భారతీయ సినిమాల్లో చారిత్రాత్మక సినిమాలు రావడం చాలా తక్కువ. ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన బాహుబలి సినిమా ఏ జోనర్‌లో తీసారో చెప్పడం కష్టం. కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల నవల పొన్నియన్ సెల్వన్‌ను సినిమాటిక్ పేరుతో చెడ గొట్టకుండా ఆర్టిస్టిక్‌గా, హానెస్ట్‌గా తీశాడు దర్శకుడు మణిరత్నం.
కథ విషయానికి వస్తే కథ చాలా పెద్దది. పాత్రలు ఎక్కువ. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో సినిమా మొదలు అవుతుంది. రాష్ట్రకూటుల మీద యుద్ధంలో చోళ రాజు కరికాలుడు విజయం సాధించడంతో కథ మొదలు అవుతుంది.
కథలో డైమెన్షన్స్ ఎక్కువ వుండటం వల్ల మొదటి భాగంలో కథ అర్థం చేసుకోవటం కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యం గా కథను నడిపిస్తూ వచ్చిన కార్తి మాయం అవుతాడు.
రెండో భాగం వచ్చేక గానీ దర్శకుడు మన దృష్టిని ఆకర్షించలేడు. పడుగు, పేక లా అల్లుకుంటూ వచ్చిన సన్నివేశాలు రెండో భాగంలో స్పష్టత వస్తాయి. క్లైమాక్స్‌తో మనని కట్టి పడేస్తాడు దర్శకుడు మణిరత్నం. రెండో భాగం ఎలా వుంటుందా అనే ఆసక్తిని పెంచాడు. చోళులు, పాండ్యులు మధ్య జరిగిన సంఘర్షణను చారిత్రక స్పృహతో తెరకెక్కించారు.
రవివర్మన్ చాయగ్రహణం సినిమాకు ప్రాణం పోసింది. ఏ అర్ రెహమాన్ సంగీతం కూడా. తోట తరణి, అలాగే కళా దర్శకుడు… వీరంతా మంచి పనితనాన్ని ప్రదర్శించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల నిర్మాణ విలువలు బాగున్నాయి. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వాతావరణం క్రియేట్ చేశారు. గ్రాఫిక్ వర్క్ సినిమాలో ఒదిగి పోయింది.
ఈ సినిమాలో నటించిన వారు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. చియాన్ విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. అతని పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రతి ఒక్కరు బాగా నటించారు. సముద్ర కుమారి గా నటించిన అమ్మాయి కూడా బాగా నటించింది. అభిరుచి గల ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమా. చరిత్ర మీద ఆసక్తిని పెంచే సినిమా.
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు
Discussion about this post