కొవిడ్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉండటం… అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తూ ఉండటం వంటి కారణాల వల్ల శుక్రవారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. మొదట్లో లాభాల్లో నడిచిన మార్కెట్లు… ఆ తర్వాత దూకుడు తగ్గించాయి. ఒక దశలో నష్టాల్లో కొనసాగాయి. అయితేనేం… బుల్స్ ఎక్కడా పట్టు విడవలేదు. షేర్ల ధరలు పడినప్పుడల్లా కొనుగోళ్లు కొనసాగించారు.
దీంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయి. చివరి వరకు ఆ లాభాలను నిలబెట్టుకోగలిగాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్‌తో పాటు గత రెండు రోజులుగా భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఐటీ రంగ షేర్లకు భారీగా మద్దతు లభించింది. మరోపక్క నిన్న దుమ్ము దులిపిన వాహన రంగం ఈరోజు పడకేసింది. ఫార్మా, భారీ యంత్ర పరికరాల విభాగంలోని షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల్లో కొనుగోళ్ల సందడి కనిపించింది. విదేశీ మదుపర్ల ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. వారు యధావిధిగా అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రేడింగ్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 143 పాయింట్ల స్వల్ప లాభంతో పాయింట్లు పెరిగి 59745 పాయింట్ల వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంచీ నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 17813 వద్ద క్లోజయింది..
బీఎస్ఈ లో శుక్రవారం 3493 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 2103 షేర్లు పెరిగాయి. 1308 షేర్లు క్షీణించాయి. 82 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 502 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 10 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 697 షేర్లు అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తే…149 షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి . బీఎస్ఈ లో మొత్తం 5,484 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
ప్రధానంగా లాభపడ్డ షేర్లు: గ్రాసిమ్, ఓఎన్జీసి, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, శ్రీ సిమెంట్స్ లు
అధిక శాతం నష్టపోయిన షేర్లు: ఎం&ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్&టీ, హెచ్‌డీఎఫ్‌సీలు
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.

Discussion about this post