ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు.. ఇక్కడేమో కుక్కగారి బర్త్ డే.. దాని యజమాని అరెస్టుకొచ్చింది.
పెంపుడు జంతువుల మీద వల్లమాలిన ప్రేమాభిమానాలు పొంగిపోయేవాళ్లుండడం వింత కాదు. సొంత కుటుంబ సభ్యులకంటె ఎక్కువగా.. వాటిని ప్రేమించే వారు అభిమానించే వారు.. అనేకులు కనిపిస్తుంటారు. కానీ.. సదరు శునకరాజం యజమాని అరెస్టుకు కావడం మాత్రమే ఒకింత వింత! ఇదెలా జరిగిందో చూద్దాం..
అహ్మదాబాద్ లో చిరాగ్ పటేల్ అనే చిన్నోడికి అబ్బే అనే ఓ చిన్న కుక్క కూడా ఉంది. అదంటే చాలా ముద్దు. మురిపెం. దాని బర్త్ డే వచ్చేసరికి మనోడికి పూనకం వచ్చింది. చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాడు.
రాజు తలచుకుంటే కొరడాదెబ్బలకు కొదవేమిటి? అన్నట్టుగా.. డబ్బు బాగా ఉన్న చిరాగ్ పటేల్ తలచుకునే సరికి అబ్బే అను సదరు శునక యువరాజా వారికి వైభోగం పట్టింది. అబ్బే కోసం చిరాగ్ ఏకంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బర్త్ డే సెలబ్రేట్ చేశాడు.
అంతా ముగిసేసరికి అతగాణ్ని, మరో ఇద్దరు మిత్రుల్ని కలిపి పోలీసులు అరెస్టు చేశారు.
ఆయన సొమ్ము, ఆయన కుక్క.. ఆయన ఎలా తగలేసుకుంటే వారికేం పోయింది .. అనుకుంటున్నారా? అది నిజమే కానీ.. సదరు బర్త్ డే వేడుకల నిర్వహణలో కొవిడ్ రూల్సు పాటించలేదుట. మాస్కులు కూడా లేవుట. డీజే గట్రా పెట్టి.. భారీహంగామాతో.. భారీగా జనాన్ని క్రిక్కిరిసేలా పోగేసి పండగచేశారు.. ఈలోగా చిరాగ్ కు, ఉర్విశ్, దివ్యేష్ అనే మరో ఇద్దరికి కలిపి అరదండాలు పడ్డాయి.
ప్రేమమంచిదే గానీ..
కుక్క సంగతి ఓకే. కుక్కతో మనిషికి.. చాలా ప్రేమానుబంధం అనేది.. ప్రాచీనకాలం నుంచి స్థిరపడిపోయింది. విదేశాలలో అయితే కోట్లకు కోట్లరూపాయల ఆస్తులను వాటి యజమానులు తమ కుక్క పేర విల్లు రాసిపెట్టి చచ్చిపోయారనే వార్తలు కూడా మనం అనేకం చూస్తుంటాం. వాటి ముందు చిరాగ్ చేసిన ఏడు లక్షల బర్త్ డే పెద్ద గొప్పదేం కాదు.
కానీ కోవిడ్ గురించి పట్టించుకోకపోవడమే.. వారిని జైలు పాల్జేసింది.
అన్నట్టు ఇటీవల వాట్సప్ లో ఓ వీడియో ముమ్మరంగా షికారు కొట్టింది. కొక్కరోకో అంటూ కోడిపుంజుగారికి.. ఓ కుటుంబం ఘనంగా బర్త్ డే చేశారు. కాపోతే.. ఇంత హడావుడి గానీ హంగామా గానీ లేవులెండి.
ఏంఠో.. మనుషులు తినడానికి పిడికెడు మెతుకుల్లేక అలమటిస్తూ ఉండే ఈ దేశంలో కుక్కకు, కోడికి పుట్టినరోజుల పేరిట ఇంతింత ప్రేమను కురిపించి, ఇంతింత సొమ్మును తగలేయడం అనేది ఎలా కుదురుతుందో ఏమో..?
.