‘ఇల్లేమో దూరం… అసలే చీకటి, గాఢాంధకారం… దారంతా గతుకులు… చేతిలో దీపం లేదు… కానీ గుండెల నిండా ధైర్యం ఉంది’
-అని 2014 మార్చి 14న హైదరాబాద్ నగరంలోని హెచ్.ఐ.సి.సి. కన్వెన్షన్ కేంద్రంలో దిక్కులు పిక్కటిల్లేలా ఒక కంఠం గర్జించింది. ఆ గర్జనను జన బాహుళ్యం దశాబ్దం గడిచినా మరచిపోలేదు. ఆ కవితా పంక్తులు ఇన్నేళ్లయినా ఎందుకు చిరంజీవిత్వం పొంది ఉన్నాయి? అందుకు ఒకటే కారణం – ఆ కవి పలుకులను జన ఘోషగా మార్చి పలికిన నాయకుడిలోని తెగువ… పోరాట పటిమ… నిజాయతీ… అన్నిటికీ మించి ప్రజా పక్షపాతిగా హృదయంతో స్పందించే గుణం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా గుండెల నిండా ధైర్యంతో అడుగులు వేస్తున్న ఆ నాయకుడే… పవన్ కళ్యాణ్. ఆయన స్థాపించిన జనసేన నేటితో పది వసంతాలు పూర్తి చేసుకొంది.
రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ప్రారంభమయిన జనసేన తొలి అడుగులు పోలింగ్ బూత్ వైపు పడలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రేయోభివృద్ధిని కాంక్షిస్తూ ప్రయాణం మొదలైంది. సహజంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రాజకీయ గోదాలోకి వెళ్ళేది అధికారం, పదవి కోసమే. పార్టీ స్థాపిస్తున్నాను అని ప్రకటించిన తరవాత ఇప్పటి ఎన్నికలు నా లక్ష్యం కాదు… పాతికేళ్ళ ప్రయాణం చేస్తాను అని ప్రకటించడం ఎప్పుడూ ఎవరూ విని ఉండరు. ఆ మాటల వెనక ఆంతర్యం పవన్ కళ్యాణ్ లోని సామాజిక నిబద్ధతను తెలియచేస్తాయి. ఇన్స్టెంట్ కాఫీకి అలవాటు పడ్డ కాలమిది. స్వల్పకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలే ఉంటాయి. కానీ దూరదృష్టి ఉన్నవారు మాత్రమే స్థిరమైన లక్ష్యాన్ని ఎంచుకుంటారు. అలాంటివారిలోనే జాతీయ భావనలు, వారి చర్యల్లో మానవీత గోచరిస్తాయి.
జగన్ దళంలో చేరితే ముద్రగడ క్రెడిబిలిటీ శిథిలం అయిపోదా?
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతు పలకడం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కూటమి విజయానికి వెన్నుదన్నుగా జనసేనాని నిలవడం అందరికీ తెలిసినదే. పార్టీ నిర్మాణంలో సైద్ధాంతికతను జోడించిన పార్టీగా జనసేన నిలిచింది. ఏడు సిద్ధాంతాలకు అనుగుణంగానే ముందుకువెళ్తోంది. ఇందులో పర్యావరణ అంశాన్నీ జోడించడం విశ్లేషకుల్ని సైతం విస్మయపరచింది. ఏదో పెట్టారులే అనుకొన్నవారికి… పార్టీలోని ఒక ప్రధాన కార్యదర్శికి పర్యావరణం బాధ్యతలు అప్పగించడం చూశాక – పవన్ కళ్యాణ్ ఎంత నిబద్ధతతో సిద్ధాంతాలు ప్రకటించారో అర్థం అయింది.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటించాక రాజకీయ ప్రయాణం ఏ దశలోనూ సాఫీగా సాగలేదనేది సత్యం. దారంతా గతుకులు అని తనకు తెలుసు కాబట్టే తొలి రోజే ఆ మాట చెప్పి… తన దారి తానే నిర్మించుకోవడం మొదలుపెట్టారు. పేద, సామాన్య ప్రజలు, ఆడబిడ్డల పక్షం వహిస్తూ… ప్రతి సామాజిక సమస్యపై స్పందించారు. పోరాడారు. ఉద్ధానమ్ కిడ్నీ బాధితుల కోసం విదేశాల నుంచి వైద్య నిపుణులను పిలిపించి పరిశోధనలు చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పుడే పాలకుల్లో కదలిక వచ్చింది. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కలిగిన పేదల పక్షాన నిలిచి గళం వినిపించారు. 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా – గుండెల నిండా ధైర్యం కలిగిన నేత కాబట్టే బలంగా నిలిచారు. జనసేన అనే వృక్షంపైకి ఎన్నికల కోసం వాలిన పక్షులు ఫలితాల తరవాత ఎగిరిపోయినా ఆ వృక్షం నిలిచే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ నాటిన విత్తు ఎంత బలంగా వేళ్లూనుకొని ఉందో ప్రజలు అందరూ గ్రహించారు.
త్యాగాలు లేకుండా విజయం సిద్ధించదు
2019 తరవాత పోరాటం, నిరసన అనే మాటలు పలకాలంటేనే భయపడే నియంతృత్వ పోకడలు రాజ్యమేలడం మొదలుపెట్టాయి. ఈ మాటలను ఆచరణలోకి తీసుకువచ్చి ప్రజలకు, ప్రతిపక్షాలకు ధైర్యాన్ని నూరిపోసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని ప్రభుత్వమే కుదేలు చేస్తే భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడితే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేసి ప్రభుత్వ దాష్టీకాన్ని ప్రజలకు వెల్లడించారు. అంతే కాదు వారికి అండగా నిలిచేలా డొక్కా సీతమ్మ గారి పేరిట అన్న సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరవాత రహదారుల దుస్థితిని ప్రపంచానికి తెలియచెప్పారు… ఇందుకు సామాజిక మాధ్యమాలను వేదిక ఎంచుకోవడమే కాదు, శ్రమదానం ద్వారా రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ పాలకుల అమానవీయ నిర్లక్ష్యంతో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే జనసేన అధ్యక్షులు చలించిపోయారు. రూ.5 కోట్ల సొంత సంపాదనను. నిధిగా ఏర్పాటు చేసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకొనే బృహత్తర యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష సాయం అందించారు. పాలకుడు చేయాల్సిన విధిని ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చేశాడు… అదీ మానవీయత నిండిన నాయకత్వం అంటే.
స్పందించే మనసు లేని వ్యక్తి అధికార పీఠం మీద ఉన్నా ప్రయోజనం లేదని యావత్ ఏపీ ప్రజలకు వెల్లడైన సందర్భం… జనవాణి కార్యక్రమం. కనీసం ముఖ్యమంత్రికి తమ సమస్యలను జనం చెప్పుకొనే పరిస్థితి రాష్ట్రంలో లేదు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేసి గంటల తరబడి నిలబడి ప్రతి ఒక్క బాధితుడి వేదన విన్నారు. ఆ సమస్యలను ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లే యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో వచ్చిన వారి ఈతిబాధలు చూసి చలించిపోయి అప్పటికప్పుడే ఆర్థిక సాయం చేశారు. ఆ సాయానికి వెల కట్టలేము.
భాష అనేది రాజకీయ నాయకుల దృష్టిలో ఓట్లు రాల్చని సబ్జెక్ట్. మాతృ భాషను మృత భాష చేయాలని పాలకుడు కంకణం కట్టుకొంటే దానిపై నిరసన గళం విప్పిన నేత పవన్ కళ్యాణ్. అంతే కాదు భాషాభిమానులతో సదస్సులు నిర్వహించి తెలుగును కాపాడుకొనే దిశగా అడుగులు వేయించారు. మెజారిటీ మతానికి ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడితే లౌకికవాదానికి వ్యతిరేకి అనే ముద్రపడుతుందని భయపడని నేత పవన్ కళ్యాణ్. ఇస్లాం, క్రైస్తవం… ఇలా ఏ ఒక్కరికి వేదన కలిగినా స్పందించినట్లే హైందవ ధర్మానికీ, హిందూ ఆలయాలకి ఏ అపవిత్రం జరిగినా అదే స్థాయిలో స్పందించారు. ఇదీ… అన్ని మతాలను గౌరవించడం… సమాదరించడం అంటే.
ఎక్కడో కర్నూలు నగరంలో ఓ దివ్యాంగురాలు తన కుమార్తెను కీచకులు చెరబట్టడంతో ఆత్మహత్య చేసుకొంది.. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరు అయితే ఆ నరగానికి వెళ్ళి నిరసన ప్రదర్శన చేసి పోలీసుల్లో కదలిక తెచ్చారు.
ఈ ప్రయాణంలో ఎన్నో ఒత్తిళ్ళు… వేధింపులు.. వ్యక్తిత్వ హననాలు… ఒకటేమిటి ఒక మనిషిని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్నీ పాలకులు చేశారు. చివరకు ప్రజలకు అభివాదం చేయకూడదు అని పోలీసులతో హుకుం జారీ చేయించారు… హోటల్ గదిలోనే నిర్బంధించారు. అయినా వెనక్కి తగ్గలేదు. తనని నమ్మిన జనం కోసం పోరాటమే చేశారు. కార్మికులు, కర్షకులు, మత్స్యకారులు, మహిళలు, యువజనులు, నిరుద్యోగులు, ఉద్యోగులు… ఇలా ప్రతి వర్గం తరఫున మాట్లాడారు. బాసటగా నిలిచారు. ప్రతి అడుగు ఒక ప్రభంజనం అయ్యింది. ప్రజల గొంతుకై ప్రజ్వరిల్లింది.
2024, మార్చి 14… ఇప్పుడు జనసేన అభిమానులు, వీర మహిళలు మాత్రమే కాదు ప్రతీ విశ్లేషకుడు గుర్తించాల్సింది ఇదీ… ‘అధికారమనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది… చేతిలో వెలుగులు విరజిమ్మే కాగడా ఉంది… ఆయన గుండెల నిండా ఉన్న ధైర్యం… ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది’. అఖిలాంధ్ర ప్రజల ఆశా జ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్. ఇది – కాలం చెబుతున్న వాస్తవం.
– సత్యగ్రీవ
(సగటు మధ్యతరగతి మనిషి)
Discussion about this post