పూలచెట్టులో ఉద్భవించిన మొగ్గ, పుష్పంగా పరిణితి చెంది దానంతట అదే నేలపై రాలడం సహజం. అలా కాకుండా అది మొగ్గగా ఉన్నప్పుడుగాని, పుష్పంగా మారినప్పుడుగాని తుంచేయడం అసహజం.
మొగ్గగా తుంచేయడం, పుష్పంగా విరిచేయడం ఎలా అసహజమవుతుంది? ఆ మొగ్గలను, పుష్పాలను దేవుడి పూజకు
ఉపయోగిస్తారు లేదా ఆడవాళ్ళ సిగలో అలంకరణకు వినియోగిస్తారు. అది అసహజం ఎలా అవుతుంది? అని మీరు వాదించవచ్చు. కానీ, ఇది ముమ్మాటికీ అసహజమే.
ఎలాగంటే..
ఒక బిడ్డ పుట్టి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనుభవించిన తర్వాత మరణం సంభవించడం సహజం. అలాకాకుండా బాల్యంలోగాని, యవ్వనంలోగాని మానసిక క్షోభకు గురికావడంచేతగాని, హత్యగావించడంచేతగాని అర్థాంతరంగా తనువు చాలించడం అసహజం. సూటిగా చెప్పాలంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేస్తే ఆ తల్లి ఎలా తల్లడిల్లుతుందో చెట్టు నుంచి మొగ్గలను, పూలను వేరుచేస్తే కూడా ఆ చెట్టు అంతే బాధపడుతుంది. అందుకే దేవుడి పటాలకు పూలు పెట్టే ప్రతి సందర్భంలో నాకు అదే స్ఫురణకు వస్తుంది. చెట్టులోని పూలు తుంచి దేవునికి సమర్పించడం సమంజసమేనా అని. పూలు అనేవి చెట్టులో ఉంటేనే చెట్టుకు అందం. కాయలు,పండ్లు చెట్టులో ఉంటేనే చెట్టుకు అందం. వాటిని అలా ఉంచడమే దేవునికి మనం చేసే నిజమైన పూజ.
పూలచెట్టులోని మొగ్గలను తుంచేయడం, పుష్పాలను విరిచేయడం ద్వారా ఆ చెట్టుని మానసిక క్షోభకు గురిచేసి హత్యచేయడమే అవుతుందని నా అభిప్రాయం. అలాగే మామిడి చెట్టులో కాసిన కాయలు, పండ్లుగా పరిణితి చెంది అవంతట అవే నేలపై రాలినప్పుడు వాటిని వినియోగించడం సహజం. అర్థాంతరంగా కాయలను, పండ్లను తుంచేయడం అసహజం. . అలాగే పుష్పాలు కూడా అవంతట అవి నేలరాలిన తర్వాత వినియోగించడం సహజం. మధ్యలో తుంచేయడం అసహజం.
ఇలాంటి అసహజత్వంలోంచి పుట్టుకొచ్చిందే యూజ్ అండ్ త్రో. ఇరవై యేండ్ల క్రితం ఏదో పనిమీద ఒక ఊరెళ్ళినప్పుడు దాహంవేసి త్రాగడానికి ఓ ఇంటి గుమ్మవద్దకు వెళ్ళి నీళ్ళు అడిగాను. ఆ ఇంటిలోని ఆవిడ నావైపు ఆశ్చర్యంగా చూసి, “పక్కనే షాపు ఉంది అక్కడ దొరుకుతాయి నాయన” అంది. ఆమె ఎందుకలా అందో మొదట నాకు అర్థంకాలేదు. సరేనని మెల్లిగా నడచుకుంటూ ఆ షాపు దగ్గరకు వెళ్ళి నీళ్ళు అడిగాను. ఫ్యాకెట్ ఇచ్చి రూపాయి ఇవ్వు అన్నాడు. అదేంటి నీళ్లు కూడా అమ్ముతున్నారా? అదీ ఫ్యాకెట్లలో? షాకుకు గురయ్యాను. వెంటనే
తేరుకుని రూపాయి ఇచ్చి దాహం తీర్చుకున్నాను. నాకు తెలిసి ‘యూజ్ అండ్ త్రో’ అనే దౌర్భాగ్యంకి నాంది పలికింది అప్పుడేనని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది, నీళ్ళు అమ్మడాన్ని చూసి నేను ఎలా షాకుకు గురైనానో అప్పటికి ఇరవై యేండ్ల ముందు పాలు అమ్మడం చూసి మా గురువుగారు విస్మయం చెందారట.
నా చిన్నతనంలో అమ్మగాని, నాన్నగారి ఏదైనా వస్తువు తీసిచ్చినప్పుడు దాన్ని అపురూపంగా చూసుకుని భద్రంగా దాచుకునే వాళ్ళం. అంతేకాదు చాలాకాలం పాటు వాడుకునే వాళ్ళం. పండుగకి కొత్త బట్టలు కుట్టిస్తే ఎంతో సంబరపడిపోయేవాళ్ళం. బట్టలు వేసుకుని మురిసిపోయేవాళ్ళం. మళ్ళీ పండుగ వచ్చేంతవరకు వాటిని ప్రాణపదంగా చూసుకునేవాళ్ళం. కొత్త బట్టలు టైలర్ షాపులో ఇచ్చినప్పటి నుంచి అవి ఎప్పుడు ఇంటికొస్తాయా అని ఆశతో ఎదురుచూచే వాళ్ళం. అంతేకాదు ఆత్రుత ఆపుకోలేక టైలర్ దగ్గరకు పలుమార్లు తిరిగేవాళ్ళం వాటిని తీసుకోవడానికి. మరి ఇప్పుడు ఆ ఫీల్ ఎక్కడ? ఇప్పుడంతా రెడీమేడ్. ఎందుకంటే ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో.
అప్పుడు ఇంకు పెన్నులు ఉండేవి రాసుకోవడానికి. ఇంకు అయిపోగానే వాటిలో మళ్ళీ ఇంకు పోసుకుని చాలాకాలంపాటు వాడుకునేవాళ్ళం. అలాగే బాల్ పెన్నులు కూడా రీఫిల్ అయిపోతే వేరే రీఫిల్ వేసుకుని వాడుకునే వాళ్ళం. మరి ఇప్పుడు ఇంకు పెన్నుల జాడ అసలులేదు. బాల్ పెన్నులయితే రీఫిల్ మార్చే పనిలేదు. రీఫిల్ అయిపోతానే పారేసి వేరే పెన్ను కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో.
నాకు తెలిసి అప్పుడు పెళ్ళి భోజనంలో స్టీలు పళ్ళెం, స్టీలు గ్లాసులు ఉపయోగించేవారు. ఆ తర్వాత అరటి ఆకులు, విస్తరి ఆకులు వచ్చాయి. ఇప్పుడు ప్లాస్టిక్ ఆకులు, డిస్ఫోజల్ గ్లాసులు ఎందుకంటే ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో.
అప్పుడు పచ్చళ్ళుగాని, ఊరగాయలుగాని ఇండ్లలోనే చేసుకునేవాళ్ళం. రుబ్బురోలులో రుబ్బి చేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉండేవి. అలాగే ఆవకాయ ఊరగాయ కూడా పింగాణి జాడీలలో దాచుకుని సంవత్సరం పొడవునా తినేవాళ్ళం. మరి ఇప్పుడు రుబ్బురోలు ఉన్నా వాడం. జాడీలు ఉన్నా ఊరగాయలు
చేయం. ‘పచ్చళ్ళుగాని, ఊరగాయలుగాని ఫ్యాకెట్లలో దొరుకుతాయి కదా మరెందుకు చేయడం?’ అనే భావనలోకి వచ్చేశారు చాలామంది. ఎందుకంటే ఇప్పడంతా యూజ్ అండ్ త్రో.
ఉప్పు నుంచి ఊరగాయవరకు, పాలు నుంచి పప్పుల దాక ఇలా ప్రతీదీ యూజ్ అండ్ త్రోనే. మనకు తెలియకుండానే ఈ ‘యూజ్ అండ్ త్రో’ అనే దౌర్భాగ్యం మన నరనరాల్లో ఇంకిపోయింది. అందుకనేఏమో మన ఆత్మీయులుగాని, బంధువులుగాని, స్నేహితులుగాని చనిపోయినపుడు ఆ బాధ, దుఃఖం, నేటి మనుషులకు కనిపించడంలేదు, అనిపించడంలేదు. ఆ ఫీల్ పోయి
ఎంతోకాలం అయింది అందరికీ. అందుకనే ఎవరైనా చనిపోయినప్పుడు “అయ్యో!” అనాల్సినోళ్ళు “ఎప్పుడు ఎత్తుతారు?” అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో.
బహుశా ఈ ‘యూజ్ అండ్ త్రో’ అనే దిక్కుమాలిన జాడ్యం వలనేమో చిన్నచిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకోవడం, పెళ్ళికి ముందే గర్భం దాల్చడం, ఆత్మహత్యలు చేసుకోవడం, వృద్ధులు వృద్ధాశ్రమాలలో మగ్గడం, అక్రమ సంబంధాలు సరపడం వంటివి నేటి సమాజంలో ఎక్కువైనాయి.
మరి ఈ జాడ్యం నుంచి ఈ సమాజం బయటపడేదెలా? అనే బెంగ
మనకు అవసరంలేదు. సమాజాన్ని మార్చాలనే ప్రయత్నం ఎలాంటిదంటే ఎండమావిలో నీళ్ళు తోడుకోవాలనుకోవడం. అది ఎప్పటికీ సాధ్యంకాదు.
దానికి మనం చేయాల్సింది ఒకటే “Be True Your self”. నీకు నీవు సత్యంగా ఉండు చాలు. ఎలాగంటే ఉదాహరణకు నీకు ప్లాస్టిక్ ఆకులలో తినడం ఇష్టంలేదు. మానేయ్. స్టీలు పాత్రలలోనో, ఆకులలోనో తినడం ఇష్టం. అలాగే తిను. టీ ప్లాస్టిక్ కప్పులలో తాగడం ఇష్టంలేదు. మానేయ్. గాజుగ్లాసులో తాగడం ఇష్టం అలాగే తాగు. అది నీ ఇష్టం కదా. నిన్ను నిషేధించే వాళ్ళు ఎవరూ ఉండరుకదా. మనం నచ్చినట్లు మనం బతకలేకపోతే అది అసలు
జీవితమేకాదు. ఆ స్వేచ్ఛ మనకు ఉంది. సమాజంతో మనకు పనిలేదు.
ప్రకృతి ఎప్పుడూ సహజంగానే ఉంటుంది. మన వికృత చేష్టలవలన అది తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఆ అసహజత్వాన్ని మళ్ళీ సమతుల్యం చేసుకునే సందర్భంలోనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అలా ఉద్భవించిందే కరోనా మహమ్మారి. అందుకే ప్రకృతిని సక్రమంగా ఉపయోగించుకుందాం. ప్రకృతిలో సహజంగా జీవిద్దాం. ‘యూజ్ అండ్ త్రో’ అనే వికారాన్ని కొంతవరకైనా నిర్మూలిద్దాం.
Use nature properly. Live in nature naturally.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post