క్రికెట్! అవును క్రికెట్టే! భారతీయుల జీవనాడుల్లో ప్రవహించే ఆట.
వరల్డ్ కప్ 2023 జనం ఇహం పరం మరిచి పోయి టీవీ సెట్ల ముందు అతుక్కుపోయి, కళ్ళు తిప్పకుండా కాలు కదపకుండా (కదిపితే ఎక్కడ వికెట్టు పడిపోతుందోనని) చూస్తున్నారు.
ఎక్కడో లడాఖ్‌లో, మల్లెపూల వానలా మంచు జలజల రాలుతున్నా ఎముకలు కొరికేసే మైనస్ డిగ్రీ చలిలో కూడా జనం తివారీ టీ బడ్డీలో ఉన్న టీవిలో వచ్చే మ్యాచ్ చూస్తున్నారు, ‘ఛక్కా! రే! భయి!’ గంతులేస్తున్నారు.
వేడెక్కిన థార్ ఎడారిలో, ఇసక గాలిలో స్వైర విహారం చేస్తున్న జైసల్మార్ లో కూడా జనం విరగబడి క్రికెట్ చూస్తున్నారు.
చిన్నప్పుడనుకుంటా…. డెభ్భైవ దశకం.
పెనుగొండ చెరుకువాడలో రామాలయం అరుగుమీద లాలుగారు (మా నాన్న) , తాడిమేటి విద్యాశంకర్, అవతారం గారి రామం, డా|| నారాయణ మూర్తి, చేబోలు సుబ్బారావు ఫిలిప్స్ ట్రాన్సిష్టర్ చెవుల దగ్గర పెట్టుకుని ఏదో వింటున్నారు. ఆ రేడియోలో గోలగోలగా ఏదో ఇంగ్లీషులో వినబడుతోంది.
వీధి దీపాల కాంతి అందరి మీద పడుతోంది.
” నాన్న గారండి! బామ్మగారు రమ్మంటున్నారండి” అని నేను పిలవగానే..
” ఉండరా గవాస్కర్ సెంచరీకి దగ్గర గా ఉన్నాడు” అన్నారు.
నా చిన్నబుర్రకి అర్ధం కాలేదు.
కాసేపు ఆ రన్నింగ్ కామెంట్రీ కోసం వాళ్ళు రేడియోని నానా తిప్పలు పెట్టి ట్యూనర్ ని అటూ ఇటూ తిప్పారు.
“లాలుగారు! ఇలా ఇవ్వండి అది నా చేతిలోనే ట్యూనవుతుందంటూ” విద్యాశంకర్
దానిని పట్టుకోగానే వెంటనే “ఎస్ ! అవర్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ వెల్ ” అని ఎక్సపర్ట్ కామెంటేటర్ అనగానే “హమ్మయ్య! ఎక్కడ వికెట్ పడిపోయిందో అని కంగారొచ్చింది”.. సుబ్బారావు చెప్తుంటే..
“నో సుబ్బారావ్! మనవాళ్ళు స్టాండ్ అయిపోయారు”.. అంటూ ధైర్యం చెప్పుతున్నారు నాన్నగారు.
నాకు ఏదీ అర్థం కాలేదు. వాళ్ళ మాటల్లో సోల్కర్, గవాస్కర్, ఫరూక్ ఇంజనీర్, చంద్రశేఖర్, బేడీ , లాయడ్, ఫ్రెడరిక్స్, వాడేకర్, ఇలా చాలా చాలా!.
“మనవాళ్ళు సరిగా ఆడడం లేదు”, అని విద్యాశంకర్ అనగానే,
“మనవాళ్ళు ఎక్లమటైజ్ (Acclamatize) అవ్వాలోయ్ గవాస్కర్!” (విద్యాశంకర్ని పిలిచేవారు) అని ధైర్యం చెప్తున్నారు నాన్న.
ఒక రోజు! కార్తీక మాసం, ఆదివారం సాయంకాలం నాలుగు గంటలు.
నేను వీధి గుమ్మంలో కూర్చుని ఆ రోజే కొత్తగా వచ్చిన చందమామ చదువుకుంటున్నాను. ఎదురుగుండా అరుగు మీద బర్రెయ్య గారి సత్తిరాజు రామం చాప వేసుకుని ఇంగ్లీషు నవల చదువుకుంటున్నాడు. ఈ లోగా చేబోలు ప్రసాద్ గాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. “ఒరేయ్ మా అన్నయ్య సుబ్బారావు, మీ నాన్నగారు, విద్యాశంకర్, రామం క్రికెట్ అని కొత్త ఆట ఆడడానికి వెనక వీధిలో మూడు కర్రలు పాతారు రా!” అనగానే పరుగెత్తుకుంటూ అక్కడకు వెళ్ళాం.
ఒకళ్ళు బాలు వేస్తున్నారు మరొకళ్ళు బ్యాట్ తో కొడుతున్నారు. బాల్ పక్కకి పోగానే, మూడు కర్రలు, మరో పక్కన ఉన్న మరో మూడు కర్రల మధ్య పరిగెడుతున్నారు. రన్స్ అంటున్నారు, బౌల్డ్ అంటున్నారు, కవర్స్, మిడాన్, మిడ్ వికెట్, నో బాలు , సిక్సర్, ఫోరు, ఇలా చాలా ఇంటరెస్టింగ్ పదాలు వాడుతున్నారు. పదకొండుమంది ఆడతారుట. కేప్టన్ ఉంటాట్ట. ఇలా !అవన్నీ వినగానే,
“ఈ ఆట బావుందిరా ప్రసాదు! అనగానే, మమ్మల్ని ఫీల్డింగ్ లో నిలబెట్టారు, కాని చేతికి బాట్, బాల్ ఇవ్వలేదు.
ఇలాక్కాదని మేమిద్దరం, ఒక బాట్ మా ఫ్రెండ్ వెంకట రత్నం గాడితో చేయించి దానికి బాగా చిత్రి పట్టించి తయారు చేయించాము. వాడు మా చిన్నప్పడి బళ్ళో బెంచిమేటు అవ్వడం వల్ల డబ్బులు తీసుకోలేదు. ఇహ మొదలెట్టాం.
ఈ గొప్ప ఆట మాకు ఆకళింపు అవడం, మేం గొప్పగా స్కూల్ లో పిల్లగాళ్ళకి మరీ గొప్పగా వర్ణించి మా నాన్న మాట్లాడిన పేర్లు, స్పిన్ లెగ్ స్పిన్, చైనామెన్, యార్కర్, ఫాస్ట్ బౌలింగ్ , వర్ణించి మాకు తెలిసినవి తెలియనవి కలిపి గప్పాలు కొట్టేవాళ్ళం.
ఆ రోజుల్లో గ్రిక్ స్పోర్ట్సులొ ‘కోకో’ బాల్ బాడ్మింటన్ లాంటివే తప్ప క్రికెట్ ఏది? దానికి మరీ నిరాశ పడిపోయాం. అరెరె ఈ ఆట ఉంటేనా ఎంచక్కా ZNVR హై స్కూల్‌కి బోల్డు పేరు తీసుకొచ్చేవాళ్ళమే! అనుకుని.
మా నాన్న హిందూ పేపర్ తెప్పించేవారు. దాంట్లో గవాస్కర్ ‘టన్’సెంచరీ అని పడింది. కూడబలుక్కొని పేపర్‌లో ఆర్. మోహన్ వ్రాసిన రివ్యూ చదివి అర్థాలు తెలుసుకునే వాడిని. హిందూ రాగానే స్ఫోర్ట్స్ కాలమ్ ఆఖరినుంచి రెండవ పేజి తెరవడం, క్రికెట్ గురించి చదవడం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం నాకు ఇష్టమైన అలవాటు.
1975 సంవత్సరం ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో ప్రారంభమవడం గురించి బోల్డు రాతలు. కాళీచరణ్ స్టేట్‌మెంట్స్! క్లైవ్ లాయిడ్ ఆటమీద వెస్టిండీస్ ఆశలు అంటూ. మళ్లీ క్రికెట్ పండగ మొదలైంది. మా వాళ్ళందరూ రేడియో పుచ్చుకొని మా ఇంటి అరుగుమీద అర్థరాత్రి క్రికెట్ కామెంటరీ వినడం మొదలెట్టారు.
మన దేశం కూడా పాల్గొంది. 60 ఓవర్ల మాచ్‌లో గవాస్కర్ అతి జాగ్రత్తగా, అతి నెమ్మదిగా ఆడి 60 ఓవర్లలో ఇంగ్లండ్ మీద 36 పరుగులు చేసాడు. మనం ఓడిపోయాం. మనసు ఉసూరుమనిపించిది.
“మనం చాలా ఎదగాలోయ్ మనకి ఈ వన్ డే మ్యాచ్ లు కొత్త. అని మా నాన్నగారు అనడం నాకు ఇంకా గుర్తు.
అలాగే 1979 లో కూడా మనం క్రికెట్ రారాజు లాంటి టీం వెస్టిండీస్ మీద ఆడి ఓడాము. ఒక్క విశ్వనాధ్ తప్ప ఎవ్వరు ఆడలేదు.అలా ముగిసింది డభ్బైవ దశకం బాధగా! ఇంతలో క్యారీ ప్యాకర్ అనే ఆస్ట్రేలియన్ మీడియా టైకూన్ వరల్డ్ క్రికెట్ సీరీస్ ప్రెవేట్ గా మొదలు పెట్టాడు.
హెల్మెట్ ప్రొటక్షన్, రంగు దుస్తులు, అధిక పారితోషకం, రంగు బంతుల స్థానంలో తెల్లబంతి, రాత్రిళ్ళు కూడా ఫ్లడ్ లైట్స్ లో ఆడడం లాంటివి ప్రవేశ పెట్టాడు.
కానీ ఐ.సి.సి ఇంకా ఆ స్థాయికి ఎదగ లేదు. కాని ప్యాకర్ ప్రవేశ పెట్టిన ఈ కలర్ ఫుల్ క్రికెట్ ఇప్పుడు మనం చూస్తున్న IPL, లాంటి క్రికెట్ కి బీజం.
ఇక ఎనభైవ దశకం వచ్చింది. కాని ఒక అద్భుతమైన టాలెంటు ఉన్న ఆటగాడు కపిల్ దేవ్ మనకి దొరికాడు.
మాకు అమలాపురం ట్రాన్సఫర్ అయ్యింది. స్నేహితుల్ని, ఆత్మబంధువుల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. మళ్ళీ క్రికెట్ ఫీవర్ మొదలైంది.
1983, మనవాళ్ళు ఈ సారి ఎల్లాగైనా వరల్డ్ కప్ గెలుచుకు రావాలని మాంఛి పట్టుదలగా ఉన్నారు. మేం మా తమ్ముళ్ళు శ్రీను గోపి వీధిలో కుర్రాళ్ళు క్రికెట్టు తెగ ఆడేవాళ్ళం. చిన్నచిన్న టోర్నమెంట్లు కూడా! మా ముగ్గురిలో గోపి బాటింగ్ చాలా బాగా చేసేవాడు. వాడు కాస్త పెద్ద టోర్నమెంట్లు ఆడేవాడు. నాకు రంకిరెడ్డి కాశీ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్, అర్జున్ అవార్డు విన్నర్ సాత్విక్ సాయిరాజ్ నాన్న) పరిచయమయ్యాడు. వాడు మంచి స్పోర్ట్స్ మ్యాన్. మా ఇంటికి వస్తే క్రికెట్ కబుర్లు. మేం హిందూ పేపర్‌తో పాటు స్పోర్ట్స్ స్టార్ మ్యాగ్జైన్ తెప్పించేవాళ్ళం. అందులో మాంచి కలర్ ఫుల్ ఫోటోలు పడేవి. అవి చూసుకుని తెగ సంబరపడేవాళ్ళం.
నాన్నగారు హిందూకి ‘లెటర్స్ టూ ది ఎడిటర్’ స్పోర్ట్స్ కాలమ్ కు ఉత్తరాలు రాసేవారు.
కపిల్ దేవ్ క్యాప్టన్సీలో మన దేశం వరల్ఢ్ కప్ కి ఆడడానికి మంచి జట్టుతో బయలుదేరారు. మొహిందర్ అమర్ నాథ్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, సందీప్ పాటిల్, మదన్ లాల్ , రోజర్ బిన్ని, వెంగ్ సర్కర్, గవాస్కర్, సయ్యద్ కిర్మాణి, సంధు, కీర్తీ ఆజాద్, రవిశాస్త్రి, యశ్ పాల్ శర్మ లతో సంసిద్ధమైంది.
నాకు మొదటినుంచి సందేహమే. మన వాళ్ళు గెలుస్తారా అని! కానీ మా నాన్నకి చాలా కాన్ఫిడెన్స్ మన టీం మీద.
‘‘ఈ సారి వరల్డ్ కప్ మనదేరా!’’ అంటే నేను “భలేవారే, అక్కడ అరవీర భయంకరులు క్లైవ్ లాయిడ్, రిచర్డ్స్,గ్రీనిడ్జ్ బాటింగ్ లో, హోల్డింగ్, మార్షల్, డెనియల్, డేవిస్ ఉన్నారు తెలుసా?” అని భయంగా మాట్లాడితే, ఆ తేమ వాతావరణంలో బాల్ ని ‘మూవ్’ చేసే రోజర్ బిన్ని, బాల్ స్వింగ్ చేసే కపిల్, చితక్కొట్టుడు శ్రీకాంత్, స్లో మీడియం తో మొహీందర్ ఉన్నారు.
‘‘ఈ సారి గొప్ప టీం రా మనది’’ అన్నారు. “నా ప్రిడిక్షన్ మనమే విజేతలం” ..అన్నారు నాన్న!
ఆలిండియా రేడియో ప్రసారాలు మనకి గొప్ప తియ్యని జ్ఞాపకాలు. ఆ రోజుల్లో టీ.విలు ఏవీ? రేడియోలో వినడమే గొప్ప ఆనందం. కాలేజీ నుంచి వచ్చి మా టెలిసోనిక్ రేడియో ముందు కూర్చున్నాను. నాన్నగారు ఇంకారాలేదు ఆఫీసు నుంచి.
జింబాబ్వే బౌలింగ్ లో ఐదు వికెట్లు డౌన్. నాకు చెమటలు పట్టేసాయి. ఇలా ఆడితే ఎలా అనుకుంటున్నాను. కపిల్ దేవ్ దిగాడు. 175 రన్స్ కొట్టి గెలిపించాడు. ఆనందం పంచుకోడానికి నాన్న కోసం ఎదురుచూపు. పంచుకోడానికి సెల్ ఫోన్లు ఏవీ? ముఖాముఖి మధురానుభూతులు, ఆనందాల్ని పంచుకోవడమే కదా మా అదృష్టం.
“చెప్పానుకదరా? అన్ని ఇంగ్లీషు పత్రికలు paper tigers అన్నారుగా? ఈ సారి కాదని తెలుస్తుంది అందరికీ’’ అన్నారు నా న్యూస్ వినగానే.
మన టీం సెమీ ఫైనల్ చేరేలోపు ఒకసారి విండీస్ మీద గెలిచారు, ఓడేరు లీగ్ మాచ్ ల్లో. అందరికి సందేహమే. కనీసం సెమీస్ కి చేరతారా అని? మానాన్నారికి తప్ప! ఆయన ఫేవరెట్ బౌలర్ రోజర్ బిన్ని మీద చాలా కాన్ఫిడెన్స్, టీం మీద కూడా.
![](https://i2.wp.com/adarsini.com/wp-content/uploads/2023/10/c-subramanyam.jpg?resize=700%2C350&ssl=1)
“టరన్ ది టేబుల్స్ “ ఇది మా డాడీ లెటర్స్ టు ది ఎడిటర్‌కి పంపిన లెటర్ హెడ్డింగ్.
ఇంగ్లాడ్ మీద భారత్ సెమీస్ లో నెగ్గి మేం ‘డార్క్ హార్సెస్’ మని నిరూపించారు. ఇంగ్లాడ్ పత్రికల నోళ్ళు మూయించారు.
నాన్నగారి లెటర్ పేపర్లో పడింది. నేను అందరికి చూపించి ఆనందం పంచుకున్నాను.
వరల్డ్ కప్ ఫైనల్స్.
లార్ఢ్ మైదానం కిక్కిరిసి పోయిఉంది.
విండీస్ ఆటగాళ్ళ నల్లని కటువైన గర్వమైన మొహాలతో అత్యంత విశ్వాసంతో బరిలోకి దిగారు. ఇదంతా ఇంగ్లండ్ ఎక్సపర్ట్ కామెంటరీ చెబుతున్న వాళ్ళ ఉవాచ. అందరికి హాట్ ఫేవరెట్ విండీస్ మరి.
మన బాటింగ్ అయిపోయింది. మొహీందర్, శ్రీకాంత్ తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 183 మాత్రమే, 60 ఓవర్లలో చేసారు! నాకు ఆశపోయింది. నాకేమిటి అఖండ భారతావని అలాగే ఉన్నారు. గేట్ చప్పుడు వినిపించింది.
నాన్నగారు ఇంట్లోకి అడుగుపెడుతూ “ఎంతరా స్కోర్?’’ అడిగారు. “ఎంతా 183’’ అన్నాను డల్‌గా! ఆయన నవ్వి “నెగ్గుతారురా’’ అన్నారు, నేను ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా చూసేను.
మన బౌలింగ్ మొదలైంది.
లార్డ్స్ మైదానం నుండి తరంగ తరంగాలుగా కామెంటరీ ఆకాశవాణి ద్వారా మా వీనుల్లోకి.
ఒక్క ఇన్ స్వింగర్ ద్వారా సంధూ ప్రసిధ్ధిపొందిన బాట్స్‌మెన్ గ్రీనిడ్జ్‌ని క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కి పంపించాడు. తర్వాత వచ్చిన అరవీర భయంకరుడు వివిన్ రిచర్డ్స్ మూడు బౌండరీలు బాదేసరికి అందరం డల్ అయిపోయాం.
కానీ మా నాన్న అంచనా నిజమైంది.
“మంచి బ్రేక్ త్రూ రావాలిరా” “వస్తుంది చూస్తూ ఉండు” అన్నారు.
అది ఇలా జరిగింది. రిచర్డ్స్ కొట్టిన బంతిని కపిల్ దేవ్ వంద అడుగులు పరిగెత్తి పట్టుకొని తను మంచి ఆలౌండర్ నని విజేతలం మేమేమని, మమ్మల్ని ఎవరూ ఆపలేరని నిరూపించాడు. మా ఆనందం అవధులు దాటింది.
ఆ ఒక్క “బ్రేక్ త్రూ” విండీస్ పాలిట శాపమైంది.
విండీస్ ని కోలుకోనీకుండా మొహీందర్ అమర్ నాధ్, రోజర్ బిన్ని చావు దెబ్బతీసారు.
మనం ప్రపంచ విజేతలం- మొట్టమొదటి సారిగా!
లార్డ్స్ వి.ఐ.పి బాక్స్ లో సందడి మొదలైంది అని చెప్పి కామెంటేటర్ ముగించాడు.
నాన్న ఫేవరెట్ బౌలర్ రోజర్ బిన్ని ఈ టోర్నమెంట్లో ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు.
నాన్నగారు పంపిన “Invincible Victory” by C.Subrahmanyam పేపర్ లో స్పోర్ట్స్ కాలం లో చోటుచేసుకుంది.
కానీ ఒక్కటే బాధ.
ఆ నాడు నాన్న వ్రాసిన ప్రతులు నేను దాచుకోలేక పోయానని ఇప్పటికీ విచారిస్తాను. నాన్న జ్ఞాపకాలు మాత్రం పదిలంగా దాచుకున్నాను.
తర్వాత మనం విజయం మాటే మరిచాం. కొత్త శతాబ్ది 2000 మొదలైంది.
2011 ఫిబ్రవరి.
నేను హస్పిటల్ బెడ్ మీద- ఇంటెన్సివ్ కేర్ లో హర్ట్ ఎటాక్ వచ్చి.
నా చిన్న కొడుకు కాశ్యప్ ఈనాడు పేపర్ లో పడ్డ ‘క్రికెట్ సమరం మొదలైంది’ అన్న వార్త నాకు అద్దంలోంచి చూపిస్తున్నాడు.
ఆ సంవత్సరం కూడా మన కూల్ కాప్టెన్ ధోని మనకి కప్ తెచ్చిపెట్టాడు. అది సచిన్ కి గిఫ్ట్ గా.
ఇలా జ్ఞాపకాలతో మధురానుభూతులతో క్రికెట్ పండగ ప్రతి నాలుగేళ్ళకి చేసుకుంటున్నాము.
కానీ ఆరోజు మేం రేడియోల్లో విన్న కామెంటరీ ఇచ్చిన ఆనందం ఒకమెట్టు ఎక్కువ.
ఈ 2023 టీం ఏం చేస్తుందో ఎదురుచూడాలి.
మనం విజయమనే మధురాన్ని చవిచూడాలని ఆశిస్తూ!
ఈ రాత నాన్న కి అంకితం.
క్రికెట్ ప్రేమికులకు అందరికీ అభినందనలతో
..చాగంటి ప్రసాద్
కథా రచయిత, 90002 06163
Discussion about this post