ప్రపంచం మొత్తం వేలంటైన్స్ డే జరుపుకుంటోంది. ప్రేమికులందరూ ఉత్సాహంగా ఈ రోజున పండుగ చేసుకుంటున్నారు. ప్రేమను ఆస్వాదించడానికి, ప్రకటించడానికి, వ్యక్తపరచడానికి.. భాగస్వామి పట్ల ప్రేమగా వ్యవహరించడానికి.. ఒక్క రోజు ఏమిటి? ఎలా సరిపోతుంది? నిజానికి జీవితపర్యంతమూ ఆ ప్రేమను అదేస్థాయిలో చూపిస్తూ ఉండాలి. అందుకే ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఈ రోజున ప్రత్యేకించి భారతీయులు కేవలం ప్రేమను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు.. మరొక కీలకమైన త్యాగాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. పుల్వామా ఉగ్రదాడికి ఇవాళ్టితో రెండేళ్లు పూర్తి అవుతున్నాయి. ఉగ్రవాదుల అకృత్యానికి వీరజవాన్లు అసువులు బాసిన సందర్భం ఇది. జాతి మొత్తం ప్రేమను గుర్తు చేసుకోవడంతో పాటు, వారి త్యాగానికి నివాళి అర్పించాల్సిన సందర్భం ఇది.
పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా అమరవీరులకు కేంద్ర మంత్రులు,ప్రముఖులు నివాళులర్పించారు. 2019 జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై ఆత్మాహుతికి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు చేసిన ఈ ఉగ్రదాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు అమరులయ్యారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర లో 78 వాహనాల్లో 2500 మంది సైనికులు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సిఆర్‌పిఎఫ్ సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు.
దేశానికి సైనికులు చేసిన సేవను, వారి అత్యున్నత త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మరచిపోదు అని ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
.