‘సత్వర రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టే పార్టీ స్థాపించా’నని ప్రకటించిన షర్మిల పార్టీకి ఆదిలోనే దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో ఇప్పటి వరకు షర్మిల తప్ప.. ప్రజలు గుర్తించగలిగిన నాయకులు మరొకరు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. పార్టీలో నాయకులను ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉంటే.. ఆ పార్టీ రాజకీయ అవసరాలు తీరేదెలాగ? మనుగడ ఎలాగ? అన్నది పెద్ద ప్రశ్న! అయితే.. ఇప్పుడు పార్టీలో ఉన్నవారిలో కూడా పక్క చూపు చూస్తున్న నాయకులెందరో.
ఈ పరిణామాలను గమనిస్తోంటే.. తెలంగాణలో సత్వర రాజకీయ అవసరం ఇప్పుడు లేదా? లేక షర్మిల పార్టీని ఎవరూ అదరించడం లేదా? అసలు షర్మిల ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? ఆదిలోనే ఇంత అనాదరణ, భయంకరమైన దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? అనేవి ఇప్పుడు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.
షర్మిల పార్టీ స్థాపించిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. షర్మిల చెంతకు చేరారు ఇందిరా శోభన్. పార్టీలో కొన్నాళ్లపాటు అంతా సజావుగానే సాగింది. అతి కొద్దికాలంలోనే ఆమె పార్టీకి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అంతో ఇంతో ప్రజల్లో తిరుగుతూ.. వచ్చే ఎన్నికల నాటికి నేనే అధికారంలోకి వచ్చేస్తా అని చెబుతున్న షర్మిలను విడిచిపెట్టి.. తెలంగాణలో అసలు చురుకైన పొలిటికల్ యాక్టివిటీనే లేని.. ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుచుకుని ఆమె ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. అంటే భవిష్యత్తును కోరుకుంటున్న ఒక నాయకురాలి దృష్టిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కంటె ఆమ్ ఆద్మీ మేలని అనిపిస్తోందా? అనే సందేహం కలుగుతుంది.
అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు షర్మిలకు దగ్గరానే ఉన్నా.. పార్టీలో పెరుగుతున్న వ్యతిరేకతల కారణంగా ఆచితూచి ఉంటున్నారు. అయితే ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామాలు చేయడం ఇప్పుడు కలవర పెడుతున్న అంశం. గట్టిగా చెప్పాలంటే తెలంగాణలో ఒక్క స్థానం నుంచి అయినా గట్టి పోటీనిచ్చే ఎమ్మెల్యే అభ్యర్థి ఆ పార్టీకి లేరు. ఇలాంటి పార్టీ ఉద్యమాల తెలంగాణలో ఎలా రాజకీయంగా అభివృద్ధి చెందుతుంది అనేది షర్మిల మదిలో మెదలుతున్న ప్రశ్న.
అయితే ఇటీవల తెరాసలో ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడి భంగపడ్డ బీసీ నేత గట్టు రామచందర్ రావు ఇప్పుడు షర్మిల చెంతకు చేరారు. గతంలో తెలంగాణలో వైకాపా పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు.
ఉద్యమం తీవ్రస్థాయలో ఉన్నప్పుడు.. వైకాపా తరఫు గట్టి వకాలత్ పుచ్చుకొని మాట్లాడేవారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైకాపాకి రాజీనామ చేసి అధికార పార్టీ తెరాసలో చేరారు. ఇప్పుడు మళ్లీ తెరాసకు రాజీనామా చేసి షర్మిల పార్టీలో చేరారు. కాగా ఆయన వల్ల పార్టీ కి లాభమా, నష్టమా అనేది ఆలోచన చేసే ముందు.. అతను చెబితే వంద మంది కూడా వచ్చి నిలబడే ప్రసక్తే లేదని స్థానిక నాయకులు చెబుతున్నారు.
ఇలాంటి తరుణంలో అతీగతీ లేక, టీఆర్ఎస్ ఆదరించక.. మరెక్కడకు వెళ్లే తోవ లేక షర్మిల పార్టీలో చేరాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ రాజకీయాల్లో నెట్టుకు రావాలంటే పార్టీ ఒకటి ఉంటే చాలాదు.. ఆ పార్టీ నుండి గట్టిగా వాణి వినిపించే నాయకులు కావాలి! అంతే కానీ.. రాష్ట్ర ప్రజలకు పేర్లయినా తెలియని నాయకులు ఉంటే ఎలా అని షర్మిల పార్టీలోని నాయకులే అంటున్నారు.
వాస్తవానికి తెలంగాణలో కనిపిస్తున్న ‘సత్వర రాజకీయ అవసరం’ షర్మిల మదిలో పుట్టిందా.. లేక సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ కలయికలో పుట్టిందా.. అనేది చాలామందిలో ఉన్న సందేహం. గతంలో మా చెల్లి తెలంగాణలో ఉండి తమ మాట వినిపిస్తుందని బహిరంగ వేదిక ద్వారా జగన్ తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్‌కి చేదోడు వాదోడుగా కేసీఆర్ అండగా నిలిచి గెలిపించారు. అందుకు రాజకీయ గురు దక్షిణ క్రింద.. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం షర్మిలతో పార్టీ పెట్టించారని ఓ ప్రచారం.
తెలంగాణలో పార్టీ పెట్టారు కానీ.. అందుకు తగ్గ పోటీ ఉండాలి కదా మరీ. అతీ గతీ లేకుండా నడిపితే ప్రజల ముందు నవ్వుల పాలు అవుతారు కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందిరాశోభన్ పార్టీని వీడి వెళ్లడం ఒక్కటే పార్టీ బలహీనతకు పెద్ద సంకేతం కాకపోవచ్చు. కానీ.. పార్టీ బలంగా ఉందనడానికి ఒక్క సంకేతం కూడా లేకపోవడం మాటేమిటి. ఒక్కో నాయకుడు పార్టీని వీడుతుంటే అక్క పార్టీ దిక్కులేనిదిగానే మిగలనుందా అనేది కాలమే నిర్ణయించాలి.
.. కె. శ్రీనివాస్

.

Discussion about this post