హీరో నాని గత రెండు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయ్యి, పెద్దగా విజయవంతం కాలేదు. తాజాగా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ‘శ్యాంసింగరాయ్’ విషయంలో ప్రేక్షకులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకున్నదనే చెప్పాలి.
కథ విషయానికి వస్తే.. ఇది ఒక పునర్జన్మ కథ. హైదరాబాద్ లో నివసించే వాసుదేవ్ సాప్ట్ వేర్ ఉద్యోగం మాని, షార్ట్ ఫిల్మ్ తీస్తుంటాడు. కీర్తి (హీరోయిన్ కృతి శెట్టి) అనే అందమైన అమ్మాయి కనపడితే, ఆమెను కష్టపడి ఒప్పిస్తాడు. అది నిర్మాతకు నచ్చుతుంది. సినిమాకు దర్శకత్వం వహిస్తాడు వాసుదేవ్. అది తెలుగులో హిట్ అవుతే, బాలీవుడ్‌లో రీమేక్ అవకాశం వస్తుంది. ఆ కథ కాపీ కథ అని వాసుదేవ్‌ను ముంబయి లో అరెస్ట్ చేస్తారు. తను పూర్వజన్మ లో శ్యాంసింగరాయ్ అని వాసుదేవ్‌కి అర్ధం అవుతుంది.
ఆ కేసు నుంచి ఎలా బయట పడ్డాడు అనేది ఆసక్తికరంగా చూపించారు ద్వితీయార్థంలో.
విశ్లేషణ :
పునర్జన్మ కథల విషయంలో తెలుగు వారు ఆరితేరిపోయారు. దర్శకుడు రాజమౌళి లాగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ పునర్జన్మ కథాంశాన్ని బాగానే డీల్ చేశాడు. ప్రథమ భాగం చాలా ఆసక్తిగా సాగింది. ద్వితీయ భాగం లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సినిమా స్లో అవుతుంది. అయితే క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. కలకత్తా, బెంగాల్ వాతావరణాన్ని గొప్పగా చిత్రీకరించారు. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం బావుంది. ముఖ్యంగా సినిమా లో detailing బావుంది.
“నీ ఇల్లు బావుండాలని నీ స్వార్థం.
నా ప్రపంచం బాగుండాలని
నా స్వార్థం”
“ఏ ఆడది ఎవరికి దాసి కాదు.
దాస్యం కోరుకునే వాడు దేవుడే కాదు.” లాంటి చక్కని సంభాషణలు ఈ సినిమాలో ఉన్నాయి.
వాసుదేవ్‌గా, శ్యాంసింగరాయ్‌గా నాని గొప్పగా నటించాడు. సాయి పల్లవి తన పాత్రలో జీవించింది.
కృతి శెట్టి కాబోయే సూపర్ హీరోయిన్ అని చెప్పక తప్పదు. అభినవ్ గోమటం, రాహుల్, సబస్తియన్ మడోనా.. మిగతా వారు తమ పాత్రల్లో ఒదిగి పోయారు. కమ్యూనిస్ట్ ఆదర్శాన్ని, పునర్జన్మను కలుపుతూ సినిమాను తీయడం కొంత విడ్డూరం గా ఉన్నా, శ్రద్ధగా, బాగా డబ్బు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా మంచి వినోదం ఇచ్చింది.
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
సీనియర్ పాత్రికేయులు

.