ఢిల్లీలో ఒక దొంగబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ‘కాషాయం తొడుక్కున్న ఈ బాబా అత్యంత నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు’ అని మనం తిట్టాం అనుకోండి. చాలా మంది మనమీద దండెత్తుతారు. హిందూత్వం మీద దాడిచేస్తున్నారని తిడతారు. ‘అదేమాదిరిగా ముస్లిముల్లో మోసగాళ్లని, క్రిస్టియానిటీలోని దొంగలను తిట్టగలరా’ అని మనల్ని నిందిస్తారు. తర్కం గ్రహించలేని అమాయకత్వంతో లేదా అజ్ఞానంతో వారు కాషాయంలోని నీచులను తిట్టడాన్ని, మతం మీద దాడిగా భావిస్తారు.
అయినా.. ఇలాంటి దుర్మార్గులకు మతపరమైన వ్యత్యాసాలుండవు. దుష్టులు అన్ని మతాల్లోనూ ఉంటారు. అయితే తీవ్రతను బట్టి.. ఒక సంఘటన బయటపడినప్పుడు మనం స్పందించగలం. నిజానికి అది వారి మతం మీద చేస్తున్న దాడి కాదు.. మతానికి చేస్తున్న మేలు. ఎందుకంటే కాషాయం ముసుగులో కొందరు నీచులు పెచ్చరిల్లితే కాషాయం విలువ కదా పడిపోతుంది. సచ్ఛీలురైన కాషాయాంబర ధారుల విలువ పడిపోతుంది కద. కాబట్టి.. కాషాయంలోనే గడిపే అలాంటి మంచివాళ్లంతా.. ఇలాంటి నీచుల గురించి మాట్లాడాలి. సమాజాన్ని జాగృతం చేయాలి. అంతే తప్ప తమ పనిచేస్తున్నవారి మీద విరుచుకుపడకూడదు.
ఢిల్లీలో ఒక కళాశాలకు మేనేజింగ్ కమిటీలో కీలక హోదాలో కూడా ఉన్నటువంటి ఈ బాబా, స్వామి చైతన్యానంద సరస్వతి, గదిలో సెక్స్ చిత్రాలు, బొమ్మలు, బూతు సినిమాల సీడీలు పోలీసులకు దొరికాయి. కాలేజీ అమ్మాయిలతో కూడా అసభ్యమైన వాట్సాప్ చాట్ సాగించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇదంతా చైతన్యానంద సరస్వతి అనే అందమైన పేరు పెట్టుకున్న ఈ దుర్మార్గుడి నిర్వాకమే. ఇలాంటి వ్యవహారాలను తీవ్రంగా నిందిస్తూ ఎవరైనా పోస్టులు పెడితే.. కొంతమంది హిందూమతాన్ని కించపరచడానికి వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రచారంగా పరిగణిస్తుంటారు.
నిజానికి ఇలాంటి దొంగబాబాల బాగోతాలు బయటకు వచ్చినప్పుడు.. నిందిస్తున్న వారిని, తీవ్రంగా తప్పుపడుతున్న వారిని హిందూత్వ అభిమానులే నెత్తిన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి దొంగబాబాలు అవతరించడం వల్ల మోసపోయేది, అన్యాయానికి గురయ్యేది అంతా హిందువులే కదా. అలాంటిది.. అతిపెద్ద హిందూ సమాజాన్ని దొంగల నుంచి, దుష్టులనుంచి రక్షించేలా చైతన్యపరుస్తున్నందుకు, వారికి కృతజ్ఞులై ఉండాలి. అంతకంటె ముఖ్యమైన విషయం ఏంటంటే.. హిందూత్వ భావనను ప్రేమించేవాళ్లే, ఆరాధించేవాళ్లే ఇలాంటి దొంగల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గురించి ప్రచారం చేయాలి. ఇలాంటి దొంగలందరూ కాషాయం ధరిస్తుండడం వలన, కాషాయం విలువ పడిపోతుంది. కాబట్టి కాషాయం ధరించే వారిలో నిజాయితీ పరులు.. ఇలాంటి దొంగల ఆటకట్టించడం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నిజానికి కాషాయం ధరించే మంచివాళ్లు సిగ్గుపడాల్సిన సంగతి ఇది.
ఇవాళ్టి రోజుల్లో చాలా వృత్తులయొక్క విలువ పడిపోయింది. ఆ మాటకొస్తే చేతివృత్తుల వారికి ఉన్న విలువ మరెవ్వరికీ లేదనే చెప్పాలి. వారేదో కష్టంతో పనిచేసుకుంటారు. పొట్టనింపుకుంటారు. అంతే. కొత్తగా పరిచయం అయినప్పుడు ఎవడైనా ‘నేను రాజకీయ నాయకుడిని’ అనిచెబితే.. విన్నవాళ్లలో కొందరైనా ‘అంటే పెద్ద దళారీ.. దోపిడీదొంగ’ అనుకుంటారు. అలా డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, జర్నలిస్టులు.. ఒక్కొక్కరికీ ఒక్కోరకం నెగటివ్ ముద్ర సమాజం మెదళ్లలో ముద్రించుకుపోయింది. అలాంటి నేపథ్యంలో ఆయా రంగాల కొత్త దందాలు, కొత్త దోపిడీలు వెలుగుచూసినప్పుడు.. ఆయారంగాల్లోని వారే కదా.. తమ పరువు కాపాడుకోవడానికి వాటిని ముందుగా ఖండించాల్సింది.
కాషాయాంబరధారులు కూడా ఆ పనేచేయాలి. ఇలాంటి దొంగబాబాలు వెలుగులోకి వచ్చినప్పుడు.. ముందుగా వారే స్పందించాలి. అలాంప్పుడే ప్రజల్లో సరైన చైతన్యం వస్తుంది. మామూలు వ్యక్తులు వారిని నిందిస్తే.. వారికి ఇతర ప్రయోజనాలను అంటగట్టడానికి, వారి విమర్శల తీవ్రతను పలుచన చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతాయి. అలాకాకుండా.. కాషాయప్రముఖులే ఆ బాధ్యత తీసుకుని పూనుకుంటూ హిందూత్వానికి న్యాయం జరుగుతుంది.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

.

Discussion about this post