రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “కాంతారా “! కన్నడ భాషలో అద్భుతమైన, భారీ విజయాన్ని సాధించింది. “కేజియఫ్” చిత్రాలను నిర్మించిన “హోంబలే” ఫిలిం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇక తెలుగు నిర్మాతలు, ప్రేక్షకులు ఊరుకుంటారా..! కన్నడ భాషలో ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాని “గీతా ఆర్ట్స్” నిర్మాణ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది ఈ “కాంతారా” తెలుసుకుందామా.
కాంతారా : లెజెండ్
నటీనటులు: రిషబ్ శెట్టి , సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు.
కూర్పు: కె.ఎమ్. ప్రకాష్, ప్రతీక్ శెట్టి
సంగీతం: అజనీష్ లోక్ నాధ్
ఫోటోగ్రఫీ: అరవింద్, ఎస్. కశ్యప్
కథ, దర్శకత్వం : రిషబ్ శెట్టి
కథలోకి వస్తే,
అది ఓ గొప్ప రాజ్యం.. ఆ రాజుకు అనుకూలవతి అయిన రాణి. చక్కని సంతానం. సంవృద్ధిగా సంపదలు. నమ్ముకున్న ప్రజలకు ధర్మపాలన. అంతటా సంపూర్ణము. కానీ రాజుగారికి మనఃశాంతి మాత్రం అసంపూర్ణం. ఎందరు యోగులను కలిసినా, ఎన్ని పుణ్యక్షత్రాలను సందర్శించినా, మనఃశాంతి మాత్రం మృగ్యం. ప్రతిరోజూ కలత నిద్రే. చివరకారకు విసిగిపోయి ఓ జాటాధారి ఇచ్చిన సలహాతో మానసిక ప్రశాంతతను వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతుండగా ఓ అడవిలో ఓ చోట ఓ నల్లని రాతి దైవ శిల కనిపిస్తుంది. పూజలందుకున్న ఆనవాళ్ళుగా ఆ శిల పైన అలంకరించిన పూలు. ఆ దైవశిలను చూసిన మరుక్షణమే రాజుకు అంతవరకూ మనసులో ఉన్న చింత పటాపంచలు అయి ఎనలేని మనఃశాంతి పొందుతాడు.
ఆ దైవ శిల తన ఇంటిలో ఉంటే తన మనఃశాంతి కూడా తనతోనే శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఊరిప్రజలను ఆ దైవశిలను తనకు ఇవ్వమని కోరుతాడు. దానికి బదులుగా ఆ అడవిని, ఆ అడవికి అనుకునిఉన్న భూమిని ఆ ఊరిప్రజలకు రాసి ఇస్తాడు. ఆ సమయంలో దైవం పూనిన ఓ వ్యక్తి రాజుకు ఓ షరతు విధిస్తాడు. దైవం పేరిట ఇచ్చిన ఆ భూమిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే, దైవాగ్రహం తప్పదని హెచ్చరిస్తాడు. అయితే రాజు తదనంతరం రాజు కొడుకు ఇచ్చిన మాట తప్పి రాజు దానంగా ఇచ్చిన భూమిని కోర్ట్ ద్వారా సొంతం చేసుకోవాలని కుయుక్తి పన్నుతాడు. కోర్టులోపలకు పోకుండానే మెట్లమీద రక్తం కక్కుకుని ప్రాణం విడుస్తాడు..
కట్ చేస్తే.. ఇక్కడ వరకు ఫ్లాష్ బ్యాక్ కథ వాయిస్ ఓవర్ లో పది నిముషాలు నడుస్తుంది.
తర్వాత కొన్నేళ్ళకు ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్ లో భాగమని, దాన్ని ఆ ఊరి ప్రజలు కబ్జా చేసారని ఫారెస్ట్ ఆఫీసర్ మురళి [కిషోర్] తరచూ అడవికి వచ్చి సర్వే చేస్తుంటాడు. ఊరిలోని యువకుడు శివ [రిషబ్ శెట్టి ] అతని ప్రయత్నాలను అడుగడుగునా తిప్పికొడుతుంటాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో ఆ ఊరి దొర..రాజవంశీకుడైన దేవేంద్ర {అచ్యుత్ కుమార్} తమ భూములను తిరిగి దక్కించుకునేందుకు ఓ పన్నాగం పన్నుతాడు. శివ తో చాల మంచిగా వ్యవహరిస్తూనే, దెబ్బ కొట్టాలని అవకాశం కోసం చూస్తూ ఉండాడు. ఈ క్రమంలో శివ తమ్ముడు దేవ నర్తకుడైన గురవ హత్యకు గురవుతాడు. శివ, ఫారెస్ట్ ఆఫీస్ మురళి ల మధ్య గొడవలు ఎలాంటి సమస్యలకు దారితీసాయి? దొర కుట్రని శివ ఎలా ఎదుర్కున్నాడు? గురవను ఎవరు, ఎందుకు హత్య చేసారు? ఆ ఊరి ప్రజలను కాపాడడానికి దేవుడు [క్షేత్రపాలకుడు }ఏం చేసాడు? ఇదంతా మిగతా కథ.
సినిమా చందమామ కథలు, మధుబాబు జానపకథలను తలపించింది. ఇలాంటి కథలు మనకు కొత్త కాకపోయినా, ఈ “కాంతారా” కథని నడిపిన తీరు కాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది.
దైవ శిలా కోసం భూమిని దానంగా ఇచ్చిన రాజు కొడుకు ఆ భూమిని తిరిగి పొందాలనుకునే క్రమంలో దైవాగ్రహంతో కోర్ట్ మెట్లమీద పడి చనిపోయే సందర్భం ఒళ్ళు గగుర్పాటుకి గురిచేస్తుంది. చనిపోయిన యువరాజు కొడుకే ఇప్పటి దొర అని కథా క్రమంలో తెలుస్తుంది. శివ, అతని మిత్ర బృందంతో అడవిలో పందులను వేటాడడం, ఫారెస్ట్ ఆఫీసర్ మురళితో శివ గొడవ పడటం, ఈ మధ్య మధ్యలో శివ కి తనని ఎవరో వెంటాడుతున్నట్లు , ఏదో హెచ్చరిస్తున్నట్లు కలలు రావడం, దైవ నర్తకుడు గరుడ హత్యకు గురైనప్పుడు, జైలులో ఉన్న శివకు ఎవరో పెద్దగా ఏడుస్తున్నట్లు కల రావడం ఇలాంటి సన్నివేశాలు చాల ఆసక్తికరంగా సాగుతాయి. కథ మధ్యలో సాగే నాయిక నాయకుల ప్రేమ సన్నివేశాలు అంతగా రక్తి కట్టలేదు. అడవి ప్రజల సంసృతి, ఆచారాలు, నమ్మకాలు బాగా ఎలివేట్ చేసి చూపించారు.
కథ ద్వితీయార్ధం ఫారెస్ట్ ఆఫీసర్ కి, శివకి మధ్య జరిగే గొడవలు, మధ్య మధ్యలో దొరతో సంభాషణలతో చాల నెమ్మదిగా సాగి ప్రేక్షకుల సహనానికి కాసింత పరీక్ష పెడుతుంది. అయితే దైవ నర్తకుడు గరుడని చంపింది దొరే అని తెలుసుకున్న తర్వాత జరిగే సన్నివేశాలతో నెమ్మదిగా సాగిన కథ మళ్ళీ ఊపందుకుంటుంది. ఇక పతాక సన్నివేశంలో శివ, దొరల మధ్య జరిగే పోరాటాలు, శివలోకి దైవం పూనిన సన్నివేశం ప్రేక్షకులను కుర్చీ అంచులకు తీసుకువస్తుంది.
కథకి ప్రాణంపోసింది రిషబ్ శెట్టి నటన. పోరాట సన్నివేశాలు, పతాక సన్నివేశంలో రిషబ్ శెట్టి నటన అద్భుతం. దైవం పూనినప్పుడు ఆ శివలో వచ్చే మార్పులు, చాల వింత అరుపు, కథాకళి నృత్య కళాకారుల ఆహార్యంతో అతను చేసే నాట్యంకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు అనిపిస్తుంది. నాయిక సప్తమి గౌడ నటన సహజంగా ఉంది. అయితే నాయిక, నాయకుల ప్రేమ కథ ఈ సినిమాలో అసలు రక్తి కట్టలేదు. ఒక పక్క ఫారెస్ట్ ఉగ్యోగిగా, మరో పక్క ఊరిప్రజల మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె ఒదిగిపోయింది.
శివ మిత్రులతో నడిచే సన్నివేశాలు సున్నితమైన హాస్యాన్ని పండించాయి. ఫారెస్ట్ ఆఫీసరుగా కిశోర్, దొర పాత్రధారి అచ్యుత్ కుమార్ తమపాత్రల మేర రక్తి కట్టించారు.
సినిమాకి బలం :
రిషబ్ శెట్టి నటన, తొలినుంచి తుది దాక ఆసక్తికరంగా కథని నడిపిన తీరు, చక్కటి ఛాయా గ్రహణం, అద్భుతమైన పతాక సన్నివేశాలు.
సినిమా బలహీనతలు: ద్వితీయార్ధం చాల నెమ్మదిగా సాగడం, నాయికానాయకుల మధ్య సరైన లవ్ ట్రాక్ లేకపోవడం, సినిమాలో పాటలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయినాయి. ఈ విషయాల్లో ఇంకాస్త శ్రద్ధ చూపివుండే ఇక “కాంతారా” కి తిరుగే లేదు. మొత్తం మీద సరికొత్త కధనంతో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా “కాంతారా “
..రోహిణి వంజారి
రచయిత్రి
Discussion about this post