పేదలకు భూమి దక్కేంతవరకు నిరంతరం పోరాటాలు చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హరినాధ్ రెడ్డి, సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి ఎం మురళి పిలుపునిచ్చారు. కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామపంచాయతీలోనీ తిరుగుడుపల్లి హరిజనవాడ పరిధిలోని 1066 లో విస్తీర్ణం 557 ఎకరాల 71 సెంట్లు ప్రభుత్వ బంజరు భూమి ఉండగా సదరు భూమిలో 527 ఎకరాలు కబ్జాకు గురి కాగా 30 ఎకరాల భూమిని 2017 లో 25 మందికి పట్టాలు ఇచ్చారని అ భూమిని మరియు దాని పక్కనే ఉన్న భూమిని రాజకీయ నాయకుల అండదండలతో రాత్రికిరాత్రే జెసిబి మిషన్ లను పెట్టి దౌర్జన్యంగా చదును చేస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మాపైనే దౌర్జన్యం చేశారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య,మండల కార్యదర్శి సి నాగమ్మ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హరినాధ్ రెడ్డి దృష్టికి, ఎం మురళి దృష్టికి తెచ్చారు.
స్పందించిన నాయకులు తక్షణం క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలకు ప్రభుత్వ బంజరు భూములు దక్కేంతవరకు నిరంతరం పోరాటాలు చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు.భూ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టు పార్టీకీ భూ పోరాటం కొత్తకాదనీ వీరోచిత సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో సిపిఐ లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఉందన్నారు. తిరుగుడుపల్లి దళితులకు ఇచ్చిన భూములు వారికే దక్కాలన్నారు.గ్రామీణ ప్రాంత దళితులపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని కార్పోరేట్ పెట్టుబడి శక్తులకు అనుకూలంగా నడుచుకుంటున్న ఈ దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలన్నారు.
ప్రజాస్వామ్య లౌకిక శక్తులన్నీ చేయిచేయీ కలిపి భూకబ్జా దారుల ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమాలే భూ సమస్యల పరిష్కారానికి మార్గమన్నారు. ఉద్యమాలు బలపడితే ప్రభుత్వాలకు భయం పుడుతుందన్నారు. చంద్రబాబు పాలనలో దోచుకున్న వారే అబివృద్ది చెందుతున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అబివృద్ది చెందలేదన్నారు.ప్రభుత్వ బంజరు భూములను దళితులకు పంచక పోతే భారత కమ్యూనిష్టు పార్టీ రంగప్రవేశం చేసి భూములలో ఎర్రజెండాలు నాటి మెమే పేదలకు భూములు పంచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దళితులకు చెందిన భూములను, ప్రభుత్వ బంజరు భూములను భూ కబ్జాదారులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే చదును చేస్తుంటే సంబంధిత రెవిన్యూ అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.సర్వేనెంబర్ 1295/1,2,3,4,5 నెంబర్లలో గల భూమి విస్తరణ 100 ఎకరాలను కబ్జా చేసి మామిడి చెట్లు నాటినటువంటి భూ కబ్జాదారులపైన కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని బాలాజీనగర్, శివాజీనగర్ ఎస్టీ కాలనీ వాసులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.త్వరలో జరగబోయే 8 వ విడత భూపంపిణీ కార్యక్రమంలో దళితులకు ఒక్కొక్కరికి ఒక ఎకరా 50 సెంట్లు చొప్పున కేటాయించి పట్టాదారు పాస్ బుక్ లు ఇవ్వాలన్నారు.
1155 సర్వేనెంబర్ లోని 222 ఎకరాలు భూమిని బాలిరెడ్డిపల్లి ఎస్సీ, ఎస్టీ లకు పంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య,మండల కార్యదర్శులు డి రాజశేఖర్, సి నాగమ్మ, బికెఎంయు ఎం జయరామయ్య, డిహెచ్ పిఎస్ నియోజకవర్గ సహయ కార్యదర్శి కటారి గోపాల్, వెంకటరమణ,శంకరయ్య, ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post