ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎక్కువగా తెలుగుదేశానికి చెందిన వారి మీదనే జరుగుతుండవచ్చు. కానీ, అందుకు ఐటీశాఖను తప్పుపట్టడం ఏమిటో సామాన్యులకు అర్థం కాని సంగతి. ఐటీ దాడులు జరుగుతోంటే.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఎందుకు ఆవేదన చెందుతున్నారో కూడా అర్థం కాని సంగతి.
లోకేష్ సోమవారం మాట్లాడుతూ.. వరుసగా ఐటీ దాడులు జరుగుతోంటే రాష్ట్రానికి పెట్టబడులు ఎలా వస్తాయ్ అంటున్నారు? ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మంత్రి లోకేష్ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో అర్థం కావడం లేదు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్లంతా.. ఐటీ ఎగ్గొడుతూ ఉండే.. పన్ను దొంగలేనని, వారిని ఇలా దాడులతో బెదరగొడితే ఇక తమ రాష్ట్రానికి వచ్చి కొత్త వ్యాపారాలు చేయడాన్ని, కొత్త తరహాలో పన్నులు ఎగ్గొట్టి దోచుకోవడాన్ని వారు మానేస్తారని లోకేష్ ఆవేదన చెందుతున్నట్లుగా ఉంది.
బాధ్యతా యుతమైన ముఖ్యమంత్రి, మంత్రి లాంటి పదవుల్లో ఉన్న చంద్రబాబు, లోకేష్, ఇలాంటి దొంగలను సమర్థిస్తున్నట్లుగా కూడా ఉంది. వారి ఎగవేతలకు మనం మద్దతివ్వకుంటే, వారి దోపిడీకి మనం దన్నుగా నిలవకుంటే.. వారు పాపం, వ్యాపారం ఎలా చేసుకోగలరు? అని లోకేష్ మధనపడిపోతున్నారు.
సగటు ఉద్యోగి తనకు వచ్చే జీతంరాళ్లలోంచి చాలా పద్ధతిగా ఐటీ కట్టేస్తూ ఉంటాడు. ఏడాదికి అయిదారు లక్షలు సంపాదించే వాడు, ఎన్ని మాయలు చేసినా 5-10 శాతం ఐటీ కట్టేస్తుంటాడు. కానీ, ఏడాదికి వందల వందల కోట్లు సంపాదించే ఘరానా పెద్దమనుషులు పదుల కోట్ల పన్నులను ఎగవేస్తూ ఉంటే.. వారి లావాదేవీలను తనిఖీ చేయడం కూడా తప్పే అని.. రోడ్డు మీద టీ కొట్టు వద్ద ఎవరైనా నేలబారు మనుషులు మాట్లాడితే పర్లేదు. ఒక రాష్ట్ర్రానికి ముఖ్యమంత్రి, మంత్రి వంటి పదవుల్లో ఉండేవారు మాట్లాడితే ఎలాగ? అని జనం విస్తుపోతున్నారు.
.