కృష్ణం వందే జద్గురుమ్. ఈ సర్వ జగత్తుకు కర్త, జగన్నాటక సూత్రధారి, రక్షకుడు శ్రీ కృష్ణుడు. ద్వాపరయుగం అంతంలో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు కలిసి ఆయనని విడిచి ఉండలేను అంటాడు. అప్పుడు కృష్ణుడు ద్వాపరయుగాంతం కలియుగం ప్రవేశిస్తుంది.
ఈ యుగంలో మానవులు అదుపులేని కోరికలు, కోపం, అధర్మం, నేర చిత్తం ఇంకా అనేకానేక మానసిక రుగ్మతలతో నిత్యం అశాంతితో ఉంటారు. వీటన్నిటినుంచి మానవులను కాపాడడానికి అద్భుతమైన, అపారమైన శక్తులు, రహస్యాలను నిక్షిప్తం చేసియున్న తన కాలి సువర్ణ కడియాన్ని ఉద్ధవుడి చేతికి ఇచ్చి, ఈ కడియంని లోకకల్యాణం కోసం ఉపయోగించే మనిషి నీకు తారసిల్లినప్పుడు అతనికి కడియంని ఇవ్వు” అని కృష్ణుడు ఉద్ధవునికి చెప్పి అంతర్ధానం అవుతాడు. ఆ కడియాన్ని ఒక ప్రదేశంలో ఉంచుతాడు. దాన్ని చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. అర్హులైనవారికి ఆ కడియం దొరుకుతుంది. చివరకు ఆ కడియం ఎలా దొరికింది అనేది స్థూలంగా “కార్తికేయ 2” సినిమాలోని మూల కథ.
ఇక సినిమా కథలోకి వస్తే కార్తీక్ (నిఖిల్) డాక్టర్. జరిగే ప్రతి సంఘటనకు కారణాలు అన్వేషిస్తూ, విజ్ఞాన శాస్త్రమే నమ్మదగినది అనుకుంటాడు. కార్తీక్ అమ్మ (తులసి) జరిగే ప్రతి సంఘటన భగవంతుని మహత్తే అని నమ్మే భక్తురాలు. సినిమా తొలి అంకంలో ఇద్దరికీ వారి నమ్మకాల పట్ల భేదాభిప్రాయాలు వస్తూ ఉండేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి.
‘‘అద్భుతం జరిగిందని నేను నమ్మను. నేను నమ్మాను కాబట్టి అద్భుతం జరిగిందని దేవుడిని నమ్ముతాను’’ అంటుంది తల్లి. జరిగినదాన్ని లాజిక్ తో ఆలోచించమంటాడు కార్తీక్.
ఈ క్రమంలో తల్లి మొక్కు చెల్లించడం కోసం వారు ద్వారకా నగరం వెళ్లడం జరుగుతుంది. అక్కడ జరిగిన కొన్ని అనూహ్యసంఘటలతో కార్తీక్ మీద హత్యానేరం మోపబడుతుంది.
హత్యకు గురైన పెద్దమనిషి ప్రొఫెసర్ రంగనాధ రావు (కే.ఎస్. శ్రీధర్) నిజాయితీ గల శాస్త్రవేత్త. ద్వాపర యుగంలో ఉద్ధవుడి వద్ద ఉన్న కడియం గురించిన సమాచారంకు సంబంధించిన రహస్యాలు ఉన్న పత్రాల గురించి కార్తీక్ కి సూచనప్రాయంగా తెలిపి ప్రాణాలు విడుస్తాడు. అతన్ని హత్య చేయించిన విలన్ డాక్టర్ శాంతను (ఆదిత్య మీనన్) స్వార్ధపూరితమైన కుయుక్తులతో కార్తీక్ ని కూడా చంపాలని చూస్తాడు. ప్రొఫెసర్ రంగనాధ రావు మనుమరాలు ముగ్ద (అనుపమ పరమేశ్వరన్), మిత్రుడు సదానంద (శ్రీనివాసుల రెడ్డి) సాయంతో శత్రువులను తప్పించుకుంటూ, గోవర్ధన పర్వతం పైన ఉన్న కృష్ణుని వేణువు లాంటి టెలీస్కోప్ ని దొరకబుచ్చుకుంటాడు.
అటు తర్వాత ప్రొఫెసర్ రంగనాధ రావు సూచించిన మార్గంలో వెళుతూ ఓ పెద్దమనిషి, అంధుడు అయిన ధన్వంతరి వేద్ పాఠక్ (అనుపమ్ ఖేర్) ని కలుస్తాడు. ఆయన శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలిపి, కృష్ణుడు ఎలా జగద్గురువు అయింది తెలుపుతాడు. వీరందరి సాయంతో చివరకు కార్తీక్ కడియం ని నిక్షిప్తం చేసి ఉండే ప్రాంతాన్ని ఎలా చేరాడు, కడియం అతనికి దొరికిందా, అది పొందేందుకు అతను అర్హుడా కాదా అనేది సినిమాలో చూడాలి.
డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాలో ఎక్కడా రాజీపడలేదు. బలమైన కథావస్తువు, కృష్ణుడే జగద్గురువు అంటూ మురళీధరుని గురించి అనుపమ్ ఖేర్ చేత చెప్పించిన తీరు అద్భుతం. యానిమేషన్ తో కృష్ణుడు, ఉద్ధవుని సంభాషణలు, జంతువులు, పక్షులు, ప్రకృతి, ద్వారకా నగరం చూపించడం సినిమాకు అదనపు ఆకర్షణ.
ట్రక్ డ్రైవర్ సులేమాన్ పాత్రలో వైవా హర్ష, సదానంద పాత్రలో శ్రీనివాసుల రెడ్డి హాస్యాన్ని పండించారు. అనుపమ పరమేశ్వరన్ తన సహజ నటనతో తన పాత్రకు న్యాయం చేసింది. సినిమా కథకు అవసరం లేని ప్రేమ, చెట్టు, పుట్టల వెంబడి తిరిగే పాటలు లేకపోవడం వల్ల సినిమా ఆ పరిధిలో కలుషితం కాలేదు.
ఇక హీరో నిఖిల్ సినిమా మొత్తానికి వెన్నెముకలా, దృఢమైన వ్యక్తిత్వం గల పాత్రలో తాను నమ్మిన సిద్ధాంతంతో పాటు, తనకు తెలియని సృష్టి రహస్యాలను, దైవబలాన్ని గౌరవించే ఉన్నతమైన పాత్రలో జీవించాడు.
కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ మంత్రంలా మాయ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కథలో కొన్ని చోట్ల, క్లైమాక్స్ సన్నివేశాల్లో పాములు, కడియం ఉన్న ప్రదేశం వంటివి పాత విఠలాచార్య సినిమాల అనుకరణలా అనిపించింది. ఆ సన్నివేశాలు ఇంకాస్త కొత్తదనంతో చేసిఉంటే బాగుండేదని అనిపిన్తుంది. కార్తికేయ 1 సినిమాతో ఎక్కడా పోలిక లేదు ఈ సినిమాలో.
మొత్తానికి కార్తికేయ 2 సినిమా.. శాస్త్రానికి- దైవానికి, నమ్మకానికి- దైవానికి మధ్య జరిగే సంఘర్షణని విభిన్న కోణాల్లో చూపించిందని చెప్పవచ్చు. అందరు చూడదగ్గ సినిమా ఇది.
..రోహిణి వంజారి
Discussion about this post