ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజక వర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి డిమాండు చేశారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని నాలుగు మండలాలు తిరుపతి రెవిన్యూ డివిజన్లో ఉన్నాయని.. కొత్త జిల్లాల పేరుతో వీటిని విడదీయం భావ్యం కాదన్నారు.
శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాలను నాయుడుపేట రెవిన్యూ డివిజన్ లో కలపడం ప్రజలకు ఏమాత్రం సౌలభ్యం కాదన్నారు. నాయుడుపేటలో 50వేల జనాభా కూడా లేదన్నారు.
సుమారు లక్ష జనాభా.. అర శతాబ్దంగా పురపాలక సంఘంగా ఉన్న శ్రీకాళహస్తిని కాదని.. నాయుడుపేటను రెవిన్యూ డివిజనుగా మార్చడంలో ఆంతర్యమేమిటని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.
తన తండ్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
శ్రీకాళహస్తి లో రెవిన్యూ డివిజన్ పెట్టటం వల్ల సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ మండల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి శ్రీకాళహస్తి ని రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని సుధీర్ రెడ్డి ప్రకటించారు.
.