ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అన్యాయం జరిగేలా ఉన్న పీఆర్సీపై పునరాలోచించి తగు న్యాయం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర నాయకులు యువశ్రీ మురళి డిమాండు చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాళహస్తి తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువశ్రీ మురళి మాట్లాడుతూ… పీఆర్సీ అమలు వలన ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుందని కొందరు అధికారులు ముఖ్యమంత్రిని… ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పీఆర్సీ లో వ్యత్యాసాలు సవరించి… మెరుగైన పిట్ మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్నింటికంటే ముందు సీపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంటి అద్దెలు పెరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందేనని..
అయితే అధికారులు మాత్రం ఇంటి అద్దె భత్యం తగ్గించాలని సూచించటం విడ్డూరంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే ఫిట్మెంట్ విషయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించక పోతే మళ్లీ ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
పదవీ విరమణ వయస్సును పెంచడం సరికాదని…డీఎస్సీ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం తహసీల్దారు జరీనా బేగం కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నేత గజేంద్ర , శ్రీకాళహస్తి డివిజన్ కన్వీనర్ గుమ్మడి మురళి, ఎస్టీయూ నాయకులు జయప్రకాష్, స్టాలిన్,కన్నయ్య, రామచంద్రయ్య, శ్రీనివాసులుయాదవ్, చిన్నయ్య, జగన్నాథం, చంద్రయ్య, చేమూరు రవి,శ్రీహరి,మోహన్ బాబు,దామోదరం,రమణయ్య,శ్రీనివాసులు,సురేష్ బాబు, గంగాదేవి,పద్మావతి, సుజన, దీప, శ్యామల, సూరిబాబు, రుద్రయ్య, సునీల్, నాగూరు, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.
.