సినిమా పోస్టర్ పబ్లిసిటీలోని చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ సినీరంగంలో తన కళాకౌశలాన్ని సుదీర్ఘకాలం ప్రదర్శించిన చిత్రకారుడు ‘ఈశ్వర్’ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ ఆయన మరణించారు.
కొసనా ఈశ్వరరావు అనే ఈశ్వర్ ప్రస్తుత వయసు 84 సంవత్సరాలు. వెస్ట్ గోదావరిలోని పాలకొల్లు నుంచి వచ్చి సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.
సుప్రసిద్ధ దర్శకుడు బాపు చేతుల మీదుగా ఆయన సినీ ప్రస్థానం ప్రారంభం అయింది. 1967లో సాక్షి చిత్రానికి తొలిసారిగా పనిచేశారు.
అనేక పెద్దపెద్ద నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనింగ్ లో పనిచేశారు. పబ్లిసిటీ అంటే.. కేవలం పోస్టర్ డిజైనింగ్ చేయడం మాత్రమే కాదు.. ఈశ్వర్ స్వతహాగా మంచి చిత్రకారుడు. ఎన్టీఆర్ అద్భుతమైన రీతిలో పురాణ పాత్రలను తెరమీద ధరిస్తే.. ఆ పురాణ పాత్రల ఫోటోలు అంతకంటె అత్యద్భుతమైన రీతిలో పెయింటింగ్స్ గా కేలండర్ల మీదికి వచ్చాయంటే.. అవన్నీ ఈశ్వర్ చిత్రకళా నైపుణ్యమే.

కేవలం పబ్లిసిటీ డిజైనర్, చిత్రకారుడిగా మాత్రమే కాదు. ఆయన సినిమా పోస్టర్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకానికి 2011లో ఉత్తమ సినిమా గ్రంథ రచన నంది అవార్డు కూడా వచ్చింది. 2015లో ఆయనను ఏపీ సర్కారు రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
తెలుగుసినిమా రంగానికి ఇతోధికంగా బహుముఖ సేవలు అందించిన ఈశ్వర్.. ఆయనను ఎరిగిన వారిని, ఆయన నైపుణ్యాలను ఎరిగిన వారిని విషాదంలో ముంచుతూ మంగళవారం నాడు కన్నుమూశారు.

.