నైతిక విలువలు అనేవి నిర్దిష్టంగా ఉంటాయని మనం భ్రమపడుతుంటాం. కానీ, అవి కూడా మంచి-చెడు లాగా రాశులు పోసినట్టు వేర్వేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం అవకాశాన్ని బట్టి చెడ్డతనం రూపుకట్టుకున్నట్టే.. విలువలు కూడా స్థలకాలమాన పరిస్థితులను బట్టి రూపుమార్చుకుంటూ ఉంటాయి. ఇవాళ్టి రాజకీయాల్లో ‘నైతికవిలువలు’ కూడా ఒక అభ్యంతరకరమైన పదంగా మారిపోయింది. నాయకులను నిర్దిష్టంగా విలువలు పాటించేవాళ్లు, విస్మరించేవాళ్లుగా వర్గీకరించలేని రోజులివి.
విశాఖపట్నం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో ఈ చర్చ తలెత్తుతోంది. ఇంచుమించుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో 840 వరకు ఓట్లున్నాయి. 600 పైచిలుకు ఓట్లు మొన్నటిదాకా అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వే! తెలుగుదేశానికి ఉన్న బలం 200 పైగా ఓట్లు మాత్రమే. ఇలాంటి వాతావరణంలో.. ఏదో మొక్కుబడిగా అభ్యర్థిని పోటీచేయించాల్సిందే తప్ప.. సీరియస్ గా ఒక పార్టీ బరిలోకి దిగుతుందని ఊహించలేం. కానీ.. తెలుగుదేశం (అనగా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి) చాలా సీరియస్ గా తీసుకుంటూ గెలిచి తీరాలనే కాంక్షతోనే సన్నద్ధం అవుతోంది. గండి బాబ్జీ, పీలా గోవింద్ తదితర పేర్లు వినిపించాయి. ఖచ్చితంగా గెలవగల అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
విశాఖ కార్పొరేటర్లు కొందరు వైసీపీ నుంచి కూటమి పార్టీల్లో చేరి ఉండవచ్చు గాక.. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవగల బలం అంటే ఇంకా చాలాఓట్లు కావాలి. మరి ఏ నమ్మకంతో ఎన్డీయే కూటమిరూపంలోని తెలుగుదేశం ఆ సీటు మీద ఆశపెట్టుకుంటోంది?
కేవలం ఫిరాయింపులమీదనే వారి ఆశలు ఉన్నాయి! ఒక పార్టీ తరఫున గెలిచిన వారిని ప్రలోభపెట్టి, లేదా మాయచేసి తమ పార్టీలో చేర్చేసుకోవడం నైతికవిలువలను మీరినట్లు అవుతుందా? లేదా? తెలియజెప్పే సరిహద్దు గీతను మనం మరచిపోయి చాలాకాలం అయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రతినిధుల సంగతి కాదు కదా.. ప్రభుత్వాలను కూల్చేసే చట్టసభల ప్రతినిధుల ఫిరాయింపులను కట్టడి చేయడానికి తెచ్చిన చట్టానికే లొంగకుండా.. యథేచ్ఛగా ఎన్నటినుంచో జరుగుతున్న అలాంటి వక్ర కార్యకలాపాలు మనకు అలవాటైపోయాయి. మనలో జడత్వాన్ని అవి పెంచేశాయి. ఇలా చేయడం తప్పు కదా అని మనం అనుకోవడం లేదు.
కానీ, నిందించదలచుకుంటే.. ఫిరాయింపు ఓట్ల మీద ఆధారపడి ఎమ్మెల్సీ ఎన్నిక నెగ్గదలచుకున్న చంద్రబాబునాయుడు నైతికత గీత దాటినట్టే. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి చేజిక్కించుకున్నా కూడా అక్కడ విలువలకు పాతర వేసినట్టే భావించాలి.
వైసీపీ వారు ఖచ్చితంగా గగ్గోలు పెడతారు. నిజానికి వారు ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారు. జగన్ ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని, కుటుంబాల సహా పిలిపించి వారితో ఫోటోలు దిగుతున్నారు. క్యాంపులకు తరలిస్తున్నారు. అయిదేళ్లలో కుటుంబాల సహా వచ్చి జగన్ తో ఫోటో దిగి ఆనందించగలిగే అవకాశం 151 మంది ఎమ్మెల్యేల్లో ఎందరికి వచ్చిందో కూడా చెప్పడం కష్టం. కానీ, ఇప్పుడు ఈ సర్పంచులు, ఎంపీటీసీలు తమకు అవసరం గనుక.. జగన్ వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇంత కష్టపడినా.. రేపు ఎమ్మెల్సీ సీటు చేజారితే.. నైతికవిలువల గురించి వారు గీపెట్టడం సహజం.
విలువల మాటెత్తే అర్హత వైసీపీకి ఉన్నదా? అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కనిపిస్తున్న వైసీపీ బలం అచ్చంగా వారి పట్ల అప్పట్లో వెల్లువెత్తిన ప్రజాదరణే అని చెప్పడానికి వీల్లేదు. ఆ ఎన్నికల సీజన్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లే వేయనివ్వలేదు. బెదిరించారు, కిడ్నాపులు చేశారు, కొట్టారు, దారిలో అడ్డుకుని నామినేషన్లను చించేశారు, వేసిన నామినేషన్లు చెల్లవని ప్రకటింపజేశారు.. ఇవన్నీ చేయడానికి తమకు అండగా పోలీసుల్ని కూడా వాడుకున్నారు. ఇన్నింటి నడుమ ఎవరైనా నెగ్గితే.. ఆ తరువాత వారి భుజాల మీద తమ పార్టీ కండువా కప్పేసి.. ‘మావాడే’ అని మమ అనిపించారు. ఇన్ని అరాచకాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఇప్పుడున్న మెజారిటీ కనిపిస్తూ ఉన్నదని అర్థం చేసుకోవాలి.
మరి ఎవరు విలువలు పాటిస్తున్నట్టు? ఎవరు వాటిని మీరుతున్నట్టు?
నిజానికి, నైతికవిలువలు అనేవి ఆదర్శ రాజకీయాలకు ఒక సరిహద్దుగీతలాంటివి అయితే.. ఈ నాయకులు ఆ గీతలను దాటడం మాత్రమే కాదు, ఆ గీతలను విచ్చలవిడిగా చెరిపి వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడులను ఇద్దరూ ఇద్దరే అని ఒకే గాటన కట్టేయడానికి వీల్లేదు. ఆ విషయంలో ఇద్దరివీ వేర్వేరు దారులు. నిన్న జగన్ ముద్ర వేరు.. నేడు చంద్రబాబు ముద్ర వేరు! అలాగని అదే బాటల్లో కలకాలం స్థిరంగా ఉంటారని లేదు. నైతికత, విలువలు విస్మరించడంలో ఒకరిని ఒకరు అనుసరిస్తూ కూడా ఉంటారు. కొత్త దారులు కనిపెడుతూ కూడా ఉంటారు. కుందేటికొమ్ము వెదకదలచినట్టుగా కాకుండా మనం ఆ పదాలను మరచిపోవడం నేర్చుకోవాలి.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు, ఆదర్శిని
Discussion about this post