చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన స్వామి, అమ్మవార్ల దర్శనానికి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని ఆలయ కార్య నిర్వహణాధికారి పెద్దిరాజు చెప్పారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిపాలనా భవన సమావేశ మందిరంలో సోమవారవ ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాశివరాత్రి రోజున ముక్కంటి దర్శనం కోసం లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో దర్శనాలకు ఇబ్బందులు కలుగకుండా ప్రముఖుల (వీఐపీ)కు ఈ ఏడాది ప్రత్యేక సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
మహాశివరాత్రి రోజున వీఐపీల కోసం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు… సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సమయం కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో మాత్రమే వీఐపీలు దర్శనానికి రావాలని కోరారు. ఇలా చేయడం వలన సామాన్య భక్తులు ఇబ్బంది పడరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక మహాశివరాత్రి రోజున గతంలో లాగే ఈ ఏడాది కూడా మహాలఘు దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
దర్శనానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. అందరూ తప్పక మాస్కు ధరించి, శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నారు.
ఇక క్యూ లైన్ లో వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం… చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇస్తామన్నారు. ప్రత్యేక అధికారులకు వీఐపీలకు, వీవీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక ఎలక్ట్రిక్ వెహికల్, వీల్ చైర్ లు అందుబాటులో ఉంచుతామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా భక్తుల సౌకర్యార్ధం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేస్తున్నట్లు చెప్పారు. స్వామి, అమ్మవార్ల పురవీధుల ఉత్సవం సందర్భంగా భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాల అలంకరణ ఉంటుందన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా 500 మంది వలంటీర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు ఆయన వివరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.