దక్షిణాది రాష్ట్రాలలో మూడు ఇప్పుడు మహిళలకు నీరాజనం పడుతున్నాయి. మహిళల సాధికారత దిశగా ఒక మంచి అడుగు తీసుకున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించడం అనేది సామాజికంగా అనేకానేక మార్పులకు కారణం అవుతుంది. తక్షణం కనిపించే ఫలితం.. ప్రభుత్వం మీద ఆర్థిక భారం మాత్రమే అయినప్పటికీ.. సుదూర భవిష్యత్తులో సామాజిక ముఖచిత్రం రూపురేఖలు మారడంలో ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయి. ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని ఆర్టీసీలో కల్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందే వేసి.. ఈ ఏడాది మే నెలలో జరిగిన తమ పార్టీ మహానాడులోనే.. తాము గెలిస్తే గనుక.. మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఇటీవల నారాలోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా కూడా.. చంద్రబాబునాయుడు అదే హామీని పునరుద్ఘాటించారు. ఎటూ మూడు రాష్ట్రాల్లో అమలవుతున్న, మహిళల ఆదరణ చూరగొన్న పథకాన్ని తెలుగుదేశం జారవిడుచుకోదు.
అదే సమయంలో.. తెలుగుదేశం ప్రకటించిన హామీని ఇప్పుడే, తాము అధికారంలో ఉండగానే, అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. జగన్ ఇలాంటి నిర్ణయానికి వస్తే అదేమీ చిత్రం కాదు. ఇదేమీ చంద్రబాబునాయుడు సొంత బుర్రలో పుట్టిన ఆలోచన కాదని, ఆయననుంచి తాము కాపీ కొట్టలేదని దబాయించి చెప్పుకోడానికి జగన్ సర్కారుకు అవకాశం ఉంది. తెలుగుదేశం ఆలోచనను వైసీపీ అమలులోకి తేవాలని చూస్తున్నదంటూ.. అప్పుడే యాగీ కూడా మొదలైంది.
ఇక్కడ మనం మరో కోణంలోంచి చూసినప్పుడు.. ఏ పార్టీ చేస్తే ఏముంది? ప్రజలకు మేలు జరగడమే మనకు కావాలి. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళల ఆదరణ పొందగలిగాయి కదాని.. ఆ నిర్ణయాన్ని యథాతథంగా తీసుకువచ్చేయడం మాత్రమే కాదు. ఆయా రాష్ట్రాల్లో ఈ నిర్ణయం వల్ల మహిళలకు ఎదురవుతున్న సాధక బాధకాలు ఏమిటో కూడా ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చేముందు ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేయాలి.
తమిళనాడు, కర్ణాటక ల్లో ఏ రీతిగా అమలవుతున్నదో ఖచ్చితమైన పరిస్థితి మనకు తెలియకపోయినప్పటికీ.. తెలంగాణలో మహిళలు దీనిని చాలా ఘనంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బస్సు సర్వీసులు మహిళలతో క్రిక్కిరిసపోతున్నాయి. రద్దీవేళల్లో తోపులాటలు కూడా జరుగుతున్నాయి. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతోంది. ఈ తోపులాటలు అధిక రద్దీ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. మహిళల రద్దీతో ప్రజలు అనేక ఇక్కట్లు కూడా పడుతున్నారు. పురుషులు ప్రభుత్వాన్ని తిట్టుకునే వాతావరణం కూడా ఏర్పడుతోంది. ఇవన్నీ తాత్కాలికమే అనుకుని వదిలేయకుండా ప్రభుత్వం ఈ ఇబ్బందుల నివారణపై చూపు సారించాలి.
బస్సు సర్వీసులు పెంచడం ఒక్కటే దీనికి తరుణోపాయం. కనీసం రద్దీ వేళల్లో ఎక్కువ సర్వీసులు నడిచేలా కొన్ని సర్వీసులు ఉండాలి. మహిళలకు ప్రత్యేకించిన బస్సు సర్వీసులు కొన్ని రద్దీ వేళల్లో నడిపినా మంచిదే. ఇలాంటి ఆలోచనలుచేయాలి. ఏపీ లో అటు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం తమ హామీగానూ, పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ తమ ఆలోచనగానూ.. మహిళలకు ఉచిత ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్నప్పుడు.. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
కనీసం ఏపీలో అయినా .. పార్టీలు మహిళలకు యాతనలేని ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి ప్రయత్నించాలి. ముందుగా ఆర్టీసీని పరిపుష్టం చేసి, సర్వీసులు పెంచే ప్రణాళికలను సిద్ధం చేసి.. అప్పుడు కార్యరూపంలోకి దిగాలి. తెలంగాణలో రేవంత్ సర్కారు అధికారంలోకి రాగానే.. రెండురోజుల వ్యవధిలోనే దీనిని అమలుచేసింది. సరైన ప్రణాళికలకు వారికి సమయం లేదు. కానీ.. ఏపీలో పార్టీలు ఇంకా ఆలోచించే దశలోనే ఉన్నాయి కాబట్టి.. ప్రజలకు, మహిళలకు ఇబ్బందులు లేని ఉచిత ప్రయాణం కల్పిస్తే.. అందరి మన్నన పొందుతారు.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
Discussion about this post