మిడిల్ క్లాస్ సినిమాలు రావడం లేదని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా సందర్భాల్లో అనడం జరిగింది. మన దేశంలో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి వారి జీవితాల్ని ప్రతిబింబించే సినిమాలు తగ్గిపోవడం మంచి పరిమాణం కాదు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార వారు తీసిన స్వాతిముత్యం సినిమా నిజమైన మిడిల్ క్లాస్ సినిమా!
ఫార్ములా నుండి దూరంగా జరిగి వీర్య దానంను అంశంగా తీసుకుని దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ రాసుకున్న కథ ఇది. హీరో బాల (బెల్లంకొండ గణేష్) మధ్యతరగతికి చెందిన ఒక ప్రభుత్వ ఇంజనీర్. పెళ్లి చూపుల్లో చూసిన భాగ్య లక్ష్మి (వర్ష బొల్లమ్మ) ను ప్రేమించడం మొదలు పెడతాడు. సరిగ్గా పెళ్లి రోజున ఒక సమస్య వచ్చి పడుతుంది. దానిని హీరో, హీరోయిన్లు ఎలా అధిగమించారు అనేది చిత్ర కధాంశం.
ఫార్ములా ను అధిగమించి మంచి కథను రాసుకుని, దానిని గొప్పగా తెరకెక్కించిన సినిమా స్వాతిముత్యం. వీర్య దానం అనే అంశం ను తీసుకుని సోషల్ మెసేజ్ ను వినోదం తో ఇవ్వగలిగాడు దర్శకుడు. దర్శకుడు స్వంతంగా రాసుకున్న కథలో బలం, లోతు ఉన్నాయి. కడుపువుబ్బ నవ్వించే వినోదం ఉంది.
గ్రామీణ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య సంఘర్షణను మెలోడ్రామా, సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా దర్శకుడు ఈ సినిమా తీసిన తీరు మన హృదయాన్ని తాకుతుంది. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, తక్కువ పాత్రలు, ఒకే ఒక వూరు, హాస్య రసం, ఆలోచింపజేసే సంభాషణలు… ఈ సినిమా ప్రత్యేకత. చెడ్డ పాత్రలు అంటూ ఈ సినిమాలో ఏమి లేవు. ప్రతి పాత్రలోనూ ఉన్న ప్రత్యేకత ముచ్చట గొలుపుతుంది. తమ జీవితం లో ఎదురయ్యే సవాళ్ళను హీరో, హీరోయిన్లు అధిగమించిన తీరు స్ఫూర్తిదాయకం గా ఉంది.
ఇది కూడా చదవండి
హీరోయిన్ సాత్వికా రాజ్ ఇంటర్వ్యూ
తెలుగు సినిమాకు ఇది స్వర్ణ యుగం. కొత్త దర్శకులు గొప్ప సినిమాలు తీస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమా మన మీద చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా పేరుతో వచ్చిన ఈ సినిమా ఆ స్థాయిలో ఉంది. ఫోటోగ్రఫీ బావుంది. మిడిల్ క్లాస్ వాతావరణాన్ని బాగా క్రియేట్ చేశారు. మహతి సాగర్ నేపథ్య సంగీతం, పాటలు గొప్పగా ఉన్నాయి. అన్ని విభాగాలు వారు మంచి ప్రతిభను ప్రదర్శించారు. సీరియస్ సబ్జెక్ట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది.
హీరో గా నటించిన బెల్లంకొండ గణేష్ పరవాలేదు. హీరోయిన్‌గా నటించిన వర్ష బొల్లమ్మ బాగా నటించింది. వారి పాత్రల్లో ఒక ప్రత్యేకత ఉంది. రావు రమేష్, ప్రగతి, నరేష్, సురేఖవాణి, వెన్నెల కిషోర్, సుబ్బ రాజు తదితరులు చక్కగా నటించారు. నూతన నటుడు గోపరాజు రమణ అద్భుతంగా నటించాడు. ఇది దర్శకుని చిత్రం. గతంలో ఎన్నడూ రానటు వంటి చిత్రం. యువత తప్పక చూడాల్సిన చిత్రం.
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు
Discussion about this post