ఏపీలో మందుబాబులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. సినిమా టికెట్లను చవగ్గా అందించి, పేదా గొప్పా తేడా లేకుండా, అంతో ఇంతో అందరికీ సమానంగా మేలు చేయాలనుకున్న సర్కారు.. కోర్టు అడ్డుకునే సరికి.. ఆ మేలును లిక్కర్ మీదికి మళ్లించింది. ఇక్కడ కూడా పేదా గొప్పా తేడా లేకుండా అందరికీ మేలు చేసేయడానికి లిక్కరు మీద పన్నుల్ని తగ్గిస్తోంది.
వ్యాట్, అదనపు ఎక్సయిజ్ పన్నుల్లో హేతుబద్ధత తెస్తోందట. ఇన్నాళ్లూ అంత హేతుబద్ధత లేకుండా ఎలా వడ్డించారని ఎవ్వరూ అడగరు. హమ్మయ్య ఇప్పటికైనా తగ్గించారని మురిసిపోతారంతే.
తగ్గించిన పన్నులను బట్టి.. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (imfl) రకం మీద కనీసం 5 నుంచి 12 శాతం వరకు పన్ను తగ్గుతుందిట. తతిమ్మా అన్ని కేటగిరీల మీద 20 శాతం వరకు పన్నులు తగ్గుతాయిట.
ఏపీ గవర్నమెంటు పన్నుల పెంపురూపేణా లిక్కరుమీద ఎడా పెడా వడ్డించిన దగ్గరినుంచి.. పొరుగు రాష్ట్రాలనుంచి లిక్కర్ అక్రమరవాణా విచ్చలవిడిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మద్యం స్మగ్లింగ్ విషయంలో పార్టీల తేడాలు కూడా ఏమీ లేదు. అధికార పార్టీకి చెందిన వారైతే.. ఆ హోదాను అడ్డు పెట్టుకుని.. సరిహద్దు పోలీసులకు కుమ్మక్కై ఎడాపెడా స్మగ్లింగ్ చేస్తున్నారనే విమర్శలూ దండిగానే వస్తున్నాయి. చాలా చోట్ల అధికార పార్టీ నేతలే మద్యం స్మగ్లింగులో దొరుకుతూ, పార్టీ- ప్రభుత్వం పరువు తీస్తున్నారు కూడా. నాటు సారీ తయారీకూడా విచ్చలవిడిగా సాగుతోంది.
ఓటమి ఒప్పుకుంటూ..
మద్యం స్మగ్లింగ్, నాటు సారా తయారీలను అడ్డుకోవడానికి ప్రభుత్వం స్పెషల్ టీములను ఏర్పాటు చేసింది. అడపాదడపా వారు పట్టుకుంటూనే ఉన్నారు. అయినా.. స్మగ్గింగ్ ఆగడం లేదు. స్మగ్లింగ్ గానీ, నాటుసారీ తయారీ గానీ ఆపడానికే ఇప్పుడు పన్నులను తగ్గిస్తామంటున్న ప్రభుత్వం.. తద్వారా.. వాటిని ఆపడం తమకు చేతకాదని ఓటమి ఒప్నుకుంటున్నట్టే కనిపిస్తోంది.
రేటు తగ్గడం కంటె మందుబాబులకు నచ్చేదిదే!
ఏపీ ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తోంది. పన్ను రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. వీటితో పాటు రాష్ట్రంలోని మద్యం షాపుల్లో అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం కూడా దొరికేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నాళ్లూ ప్రపంచంలో ఎక్కడా కనని వినని తమాషా తమాషా పేర్లున్న లిక్కర్ మాత్రమే ఏపీ షాపుల్లో దొరికేవి. ఖరీదైన/ పాపులర్ బ్రాండ్ మద్యం దొరికేదే కాదు. ధర ఎక్కువ కావడం కంటె మించి.. తమకు అలవాటైన బ్రాండ్ మద్యం దొరక్క మందు బాబులు విలవిల్లాడిపోయేవారు.
మద్యం స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగడానికి ప్రధాన కారణం కూడా బ్రాండ్స్ దొరక్కపోవడమే. ఈ నేపథ్యంలో అన్ని పాపులర్ బ్రాండ్లు అన్ని షాపుల్లో దొరికే ఏర్పాటు మందుబాబులకు చాలా చాలా శుభవార్త కింద లెక్క. పన్ను తగ్గింపు ద్వారా ధర తగ్గడం కంటె.. ఈ నిర్ణయంతోనే మందు ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు రివర్స్ స్మగ్లింగ్ అవుతుందా..?
అలా ఎందుకు అనుకోవాలంటే.. ఇప్పుడు తెలంగాణ కంటె కొన్ని రకాల లిక్కర్ ఏపీలోనే చవగ్గా దొరకనుంది. చీప్ లిక్కర్ మధ్య రకం లిక్కర్ 10 నుంచి 40 రూపాయల తక్కువకే దొరుకుతాయి. రివర్స్ స్మగ్లింగ్ జరుగుతుందా.. అని కామెడీగా అలా అనుకోవచ్చు గానీ.. నిజంగా ఇంత చిన్న తేడాలకోసం జరగకపోవచ్చు.
మొత్తానికి సినిమా వ్యసనానికి లోబడిన వారికి టికెట్ల ధరలు తగ్గించడం ద్వారా వారి మనసులు చూరగొనాలని అనుకున్న జగన్మోహన రెడ్డి అది కుదరకపోయే సరికి,
మందు వ్యసనానికి లోబడిన వారికి లిక్కర్ ధరల తగ్గింపు ద్వారా కనీసం వీరి మనసులనైనా చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.
Discussion about this post