కేంద్రప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితి పండగ చేసుకుంటోంది. ఎన్నడూ లేని హుషారును అనుభవిస్తోంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాము విజయం కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేకుండానే.. బీజేపీ తాజాగా గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో తమ గోతిని తామే తవ్వుకున్నదని తెరాస అంచనా వేస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస నుంచి వెలివేతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన అధికార పార్టీకి ఏమేరకు ముచ్చెమటలు పట్టిస్తున్నారో గానీ.. తెరాస వందల కోట్ల రూపాయలను ఆ ఒక్క ఎమ్మెల్యే స్థానం మీద వెదజల్లడానికి సిద్ధంగా ఉంది.
ప్రచారం అదే రీతిగా హోరెత్తుతోంది. ఇలాంటి సమయంలో గ్యాస్ ధర అమాంతం సిలిండరు మీద 15 రూపాయలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. టీఆర్ఎస్ దళాలకు అత్యంత అద్భుతమైన వీనులవిందు లాంటి వార్తగా అనిపిస్తోంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తి కాకముందే.. తమ విజయం ఖరారైపోయిందని తెరాస నాయకులు పండగ చేసుకుంటున్నారు.
గ్యాస్ ధర పెంపు అనేది ప్రతి సాధారణ పౌరుడిమీద కూడా ప్రభావం చూపిస్తుంది. బీజేపీ అభ్యర్థి ఓటమికి వాళ్ల పార్టీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటుచేసిందని వారు సంబరపడుతున్నారు. ఈ అవకాశాన్ని నిజానికి తెరాస బాగానే వాడుకుంది.
కేంద్రంనుంచి ధర పెంపు నిర్ణయం వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో మరెక్కడా పార్టీ శ్రేణులు స్పందించకపోయనా.. ఒక్క హుజూరాబాద్ లో గ్యాస్ సిలిండర్లతో నిరసన దీక్షలు చేశారు. గ్యాస్ పెంపును హఠాత్తుగా కీలక విమర్శనాస్త్రంగా తెరాస తీసుకున్నదని స్పష్టం అవుతోంది. మరి ఈటల ఎలా బయటపడతారో చూడాలి.
ఏపీ బీజేపీ సంగతేమిటి?
ఏపీలో బద్వేలుకు కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడ తమ పార్టీకి నామమాత్రపు బలం కూడా లేకపోయినప్పటికీ.. బరిలోకి దిగుతున్నట్లుగా ఏపీ బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే అక్కడ ఎన్నిక నుంచి తప్పుకున్న తెలుగుదేశం, జనసేన బీజేపీకి దొంగచాటుగా సాయం చేసే అవకాశం ఉంది.
ఇన్ని కాంబినేషన్లు ఉన్నా సరే.. గ్యాస్ ధర పెంపు నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత.. బద్వేలు ఓటర్లతో పువ్వు గుర్తు మీద ఓటు వేయించడం సాధ్యమేనా అనే చర్చ అక్కడ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
నిజానికి తెరాసలో ఉన్న ఉన్నంత కొత్త జోష్.. వైసీపీలో లేదు. ఎందుకంటే.. హుజూరాబాద్ లో తెరాస విజయానికి చాలా కష్టపడుతోంది. కాబట్టి ఈ వార్త వారికి ఊరట. ఏపీలో పరిస్థితి అది కాదు. బద్వేలు విషయంలో బీజేపీ దిక్కూమొక్కూ లేని పార్టీ. గెలుపు గురించి వైసీపీకి ఎలాంటి సందేహాలు లేవు. కాబట్టి ఈ గ్యాస్ ధర పెంపు వలన కొత్తగా వచ్చే ఎడ్వాంటేజీ లేదని వారు అనుకుంటున్నారు.
ఆర్భాటంగా.. బద్వేలులో బరిలోకి దిగుతాం అని ప్రకటించిన సోము వీర్రాజు.. తాజా పరిణామాల నేపథ్యంలో తమ కేంద్ర ప్రభుత్వం కొట్టినదెబ్బకి.. బరిలో దిగే సాహసం చేస్తారో.. మాట మారుస్తారో చూడాలి.
Discussion about this post