స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలకు పూర్వవైభవం తెప్పించడానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్ఢి శక్తికి మించి కృషి చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తే… వేలాది మంది భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఆయన కల నెరవేరితే ఈ విద్యాసంస్థ శ్రీకాళహస్తికే తలమానికంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరణశయ్యపై ఉన్న స్కిట్ కళాశాలను బతికించడానికి బియ్యపు మధు కృషితో సోమవారం తొలి అడుగు పడింది.
బియ్యపు మధు విజ్ఞప్తి మేరకు అనంతపురం జేఎన్ టీయూ ఉపకులపతి రంగ జనార్థన్ స్వయంగా వచ్చి స్కిట్ కళాశాలను పరిశీలించారు. కళాశాలకు సంబంధించిన సమగ్ర నివేదిక తనకు ఇస్తే పరిశీలన చేసి.. జేఎన్ టీయూలోకి విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీతో స్కిట్ పై మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ముక్కంటి ఆలయానికి అనుబంధంగా స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల ఇది.
also read : కాలగర్భంలోకి స్కిట్ ఇంజినీరింగ్ కాలేజీ
శ్రీకాళహస్తి పట్టణ శివారులో పూతలపట్టు – నాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే 55 ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాశాల ఉంది. 1997లో ప్రారంభమైన ఈ కళాశాల 2014వ సంవత్సరం వరకు ఏ సమస్య లేకుండా జరిగింది. ఆ తరువాత వివిధ కారణాలతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతూ వచ్చింది. 2017వ సంవత్సరం నుంచి కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బందికి నెలసరి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ముక్కంటి ఆలయం వారు ప్రతి నెలా రూ.25లక్షలు చెల్లిస్తూ వచ్చారు.
అప్పటి నుంచి గత నెల వరకు ఆలయం వారు రూ.14కోట్లు స్కిట్ కళాశాల ఉద్యోగుల వేతనాల కోసం చెల్లించారు. భక్తుల నుంచి వచ్చే సొమ్మను స్కిట్ కళాశాల ఉద్యోగులకు ఇవ్వడంపై మొదటి నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. దీనికి తోడు కళాశాలలో కేవలం 12మంది మాత్రమే విద్యార్థులు మిగిలారు.
ఈ సమస్యపై దేవాదాయశాఖ సుదీర్ఘంగా చర్చించి కళాశాల మూసివేయాలని నిర్ణయించారు. 2021 డిసెంబరు 31నాటికి కళాశాల మూసి వేస్తున్నట్లు ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు స్కిట్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 24వ తేదీ వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ సమస్యను కొంతమంది శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థను మూసివేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని.. అంతేగాకుండా ఈ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షగా మారుతుందని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఊరి బాగు కోసం స్కిట్ కళాశాలను కాపాడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
దీంతో బియ్యపు మధు వెంటనే స్పందించారు. ఈ కళాశాలను జేఎన్ టీయూలో విలీనం చేస్తే బాగుంటుందని భావించారు. వెంటనే ఈ సమస్యను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీసుకెళ్లారు. మరణశయ్యపై ఉన్న స్కిట్ కళాశాలకు ఊపిరి పోయాలని కోరారు. ఎమ్మెల్యే బియ్యపు మధు విజ్ఞప్తిపై పెద్దిరెడ్డి సానుకూలంగా స్పందించారు.
వెంటనే అనంతపురం జేఎన్ టీయూ ఉపకులపతి రంగ జనార్ధన్ తో మాట్లాడారు. శ్రీకాళహస్తికి వచ్చి స్కిట్ కళాశాల పరిశీలించి… జేఎన్ టీయూ లోకి విలీనం చేసుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు జేఎన్ టీయూ ఉపకులపతి రంగ జనార్ధన్ సోమవారం శ్రీకాళహస్తికి వచ్చారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డితో కలసి స్కిట్ ను పరిశీలించారు.
ఫర్నీచరు. ల్యాబ్ లను కూడా స్వయంగా చూశారు. కళాశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని ఉద్గ్యోగులను ఆదేశించారు. గతంలోనే నివేదిక పంపామని ఈ సందర్భంగా స్కిట్ ఉద్యోగులు ఆయనకు చెప్పారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాజాగా వివరాలతో నివేదికలు పంపాలని వారిని ఆదేశించారు. వీలైనంత వరకు ఈ కళాశాలను జేఎన్ టీయూలోకి విలీనం చేసుకోవడానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఆయన హామీతో అందరూ ఆనందపడుతున్నారు. ఈ కళాశాలను జేఎన్ టీయూ లోకి విలీనం చేసుకుంటే శ్రీకాళహస్తికి ఖ్యాతి మరింత పెరగడంతో పాటు… వేలాది మంది విద్యార్థులకు మంచి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య లభించడంతో పాటు… వారికి భవిష్యత్తు బంగారు బాట వేసినట్లు అవుతుంది. ఇదే జరిగితే బియ్యపు మధుసూదనరెడ్డి పేరు శ్రీకాళహస్తిలో శాశ్వతతంగా నిలబడి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.