సంపాదకుడు : కె.ఎ. మునిసురేష్ పిళ్లె
తండ్రి ఆదర్శిని ఎల్లయ్య 1970లో స్థాపించిన ‘ఆదర్శిని’ పత్రిక కోసం పనిచేస్తూ.. పసితనం నుంచి జర్నలిజం ఓనమాలు దిద్దుకున్నారు. 1991లో ‘ఉదయం’ దినపత్రికలో పార్ట్ టైం సబ్ ఎడిటర్ గా ప్రధాన స్రవంతి మీడియాలో ప్రస్థానం ప్రారంభించి, 1993 నుంచి 2006 వరకు ‘ఈనాడు’లో పనిచేశారు. ఈనాడు చిత్తూరు జిల్లా డెస్కు, ఆదివారం అనుబంధం, ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ బాధ్యతలు చూస్తూ వివిధ హోదాలు నిర్వహించారు. ఆ తర్వాతి కాలంలో ‘ఆదర్శిని మీడియా’ సంస్థను స్థాపించి, ఆదర్శిని పత్రిక, వెబ్ సైట్ తో పాటు, వివిధ పత్రికలకు, టీవీ ఛానెళ్లకు కూడా సేవలందించారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ డిగ్రీ చేసిన తర్వాత, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం (ఎంసీజే)తో పాటు బిఎల్ కూడా చదివారు. న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో సభ్యులు.
తెలుగులో ప్రింట్, టీవీ (ఎలక్ట్రానిక్), వెబ్ మీడియాలలో సమానమైన ప్రావీణ్యం ఉన్న జర్నలిస్టుగా గుర్తింపు ఉంది. జర్నలిజం అనుభవంతో పాటు, ఈ మూడు మీడియా రంగాలలోని సాంకేతిక విభాగాలలో కూడా పట్టు సంపాదించారు. ప్రింట్ మీడియాలో లెటర్ ప్రెస్, ట్రెడిల్ మెషిన్ ప్రింటింగ్ దశ నుంచి, ఇవాళ్టి ఆధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ప్రింటింగ్, టెక్నికల్ విభాగాలలో కూడా సమానమైన పట్టు ఉన్న అరుదైన జర్నలిస్టు.. మునిసురేష్ పిళ్లె.
జర్నలిజంలో సుదీర్ఘ అనుభవంతో పాటు రచయితగా కూడా విస్తృత అనుభవం ఉంది. ఇప్పటివరకు మూడు కథా సంపుటాలు, రెండు నవలలు, ఒక కవిత్వ సంపుటి, ఒక సంపాదకీయ కథనాల సంపుటి వెలువరించారు. పలుపుస్తకాలకు సంపాదకత్వం కూడా నిర్వహించారు.
ఆదర్శిని (adarsini.com) సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదర్శిని మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు.
wikipedia page : https://te.wikipedia.org/wiki/కె.ఎ._మునిసురేష్_పిళ్లె
రామోజీరావు సంపాదకత్వంలో వెలువడుతూ ఉండిన ‘విపుల’ మాసపత్రిక మూతపడిన తరువాత.. తెలుగులో అనువాద సాహిత్యం కోసం ప్రత్యేకించిన వేదిక ఏదీ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కేవలం అనువాద సాహిత్యం కోసం ‘కథావసుధ’ అనే మాసపత్రికను వెబ్ మాధ్యమంలో స్థాపించారు. ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదం అయిన కథలు, కవితలు, సాహిత్యవ్యాసాలతో కథావసుధ ప్రతినెలా పబ్లిష్ అవుతూ.. భారతీయ, ప్రపంచ భాషల్లోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు, సాహితీప్రియులకు అందిస్తోంది. మునిసురేష్ పిళ్లె సంపాదకత్వంలోనే కథావసుధ కూడా వెలువడుతోంది.
రచయితగా వెలువరించిన పుస్తకాలు
1. పూర్ణమూ నిరంతరమూ (కథాసంపుటి)
2. రాతి తయారీ (కథాసంపుటి)
3. గారడీవాడు (కథాసంపుటి)
4. సుపుత్రికా ప్రాప్తిరస్తు (నవల)
5. పుత్రికా శ్రతుః (నవల)
6. షష్ఠముడు (కవిత్వ సంపుటి)
7. మునివాక్యం (సంపాదకీయ కథనాల సంపుటి)
సంపాదకుడిగా వెలువరించిన పుస్తకాలు
1. సదాస్మరామి (భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ స్మృతి సంచిక)
2. గురుశిఖరం (తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి స్మృతి సంచిక)
3. అక్షరమైన మట్టి మనిషి (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి అభినందన సంచిక)
4. మా ముద్దుల భారతమ్మ (అమ్మ గురించిన ఆత్మీయ కథనాల సంకలనం)
.