‘స్వామీ దొంగిలించిన సొత్తులో సగం నీకే ఇస్తా..’ అని దేవుడికి మొక్కుకుని.. ఆ పిమ్మట దేవడి హుండీ దోచేసి.. ఆ వెంటనే అందులో సగం మొత్తం హుండీలో పెట్టేసి.. దేవుడి మొక్కు తీర్చేసుకుని.. పాప భారం లేకుండా.. తన నేరంలో దేవుడినికూడా వాటాదారుగా మార్చేసే ప్రబుద్ధుల ఘట్టాలు.. మనకు సినిమాల్లో కనిపిస్తుంటాయి.
మరీ అంత లేదుగానీ.. ఒక ప్రబుద్ధుడు గుడిలో హుండీ సొత్తు కొట్టేయాలన చూశాడు. గన్నవరం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. వేంకటేశ్వరుని ఆలయం ఆవరణలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఆంజనేయ స్వామి గుడి కూడా ఒకటి. ఆంజనేయస్వామి గుడిలో హుండీ పగలగొడుతుండగా దొంగను అర్చకులు పట్టుకున్నారు. అర్చుకులే పూనుకుని.. దొంగను గుడి స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం అందజేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన కాగ్గా నరేంద్రగా పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన మరో వ్యక్తితో కలిసి గతంలోను నరేంద్ర ఆలయంలో రెండుసార్లు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మామూలుగా దేవుడే సర్వజగద్రక్షకుడు అనుకుంటాం. అర్చకులు అంటే.. దేవుడికి పూజాదికాలు నిర్వహించి.. నిత్యకైంకర్యాలు సమర్పించడం వరకే పరిమితం అని కూడా అనుకుంటాం. కానీ.. అర్చకులే.. దేవుడి రక్షణకు కూడా పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిక్కడ.
.