నేను ఎన్నడో పసితనంలో ఒక కథ చదివాను. ఓ యువకుడు పట్టణంలో చదువుకుంటూ తాతగారి దగ్గరకు బయల్దేరుతాడు. బస్సు ఎక్కిన తర్వాత అతనికి ఓచిన్న ఇబ్బంది ఎదురవుతుంది. పక్కసీటులో కూర్చున్న పెద్దాయన జేబులోంచి బీడీ తీసి ముట్టించి గుప్పుగుప్పన పొగ వదలడం ప్రారంభిస్తాడు. ఈ యువకుడికేమో పొగ పడదు. ఆ పెద్దాయనతో అనునయంగా రెండుమూడుసార్లు చెబుతాడు. ‘బస్సు దిగినతర్వాత బీడీ కాల్చుకోవచ్చు.. బస్సులో ప్రయాణిస్తుండగా ఎందుకు?’ అని!
ఆ పెద్దాయన ఓ వెకిలి నవ్వు నవ్వుతో అతగాడి కేసి చూసి పట్టించుకోడు. కాసేపటికి ఆ యువకుడు తన బ్యాగులోంచి లంక పుగాకు చుట్ట తీసి ముట్టించి.. గాఠ్ఠిగా లోపలకు పీల్చి వదులుతాడు. బీడీ పొగ కంటె చుట్ట పొగ ఘాటు ఎక్కువ కదా.. ఆ కుర్రాడు కష్టమ్మీద తెపరాయించుకుంటాడు. పక్కనే ఉన్న బీడీవాలాకు ఆ పొగ పడక పొలమారి కళ్లలో నీళ్లు చిప్పిల్లేంత పని అవుతుంది. అతను ఆ ఘాటు తట్టుకోలేక.. ‘బాబూ ఆ చుట్ట కాస్త ఆపి లోపల పెడతావా? బస్సులో అందరికీ ఇబ్బంది కదా?’ అంటూ కసురుకుంటాడు. ‘మరి నేను చెబుతున్నది అదేకదా.. ముందు ఆ బీడీ పక్కన పారేయ్’ అంటాడు యువకుడు.. తాతయ్యకోసం కొన్నటువంటి కట్టలోంచి తీసిన చుట్టను కూడా ఆర్పేస్తూ!– అంతే కథ!
బాహ్యప్రపంచంలో తిరుగుతున్నప్పుడు కొన్ని కనీస మర్యాదలు పాటించాలి. కనీస సంస్కారాలు అవి. నలుగురిలో ఉన్నప్పుడు సిగరెట్ తాగకూడదు.. అసభ్యంగా ప్రవర్తించకూడదు వంటి అప్రకటిత నియమాలు. ఇలాంటి సంస్కారాల్లో రోడ్ల మీద ఉమ్మివేయడం కూడా ఒకటి! నడుస్తూ నడుస్తూ.. వాహనంపై వెళుతూ.. హఠాత్తుగా తల పక్కకు తిప్పి తుపుక్కున ఉమ్మే వారిని మనం రోడ్ల మీద సవాలక్ష మందిని చూస్తుంటాం. సాధారణంగా పట్టించుకోం.. కానీ, వాడు ఉమ్మినదిశలో వెనుకగా మనం వెళ్తూ ఉండి.. ఆ ఉమ్మి మనమీద పడితే మాత్రం గొడవ పెట్టుకుంటాం. బస్సుల్లో వెళుతూ బయటకు ఉమ్మే సంస్కారహీనులు చాలా మంది ఉంటారు. రైళ్లలో వెళుతూ.. ఆ వేగానికి ఉమ్మి పక్క కిటికీలోంచి ఆ లోపల ఉన్నవారిపై పడుతుందనే జ్ఞానం కూడా లేకుండా ఉమ్మే అధములు కూడా ఉంటారు. మామూలు ఉమ్మి సంగతి సరే.. పాన్, గుట్కా నములుతూ మధ్యలో ఆ ఉమ్మి బయటకు ఉమ్ముతూ.. గోడల మీద ఎర్రటి అసహ్యమైన ముద్రలు వేసే నీచులు కూడా చాలామందే ఉంటారు.
ఏదో ఆపుకోలేక రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసినట్టుగా, అంత హఠాత్తుగా ఉమ్మవలసిన అవసరం ఎవరికైనా ఎందుకొస్తుంది. ఉమ్మడం విషయంలో కొన్ని సంస్కారాలను పాటించాలి. ఉమ్మడం అవసరం అనిపిస్తే రోడ్డు పక్కగా ఆగి.. మరుగ్గా ఉన్న చోట, ఎవరూ నడిచే అవకాశం లేదని అనిపించే చోట, బాత్రూంలలో మాత్రమే ఆ పనిచేయాలి. ఈ సంఘటన చూస్తే అసలు ఉమ్మాలంటే కూడా భయమేస్తుందేమో చూడండి.
కొన్నాళ్ల కిందట ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన జరిగింది. లఖనవూకు చెందిన రామ్ జీవన్ అనే వ్యక్తి ఏసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఏసీ బస్సులో వాసనలే పక్కవారికి దుర్భరంగా ఉంటాయి. అలాంటిది పాన్ వేసుకున్నాడు. మధ్యలో దానిని ఉమ్మవలసిన అవసరం వచ్చింది. లేచి తలుపు దాకా వెళ్లి ఉమ్మడం కోసం ఏసీ బస్సు తలుపు తెరిచాడు. అంతే అలా రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే బస్సును ఆపించి.. ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కూడా పోయాయి. పాన్ మీద పిచ్చి, ఉమ్మకుండా ఉండలేని దుర్బల స్థితి వలన సంభవించిన చావు ఇది.
అందుకే మనం రాంజీవన్ జీవితంనుంచి పాఠం నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడంలో అదుపు పాటించాలి. మన పొలకువ ఇతరులకు కంపరం అనిపించకుండా నడుచుకోవాలి. రావుగోపాల్రావు చెప్పినట్టు మడిసన్నాక కూసంత కలాపోసన మాత్రమే కాదు.. మడిసన్నాక కూసంత సంస్కారమూ ఉండాల. ఏమంటారు?
Discussion about this post