని. ఇందులో శేష జీవితం అనే మాట కూడా ఎందుకో నాకు రుచించదు. ఎందుకంటే గణితంలో మనం భాగహారం వేసేసిన తర్వాత సాధారణంగా శేషం సున్నా వస్తుంది. సున్న అంటే అర్థం శూన్యం. అంటే ఏమీలేదని. ఒక్కోసారి శేషం అంకెలలో కూడా వస్తుంది. అయితే ఆ అంకెలు కూడా తక్కువ విలువను కలిగి ఉంటాయి. అంటే దీనిని బట్టి పదవీ విరమణ తర్వాత ఇక జీవితం ఏమీలేదనే అర్థం స్ఫురిస్తుంది. అందుకని శేష జీవితం అనే పదం నచ్చదు.
అందుకే నేను ఏమంటానంటే శేష జీవితం కంటే స్వేచ్ఛా జీవితం అంటాను. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి? తనలో భావాలను, ఆశలను, ఆకాంక్షలను ధైర్యంగా చెప్పగలగడమే స్వేచ్ఛ. మరి పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా తన భావాలను ధైర్యంగా చెప్పగలరా. చెప్పలేరు. ఇక ఇప్పుడు పదవి నుంచి విడుదల అయ్యారు కాబట్టి ధైర్యంగా ఏదైనా మాట్లాడవచ్చు.
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలనే కోరుకుంటారు. కానీ, స్వేచ్ఛగా ఉండటానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే స్వేచ్ఛ కావాలంటే మనంచేసే పనిపట్ల కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, బాధ్యతగా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే లోకంలో మానవ హక్కుల సంఘాలు ఉన్నాయేగాని, మానవ బాధ్యత సంఘాలు లేవు. బాధ్యతలను ఇతరులపైకి నెట్టేస్తుంటాం. అందువల్ల స్వేచ్ఛ అనేది మనకు ఆమడదూరంలో ఉండిపోయింది. కానీ మా బావలో హక్కుల గురించి మాట్లాడే ధైర్యమూ ఉంది. బాధ్యతగా ఉండడం కూడా నిరూపించారు. కాబట్టి మా బావ నిజమైన స్వేచ్ఛాజీవి.
అందుకే మా బావ తన స్వేచ్ఛా జీవితాన్ని మరో ఇరవై ఐదు యేండ్లు ఆరోగ్యంగా, మనశ్శాంతిగా జీవించాలని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ప్రార్థిస్తున్నాను.
నాకు ఈ అవకాశం కల్పించిన సభపై నున్న పెద్దలకు, ఇంతసేపు నా మాటలు విన్న ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ఒబ్బు రవికుమార్, గురుదశ ప్రకాశరావు, సుజాత, జయశంకర్, శ్రీలక్ష్మి, రామసుబ్బమ్మ, నవీన్ కుమార్, సౌందర్య, మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post