ఊరంతా పండగ చేసుకుంటూ ఉంటే. ఉడుక్కునే వారు కొందరుంటారు. కానీ.. పండగ చేసుకునే వారికి నడ్డి విరిగేలా వడ్డించి.. ఆ రూపేణా పండగ చేసుకునే వారు మరికొందరు ఉంటారు. ఏపీ ఆర్టీసీతో పాటు కేంద్ర రైల్వేశాఖ కూడా ఆ కోవలోకే చెందుతోంది.
ఏపీ ఆర్టీసీ ఏకంగా యాభైశాతం టికెట్లు పెంచేసి.. సంక్రాంతి పండగ చేసుకోవడానికి ఊర్లకు వెళ్లే వారిని నిలువుదోపిడీ చేస్తోంటే.. రైల్వేశాఖ ఏకంగా 100 శాతం నుంచి 500 శాతం వరకు ప్లాట్ ఫాం టికెట్లు ధర పెంచేసి దోచుకోవాలని చూస్తోంది.
కోవిడ్ పుణ్యమాని.. ఎక్స్ ప్రెస్ రైళ్ల పేర్లను పట్టించుకోకుండా.. టెక్నికల్ గా అన్నిటినీ స్పెషల్ రైళ్ల పేరుతో నడుపుతూ.. అధిక ధరలు దండుకుంటున్న రైల్వే.. టికెట్ల సంగతి వదిలేసి ఈసారి ప్లాట్ ఫారమ్ పైన పడింది. మేమేం తక్కువ తినలేదంటూ.. పది రూపాయల టికెట్ ను ఏకంగా యాభై చేసేస్తోంది.
సంక్రాంతికి రైల్వే బాదుడు
ప్రజల అవసరాలను క్యాష్ చేసుకోవడానికి ఎవరు సిద్ధం కాదు. ఇందులో రైల్వే కూడా ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలనుండి తమ ఇళ్లకు వెళ్లడానికి వెళ్లే వారిపై బాదుడుకు ఆర్టీసీతోబాటు రైల్వే శాఖ కూడా పథకాలు వేస్తుంటుంది. అయితే ఈ ఏడాది మామూలుగా కాకుండా మరో రూపంలో కూడా వడ్డన ప్రారంభించింది. ప్లాట్ ఫారం టికెట్ ధరను పెంచి, ప్రయాణీకులకు మరికాస్త భారం పెంచింది.
సంక్రాంతి పండుగకు ప్రయాణాలకు సిద్ధమవుతున్న ప్రయాణీకులకు, వారిని రైల్వేస్టేషన్ వద్ద దిగబెట్టడానికి వచ్చేవారికి స్టేషన్ లోకి రావాలంటే ప్లాట్ ఫారం టికెట్ తప్పనిసరి. ఈ టికెట్ ధర సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రస్తుతం పది రూపాయలుగా ఉంది. ఈ ధరను ఏకంగా 50 రూపాయలకు పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇది కేవలం సికింద్రాబాద్ స్టేషన్ లో మాత్రమేనని, మిగిలిన అన్ని పెద్ద రైల్వేస్టేషన్లలో ఈ ధర పది నుండి ఇరవై రూపాయలకు పెంచుతున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ ధరలు ఈనెల తొమ్మిదవ తేదీనుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయని రైల్వే శాఖ తెలిపింది.
.