శ్రీకాళహస్తి మండలంలో మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు… ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన వారే ఇందులో సూత్రధారులు. పాత్రధారులు. అడ్డుకోవడానికి యత్నించే ప్రజలపై దౌర్జన్యాలకు దిగుతున్నారు.
అధికారం మాదే.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. వీరి అక్రమ సంపాదన కోసం స్మశానాలనూ వదలడం లేదు. ఫలితంగా స్మశానం మాయమై పోయింది. ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే..
శ్రీకాళహస్తి మండలం గంగలపూడి సమీపంలో పెద్దవాగు (ఏరు) ప్రవహిస్తోంది. ఇక్కడ ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఇసుక నిల్వలే కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. గంగలపూడి గ్రామానికే చెందిన సుమారు పది మంది ఓ ముఠాగా ఏర్పడి ఇసుక, మట్టి అక్రమ వ్యాపారం చేస్తున్నారు.
పెద్దవాగు నుంచి ఇసుకను ఎక్సకవేటరు ద్వారా ట్రాక్టర్లకు నింపుతారు. ఆ తరువాత ఈ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ రోజుకు సగటున వంద ట్రాక్టర్ల ఇసుక తరలి పోతోంది. ఈ కారణంగా గంగలపూడి పెద్దవాగులో ఇసుక అంతరించి పోయి.. ఆ పరిసరాల్లో భూ గర్భ జలాలు అంతరించి పోతున్నాయి.
భూగర్భ జలాలు తగ్గి పోవడంతో రైతులు పంటలు సాగు చేయడానికి భయపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా ఆపకపోతే భవిష్యత్తులో తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు.
స్మశానం నుంచి మట్టి..
గంగలపూడి వద్ద ఉన్న స్మశానం నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ స్మశానం దాదాపు కనుమరుగైంది. ఇక్కడ మట్టి తోడేస్తుండటంతో ఎవరైనా మృతి చెందితే ఎక్కడ ఖననం చేయాలో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. స్మశానం నుంచి మట్టి తరలించ కూడదని గ్రామస్థులు కొందరు ట్రాక్టర్లు వెళ్లకుండా దారికి అడ్డుగా రాళ్లు నాటారు. అయినా వాటిని కూడా తొలగించి మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ స్మశానం నుంచి ఇప్పటికే వందలాది ట్రాక్టర్ల మట్టి తరలించేశారు.

ఇక్కడ నుంచి మట్టిని పల్లంపేట, వాగవేడు, యల్లంపల్లె, ఈండ్రపల్లె తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్మశానం నుంచి మట్టిని తరలించకుండా చూడాల్సిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇసుక, మట్టి అక్రమ రవాణా వెనుక ఇద్దరి వలంటీర్ల ప్రమేయం ఉందనే ఆరోపణ బలంగా ఉంది. అధికారులు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమ రవాణా చేయకుండా ఆపాలని… అదేవిధంగా స్మశానం కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
.