ముక్కంటి భక్తులకు శుభవార్త. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం కైలాసగిరి ప్రదక్షిణ యథావిథిగా నిర్వహించనున్నారు. భక్తుల కోరిక ఈ సమస్యను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు దృష్టికి తీసుకెళ్లారు. గిరిప్రదక్షిణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి… కొవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవం జరుపు కోవడానికి అనుమతించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి యేటా సంక్రాంతి పర్వదినం మరుదినం కైలాసగిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదిదంపతుల కల్యాణానికి కైలాసగిరుల్లో కొలువై ఉన్న సకల దేవతా గణాలను, మునులను. రుషులను ఆహ్వానించడానికి కనుమ పండుగ రోజున గిరిప్రదక్షిణకు వెళతారు.
ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. శివ, పార్వతుల ఉత్సవ మూర్తుల వెంట వందలాది మంది భక్తజనం కొండచుట్టుకు వెళతారు. ఈ యేడు కూడా కొండచుట్టు ఉత్సవానికి ముక్కంటి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొవిడ్ మూడవ దశ ఉధృతి నేపథ్యంలో గిరిప్రదక్షిణ రద్దు చేసి… ఆలయం లోపల మాత్రమే ఉత్సవం నిర్వహించాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ముక్కంటి ఆలయ అధికారులు కైలాసగిరి ప్రదక్షిణ రద్దు చేశారు. అయితే ఈ విషయమై శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి శనివారం రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషరుతో మాట్లాడారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు కైలాసగిరి ప్రదక్షిణ ఎంతో ముఖ్యమని… భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అనుమతి వ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆయన విజ్ఞప్తితో కొండచుట్టు ఉత్సవానికి దేవదాయశాఖ కమిషనరు అనుమతించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ ఉత్సవం నిర్వహించుకోవాలని సూచించారు. ఆయన సూచనల మేరకు కొండచుట్టు ఉత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొండ్చుట్టు ఉత్సవంలో పాల్గొనాలని శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా కొండచుట్టు ఉత్పవానికి అనుమతి తెప్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలియచేశారు.
Discussion about this post