అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మహిళా రిజర్వేషన్ కు తాము చాలా చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్న పార్టీగా చాటుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం మినహా.. లోక్ సభ, శాసనసభలకు ఏకమొత్తంగా యాభై శాతం సీట్లు పెంచుతూ దేశవ్యాప్తంగా డిలిమిటేషన్ చేయడానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల్లో అర్థం లేదు. నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు అసంబద్ధమైన నిర్ణయం తీసుకుంది. చట్టసభల సభ్యుల ప్రాథమిక బాధ్యత ఏమిటి, విధులేమిటి.. అనే కనీస అవగాహన కూడా లేకుండా తీసుకున్న నిర్ణయం లాగా ఇది కనిపిస్తుంది.
లోక్ సభ విషయం విపులంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం 543గా ఉన్న ఎంపీల సంఖ్యను యాభైశాతం పెంచి 850 చేయాలనేది మోడీ సర్కారు ప్రతిపాదన. ఈ అవసరం అసలుందా? అనేది సామాన్యుడికి కలుగుతున్న సందేహం. ఎందుకంటే.. ఎంపీ అనే హోదాగల నాయకుడికి చట్టసభలో బిల్లులు చర్చకు వచ్చినప్పుడు తన అభిప్రాయం వ్యక్తం చేయడం తప్ప.. మరో అధికారం రాజ్యాంగబద్ధంగా లేదు. వారు యావత్ ప్రభుత్వ వ్యవస్థల మీద కర్రపెత్తనం చేస్తుండడం అనేది.. మన ప్రజాస్వామిక వ్యవస్థలో అపభ్రంశతకు చిహ్నం మాత్రమే. నాయకులు ప్రజల్లో ఉండడం అవసరమే. అది వారి మనుగడకోసం, సామాజిక జ్ఞానం కోసం అవసరం. కానీ.. ప్రజల ప్రతి సమస్యలను వినడానికి ఎంపీలు అందుబాటులో ఉండాలి గనుక.. వారు ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తిని తగ్గించడానికి సీట్ల సంఖ్య పెంచడం అనేది లాజిక్ లేని సంగతి.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాల్సిన పని కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, మునిసిపాలిటీ, మండలాల స్థాయిలోని ప్రజాప్రతినిధులది. ప్రజల కష్టాల గురించి ప్రభుత్వాలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పెంచవలసింది వార్డుమెంబర్ల, కౌన్సిలర్ల సంఖ్యను. అంతే తప్ప చట్టాలు చేసే పనిమాత్రమే తమ విధుల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యను కాదు.
మోడీ ప్రభుత్వం రెండేళ్ల కిందటే కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం లోక్ సభ లో 888 మందికి మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉంది. అంటే.. ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగాలునడిచే ఉభయ సభల సమావేశానికి ఇది సరిగ్గా సరిపోతుంది. లోక్ సభ సీట్ల సంఖ్యనే 850కు పెంచితే.. ఉభయసభల భేటీకి సీట్లు కూడా చాలవు. ప్రస్తావన కోసం చెప్పడమే తప్ప ఇది చాలా చిన్నవిషయం.
543మంది ఎంపీలుంటేనే.. అసలు లోక్ సభలో మాట్లాడే అవకాశం ఎందరు ఎంపీలకు వస్తోంది? నిజంగానే చర్చనీయాంశమైన ఒక బిల్లు సభ ఎదుటకు వచ్చినప్పుడు తమ గొంతు విప్పుతున్న వారు ఎందరు? అయిదేళ్ల పదవీకాలంలో ఒక్కసారి కూడా ‘అధ్యక్షా’ అనకుండానే.. దిగిపోతున్న ఎంపీలు మనకు అనేకమంది ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. తన మందను పెంచుకుంటూ పోవాలని తపనపడే గొర్రెలకాపరిలాగా.. ఎంపీల సంఖ్యను 850కి పెంచాలనుకోవడంలో అర్థం లేదు.
.
Discussion about this post