తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం పెద్దమసీదువీధిలో గల ‘ఫిన్ కేర్’ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో జరిగిన దోపిడీ ఇంటి దొంగల పనేనని పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ దోపిడీకి పక్కా ప్రణాళిక రచించింది ఆ సంస్థ శ్రీకాళహస్తి మేనేజరు స్రవంతేనని తేలింది. ఈమెతో అతి సన్నిహితంగా ఉండే వ్యక్తితో పాటు… మరో ఆరు మంది ఈ దోపిడీకి సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇందులో ఇద్దరు స్థానికేతరులు కాగా… ఐదు మంది స్థానికులు అంటున్నారు. ఈ దోపీడీ దొంగలను నేడే, రేపో అధికారికంగా పోలీసులు ప్రకటించనున్నారు.
శ్రీకాళహస్తి పట్టణం పెద్ద మసీదు వీధిలో గల ఫిన్ కేర్ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో దోపిడీ జరిగింది. దోపిడీ దొంగలు రూ.85లక్షల విలువ చేసే బంగారం… రూ.5లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ సందర్భంగా దోపిడీ దొంగలు తనను కాళ్లు, చేతులు కట్టేసి… నోట్లో గుడ్డ కుక్కి… తన వద్ద నున్న తాళాలు లాక్కుని దోపిడీ చేశారని… వారు వెళ్లేటపుడు సీసీ కెమెరాలు, పుటేజీ తీసుకెళ్లారని ఆ సంస్థ మేనేజరు స్రవంతి పోలీసుల విచారణలో చెప్పింది. అయితే ఆమె తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ… 100కు ఆమె ఎందుకు ఫోన్ చేశారో పోలీసులకు అంతుచిక్కలేదు.
100 నుంచి సమాచారం వచ్చిన తరువాత పోలీసులు అక్కడకు వెళ్లగా…అపుడు స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే దొంగతనం జరిగి సుమారు రెండు గంటలు గడచి పోయింది. ఇలాంటి అనుమానాలతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయట పడింది.
తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తితో కలసి ఈ ప్రైవేటు బ్యాంకు దోపిడీకి స్రవంతి పథకం రచించినట్లు తెలిసింది. స్రవంతితో సన్నిహితంగా ఉండే వ్యక్తి స్థానికంగా కొందరిని… స్థానికేతరులు ఇద్దరిని కలుపుకుని ఈ దోపిడీ చేసినట్లు సమాచారం. దోపిడీకి సంబంధించి ఇప్పటికే కొంత సొమ్మును పోలీసులు రికవరీ చేసినట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది.
అయితే కేసు విచారణ దృష్ట్యా ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కేసు విచారణ చేస్తున్నామని… మూడు రోజుల్లో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లు తెలిసింది.
Discussion about this post