తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని డెప్యుటేషన్ సిబ్బందికి టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం సూచించారు. తిరుమల వైభోత్సవ మండపంలో గురువారం సాయంత్రం డెప్యుటేషన్ సిబ్బందితో జేఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఈ విశేష ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించిన ప్రణాళికను తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పర్యవేక్షక అధికారులకు సూచించారు. తిరుమలలో స్థానికుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో వారి ఆధార్ కార్డులో తిరుమల అడ్రసును పరిశీలించిన అనంతరం ఉచితంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామన్నారు.
ఈ సమావేశంలో టీటీడీ సీనియర్ అధికారులు, డెప్యుటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discussion about this post