చేతివృత్తుల వారు ఆ వృత్తి పనులు మాత్రమే చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండే రోజులు కొన్ని దశాబ్దాల కిందటే అంతరించిపోయాయి. గ్రామీణ జీవనంలో చేతివృత్తుల పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిపోయిందో.. గోరటివెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ పాటలో చాలా బరువుగా, మనసు ద్రవించేలా వివరించారు. నిజానికి వృత్తులను బట్టే చాలా కులాలు కూడా ఏర్పడిన వైనం మనం గమనిస్తున్నదే. సమాజంలో కులాలు మిగిలిపోయాయి గానీ.. వృత్తులు మాత్రం అంతర్ధానం అయిపోతున్నాయి.
కుమ్మరి, మేదర, వడ్రంగి లాంటి పనులన్నీ ఇప్పటికే సమాజం నుంచి మాయమైపోయాయి. గతంలో ఊరి జనాభాను బట్టి కనీసం రెండు నుంచి పది కుటుంబాల వరకు ఈ వృత్తుల వారుండేవారు. ఇప్పుడు పది ఊర్లు వెతికితే గానీ ఒక్క కుటుంబమైనా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ వంటి ఆధునిక ప్రయోగాలు.. మరింతగా ఈ చేతివృత్తుల వారి పొట్టకొట్టే పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా ఒక వార్త పత్రికల్లో వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఒక సంస్థ.. అన్నమయ్య జిల్లా మదనపల్లె, పుంగనూరు తదితర ప్రాంతాల్లోని చేతిపనివాళ్లకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చింది. బుట్టల అల్లికలు, టైల్స్ అమర్చడం, పెయింటింగ్, కుండల తయారీ వంటి పనులు చేసే వారికి వీటిని ఇచ్చారు. వారు ఆ ఫోన్లను తలకు అమర్చుకుని.. తాము చేసే పనులను వీడియో తీసి, ఆ సంస్థకు పంపాలన్నమాట. అందుకు వారికి డబ్బులు చెల్లిస్తారు. ఈ వీడియోలద్వారా ఏఐకు శిక్షణ ఇచ్చి, రోబోలు ఆయా పనులు చేసేలా రూపొందిస్తామని ఆ సంస్థ చెబుతున్నట్టు వార్తలో వివరాలుు ఉన్నాయి.
ఇప్పటికే సమాజంలో చేతిపనివాళ్లు తగ్గిపోయారు. కానీ ఇష్టంగా మట్టికుండ, మట్టి పాత్రలు, వెదురుబుట్టలు కావాలనుకునేవారికి మార్కెట్లో గతంతో పోల్చినప్పుడు ధరలు కాస్త ఎక్కువే అయినా అవి దొరుకుతున్నాయి. ఆ రకంగా పనిచేసుకు బతుకుతున్న అతి కొద్దిమంది బతుకుతెరువుకు ఢోకా లేకుండా ఉంది. కానీ.. ఇలాంటి తాజా ప్రయత్నాలు.. ఈ చేతివృత్తులను కూడా ఏఐ సాయంతో రోబోలతో చేయించేలా కనిపిస్తోంది. దీంతో ఆ వృత్తిపనివాళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. పైగా ఒకే రోబోకు ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్ ను బట్టి వెదురుబుట్ట, మట్టికుండ ఏది చేయమంటే అది చేస్తుంది. పెయింటింగ్, టైల్స్ ఫిక్సింగ్ ఏ పని చెప్పినా చేస్తుంది. చేతివృత్తుల వారు వాటిని నమ్ముకోకుండా చదువుకుని, నైపుణ్యాలు పెంచుకుని ఇతర మార్గాలను అనుసరిస్తే సరే.. కేవలం ఆ వృత్తి తప్ప మరొకటి తెలియని వారైతే.. కూలివాళ్లుగానో, వాచ్ మ్యాన్లుగానో, ముష్టివాళ్లుగానో బతుకులు గడపాల్సిన రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోంది.
.
Discussion about this post