భారత ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ కల్పించే విషయంలో పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి కోలా ఆనంద్ అన్నారు.
బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని తేరువీధిలో గల గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ నేతలు మౌనదీక్ష చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ… ఈ నెల 5వ తేదీన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ వద్ద జరిగే కార్యక్రమానికి రోడ్డు మార్గాన వెళుతుండగా మార్గమధ్యంలో కొందరు అడ్డుకున్నారన్నారు.
ఈ కారణంగా ఓ ఫ్లై ఓవర్ పై నరేంద్రమోదీ సుమారు 20 నిమిషాలు ఆగిపోయారన్నారు. ప్రధాని రోడ్డు మార్గాన వస్తున్నారని పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ ముందుగానే సమాచారం ఇచ్చినా… తగిన భద్రత కల్పించడంలో వారు విఫలమయ్యారన్నారు.
ప్రధానిని ఇలా అవమానించారంటే… దేశ ప్రజలను అవమానించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వ సైగలతో ఈ సంఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. భద్రత విషయంలో ఈ విధమైన నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల బుద్ధిని యావత్ ప్రపంచమంతా నిందిస్తున్నదని చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు,శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి కరుణా కటాక్షములతో నరేంద్రమోదీ దీర్గాయుష్షుతో ఉండాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆనంద్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
.