జనసేనకు ఏం తక్కువ? ఎందుకు ఇంత తక్కువ స్థానాలకు ఒప్పుకొంది అని తెలుగుదేశంతో పొత్తులో భాగంగా 24 స్థానాలు తీసుకున్న రోజున పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు బాధపడి ఎవరి విశ్లేషణలు వారు చేశారు. వారి ఆవేదనకు ఆజ్యంపోసే మీడియా మేధావులు, రాజకీయ విశ్లేషకులు, తటస్థ ముసుగు వేసుకున్న తాడేపల్లి గూటి పక్షులు తమ అజెండాను చొప్పించడం మొదలుపెట్టాయి.
వాటన్నింటికీ తాడేపల్లిగూడెం వేదికగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విస్పష్టమైన వివరణతో కూడిన సమాధానం సూటిగా చెప్పారు. ఆ నోళ్లకు తాళాలుపడ్డాయి. బీజేపీతో పొత్తు కుదరటంతో ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు 21 అయ్యేసరికి మళ్ళీ తాళాలు తెరిచి మాటల ఈటెలు విసురుతూ… 40 రోజుల తరవాత వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఎలక్షనీరింగ్ లెక్కలు ఇప్పుడే సందేశిస్తున్నారు.
జనసేన అభిమానులు, నాయకులు తమకు దక్కుతాయనుకున్న స్థానాలు తగ్గేసరికి ఆందోళన చెందటం సహజం. జనసేన, టీడీపీ ఎన్.డి.ఎ.లో చేరిక వెనక వ్యూహాత్మకమైన అడుగులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. అదే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ రెండేళ్ల నుంచి చెబుతున్న మాట – ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’. ఈ స్టేట్మెంట్ నిజం కావాలంటే ఒక బలమైన కూటమి కావాలి… యుద్ధం చేయాలి. ఇందుకు అవసరమైన అక్షౌహిణులను సన్నద్ధం చేసే బాధ్యతను తీసుకున్నది జనసేనాని అనేది ఈ కూటమిలో ఏ నాయకుడిని అడిగినా చెబుతారు. మాట అన్నది ఆయనే… మందీమార్బలాన్ని సిద్ధం చేసిందీ ఆయనే. యుద్ధంలో విజయం కోసం త్యాగం చేసిందీ ఆయనే.
పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ఒక ఆశాజ్యోతి
ముద్రగడకు కాపువర్గంలో విశ్వసనీయత మిగులుతుందా?
‘ఇతరుల ప్రయోజనాల కోసం త్యాగం చేయగల వ్యక్తి… సాధారణ మనిషి కంటే పైకి ఎదిగే గొప్ప మనిషి అవుతాడు. అటువంటి మహానుభావులే సమాజ, దేశ, ప్రపంచ శ్రేయస్సు కాంక్షించేవారవుతారు’ అని విజ్ఞులు చెప్పే మాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమర సందేశాన్ని రెండేళ్ల క్రితమే వెల్లడించింది పవన్ కళ్యాణ్. అందుకోసం రణ తంత్రాన్ని రచించింది శ్రీ పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్రంలో సాగే ఎన్నిక సమరాంగణంలో రాక్షసుడిపై యుద్ధానికి సకల శక్తులను మోహరింప చేస్తున్నది ఆయనే.
ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న వేళ కనిపిస్తున్నవి స్థానాల సంఖ్యలు. ఈ సంఖ్యలు వెల్లడి కావడానికి ఎన్నో గంటలూ… రోజుల చర్చోపచర్చలు సాగాయనే విషయాన్ని విస్మరించలేము. ఆ తరవాతనే 21 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్ సభ స్థానాలకు జనసేన పోటీ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ చర్చలు గంటో అర గంటో చేసినవి కావని ప్రత్యర్థి గూటి విశ్లేషకులు గుర్తించాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యారు. ఆ కీలక భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత స్థితి గురించీ, భవిష్యత్ ముఖ చిత్రం గురించీ సమగ్రంగా చర్చించారు. అనంతరం విజయవాడలో రెండు రోజులపాటు బీజేపీ ప్రతినిధులతో భేటీలు సాగాయి.
మనకేం తక్కువ… ఎలక్షనీరింగ్ చేస్తామని… ఎన్నికల రాజకీయానికి కావలసిన సాధనసంపత్తి అంతా సిద్ధపరచుకున్నామని బల్లగుద్ది చెప్పి… మనం స్థానాలు ఎందుకు వదులుకోవాలి అని నాయకులు వాదిస్తారు. నిజమే… అసలు ఎన్నికలు సజావుగా చేసుకొనే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? ప్రచారం, సభలు నిర్వహించి మన మాట చెప్పుకొనే స్వేచ్ఛ ఉందా? సిద్ధపరచుకున్న సాధనాసంపత్తిని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లగలమా? ఇవన్నీ చేయాలి అంటే మనకు మరింత బలం తోడు కావాలి. ఒంటరిగా కత్తి దూయడం కంటే- నాలుగు చేతులు ఒకటై రక్కసిని తుదముట్టించాలి. ఆ బలాన్ని మన శ్రేణులకు ఎలా అందించాలన్న వ్యూహాన్నే శ్రీ పవన్ కళ్యాణ్ రచించారు. ఆ వ్యూహం ప్రకారమే ఒక మూడు అడుగులు వెనక్కి వేశారు. లంఘించి కొట్టాలంటే మొదట వెనకడుగులు వేయాల్సిందే. ఆ తరవాత లంఘిస్తుంటే పుట్టే శక్తిని ఎన్ని మెగావాట్లని లెక్కిస్తారు?
ఫుట్ బాల్ ఆటలో గోల్ పోస్ట్ ఎక్కడ ఉందో ఆటగాడికి తెలుసు. అక్కడికి కొట్టేందుకు మన దగ్గర ఉన్న బంతిని తోటి ఆటగాడికి పాస్ చేయాల్సిందే. ఇక్కడ గోల్ కొట్టడం ముఖ్యం. ఎన్నికల సమారంగణంలో పవన్ కళ్యాణ్ కూడా ఫుట్ బాల్ సూత్రాన్నే అనుసరిస్తున్నారు.
ఒక వాస్తవాన్ని అందరం గ్రహించాలి. ఈ పోటీ ప్రపంచంలో త్యాగం చేయని వ్యక్తి ఘన విజయాన్ని అందుకోలేడు. లక్ష్యం ఉన్నతమైనది కాబట్టే కొన్ని స్థానాలు వదులుకొని సమరానికి సై అంటున్నారు. ఇప్పుడు సకల శక్తులను శ్రీ పవన్ కళ్యాణ్ తన స్థానాల్లో కేంద్రీకృతం చేస్తూ హస్తిన బలాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా అసుర సంహారం చేయబోతున్నారు.
ఆయన కుటుంబ పెద్ద స్థానంలో ఉండి అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకొంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబం అనుకొన్నారు కాబట్టే – రెండేళ్ల నుంచి ఒకే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణానికి మారుతున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా కొత్త దిశ ఎంచుకున్నారు… ఇక్కడ పాత రోడ్లు లేవు… ఆయనే బాటలు వేసుకొంటూ అందరినీ కూడగట్టుకొని సాగుతున్నారు. ఈ బాటలు వేయడానికి పవన్ కళ్యాణ్ పడ్డ శ్రమ.. తపన కనిపించవు. కనిపించేదల్లా వేసిన బాట మాత్రమే. ఈ ప్రయాణంలో ఆయనకు వేగ నిరోధకాలు లేవు. దూసుకు వెళ్ళడం మాత్రమే ఉంటుంది. అద్భుతం జరిగేటప్పుడు బయట నుంచి చూసేవారికి- ఉండేవి అపోహలు… సందేహాలూ మాత్రమే. ఆ యజ్ఞంలో భాగమయ్యేవారికి మాత్రం తెలిసేది ఒక్కటే… అది తన నాయకుడిపై అచంచల విశ్వాసం. ఆ విశ్వాసమే శ్వాసగా ముందుకు సాగుతారు. మనం కూడా మన నాయకుడిపై విశ్వాసం ఉంచుదాము. మన నాయకుడు వేసిన బాటలో దూసుకువెళ్దాం.
– సత్యగ్రీవ
(సగటు మధ్యతరగతి మనిషి)
Discussion about this post