ఇవాళ నాగుల చవితి. పాఠకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. పండగను ఘనంగా జరుపుకోవడం మనకు ఇష్టం గనుక.. ఇవాళ హిందూధర్మాన్ని ఆచరించే వాళ్లందరూ పొద్దున్నే శుభ్రంగా తయారై.. సమీపంలో ఉన్న పాముల పుట్ట వద్దకు వెళ్తారు. పుట్టలో పాలు పోస్తారు. మోగులు వచ్చిన సజ్జలు, పచ్చినువ్వులతో బెల్లం కలిపి చేసిన చిమ్మిలి ముద్ద, బియ్యపు పిండితో చేసిన చలిమిడి ముద్ద, నానబియ్యం, వడపప్పు అన్నీ పుట్ట దగ్గర నైవేద్యం పెడతారు. పచ్చి పాలు పుట్టలో పోస్తారు. గుడ్లు కూడా వేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్లు గుడ్డు తప్ప మిగిలినవన్నీ చేస్తారు. పుట్టలో పాలుపోయకుండా.. పాము తాగుతుందనే ఉద్దేశంతో పుట్ట వద్ద మట్టి పాత్రలు పెట్టి అందులో పాలు నింపి వచ్చేసేవాళ్లు కూడా ఉంటారు. ఉపవాసాలు ఉంటారు.
పాముకు నైవేద్యం పెట్టడానికి తయారుచేసిన పచ్చి దినుసులతో కూడినవి మాత్రమే తింటారు. అలాగే పాము ఇవాళ పుట్టలోంచి బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో పుట్టచుట్టూ దారం చుడతారు. మరురోజు – అంటే పంచమి రోజు పుట్ట వద్దకు వెళ్లి (ఆ దారం తీసేయాలి) ఆ దారంలో ఒక ముక్క తమతో తిరిగితెచ్చుకుంటారు. పుట్టమట్టిని కూడా భక్తిగా తెచ్చుకుంటారు.
ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని దేవుళ్లుగా భావించడంతోనే మతాచారాలు, ధర్మాలు అన్నీ మొదలై ఉంటాయి. మనం ఎరిగిన సమస్త జంతువులూ దేవుళ్ల వాహనాలుగానూ, దేవుళ్ల రూపాలుగానూ మనకు అనేక కథలు ఉంటాయి. పామును కూడా అలా మనం దేవుడిగా భావించి దానిని బాగా చూసుకోవడం కోసం ఏడాదిలో ఒక రోజును కేటాయించుకుంటే తప్పేం లేదు. కానీ పాముకు పాలు ఎందుకు పోస్తున్నట్టు? పాము పాలు తాగుతుందనే నమ్మకంతోనే కదా. ‘పాము పాలు తాగదు’ అని బయాలజీ చదువుకున్న వాళ్లందరికీ తెలుసు. వాళ్లు తెగేసి చెప్పగలరు. అదనంగా ఏమైనా తెలుస్తుందేమోనని గూగుల్ ను అడిగితే ఇంకా నిష్కర్షగా చెప్పింది.
‘‘పాములు పాలు తాగవు. పాముల వంటి సరీసృపాలు ఏవీ కూడా పాలలో ఉండే ఎంజైములను జీర్ణం చేసుకోలేవు. వాటి వల్ల కాదు. అడవుల్లో పాములు హైడ్రేషన్ ను నీళ్లు తాగడంద్వారా, తాము తినే జీవుల ద్వారా మాత్రమే పొందుతాయి. పాము బాగా డీహైడ్రేషన్ కు గురైతే పాలు మాత్రమే కాదు కదా.. ఏ ద్రవ పదార్థం పెట్టినా తాగేస్తుంది. అయితే, పాము చేత బలవంతంగా పాలు తాగించడం దానికి ప్రమాదకరం, అది చచ్చిపోవచ్చు కూడా. పాములను పెంచేవాళ్లు రోజుల తరబడి పామును డీహైడ్రేషన్ కు గురిచేసి అది ఏం ఇచ్చినా సరే తాగేలాగా దానిని తయారుచేస్తారు’’ అని సమాచారం తెలిసింది.
సంఘజీవనంలో ఏదో ఒక పండుగ జరుపుకోవడం మంచిదే అనుకుందాం. పండగ అంటే నలుగురూ కలుస్తారు. మంచీ చెడూ మాట్లాడుకుంటారు. ఇది మంచి సామాజిక వాతావరణానికి ఉపయోగపడుతుంది. అలాగే నాగులచవితి పండుగ నైవేద్యాల తరహాలో పచ్చివి, నానబెట్టినవి, మోగులు వచ్చినవి తినడం కూడా మంచిదే. ఉపవాసాలు ఉంటే కూడా ఆరోగ్యానికి కొంత మేలే జరగవచ్చు. కానీ పాముకు పాలు పోయడం అనేది అంత తెలివైన పని కాదు.
ఈ దేశంలో గుక్కెడు పాలు దొరక్క అలమటించే నిరుపేద పిల్లలు లక్షలు కోట్ల మంది ఉంటారు. వారికి ఉపయోగపడగల పాలను మనం మట్టిలో, పుట్టలో పోసేయడం మంచిది కాదు. నాయకుల పట్ల భక్తిని, సినిమా హీరోల పట్ల ప్రేమను చాటుకోవడానికి ఫ్లెక్సి పోస్టర్ల మీద పాలు కుమ్మరించే ధూర్తులు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు.
పాలు దొరక్క, పౌష్టికాహారం దొరక్క శుష్కించిపోయే భావిపౌరులు మనకు కొదవలేదు. పాముకోసం పాలుపోసి.. ఆ జీవిమీద హత్యాయత్నం చేయడం ఎందుకు? పాముకు పోయకుండా ఏదైనా ప్రత్యామ్నాయంగా చేద్దాం అనుకునే వాళ్లు చక్కగా మీకు దగ్గర్లో ఉండే గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలకు పాలు ఇవ్వగలిగితే బాగుంటుంది. పేదపిల్లల ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది. పుణ్యం లాంటి పదాలను మీరు నమ్మేట్లయితే అది మీకు దక్కుతుంది. ఆ పిచ్చిలేకపోయినా సరే.. కనీసం మీ వల్ల కొందరు పిల్లలకు కొంత పౌష్టికాహారం దొరికిందనే తృప్తి ఉంటుంది. ఇంకోకోణంలో చూసినప్పుడు పాము మీద హత్యాయత్నం చేసిన పాపం మీకు అంటకుండా కూడా ఉంటుంది.
జీర్ణం చేసుకోలేని పాముకు పాలు పోసి హత్యాయత్నం చేయడం ఎందుకు?
జీర్ణం చేసుకోగల పసిపిల్లలకు దక్కేలా పాలు ఇవ్వగలిగితే మంచిది కదా?
.. కె.ఎ.మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, ఆదర్శిని
Discussion about this post