చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు చెప్పారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారులతో కలసి శ్రీకాళహస్తీశ్వర ఆలయం పరిశీలించారు. క్యూలైన్లు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన ఎస్పీ మాట్లాడుతూ… మార్చి 1వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటి ఆలయంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్ల ఏర్పాటు, దొంగతనాలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల మధ్య తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇందుకు అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను కోరారు. అదేవిధంగా పోలీసు బందోబస్తు విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి లోని ఇతర ప్రభుత్వ విభాగాలు రెవెన్యూ, మునిసిపాలిటీ, ఆలయ పరిపాలన తదితర విభాగాలతో సమన్వయం చేసుకొని భక్తులకు భద్రత కల్పించాలని కోరారు.
దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శివుని దర్శనార్థం భక్తులు వస్తారని… వారికి ఇబ్బుందులు కలుగకుండా చర్యలు తీసుకోవడమే తమ బాద్యత అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో పెద్దిరాజు, డీఎస్పీ విశ్వనాథ్, ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసులు,రెండవ పట్టణ సీఐ భాస్కర్ నాయక్, యస్.ఐలు సంజీవకుమార్ తదతరులు పాల్గొన్నారు.
.