బుధవారం గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్టు ఎస్ ఏ కరీం (66) అంత్యక్రియలు గురువారం అత్తాపూర్ లో నిర్వహించారు.
సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, టెన్ టీవీ వంటి పలు ప్రసార మాధ్యమాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కరీంకు బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు గుండెనొప్పి రావడంతో దగ్గరలోని ప్రీమియర్ హాస్పిటల్ కు తరలించారు.
డాక్టర్లు మూడు స్టెంట్లు వేసిన తర్వాత కొంత కోలుకున్నట్టే కనిపించిన కరీం రాత్రి పది గంటల సమయంలో మరణించారు.

ఆయన మృతి వార్త తెలుసుకుని గురువారం ఉదయం నుంచి పలువురు జర్నలిస్టులు, మిత్రులు, సామాజిక కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అత్తాపూర్ సమీపంలోని కరీం నివాసానికి వచ్చి నివాళులర్పించారు.
సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి దగ్గరలోని మసీదులో ప్రార్థనల అనంతరం ఖననం చేశారు.
ఆయన పనిచేస్తున్న 10 టీవీ సీఈవో సింగారావు, సీనియర్ జర్నలిస్టులు, మిత్రులు సాక్షి మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, గోవింద్ రెడ్డి, ఐ సత్యనారాయణ, నాగయ్య చౌదరి, జానకిరామారావు, భరద్వాజ రంగావఝల, తాడి ప్రకాశ్, వొమ్మి రమేశ్ బాబు, సజయ, తులసి చందు, వెంకట్, బుడాన్, మనోహర్ తదితరులు కరీం నివాసానికి వచ్చి నివాళులర్పించారు.

.