ఇవాళ (5 జూన్ 2026) ప్రపంచ పర్యావరణ దినోత్సవం, పర్యావరణాన్ని కాపాడుకోవడం గురించిన చైతన్యం ప్రతి ఒక్కరూ పొందవలసిన రోజు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కట్టుబడాల్సిన రోజు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబబాబునాయుడు ఒక కొత్త సంకల్పాన్ని ప్రకటించారు. ‘ఎక్స్’ లో చేసిన పోస్టు ద్వారా ఆయన ప్రజలందరకూ పిలుపు ఇచ్చారు. తానే రోల్ మాడల్ గా నిలవదలచుకున్న చంద్రబాబు.. పర్యావరణం కోసం ఈ రోజున విశాఖలో జరిగే కార్యక్రమాల్లో తాను సైకిలుపై ప్రయాణించనున్నట్లు తెలిపారు.
ఆయన ఎక్స్ లో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి, మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి నీరు నేల కలుషితం కాకుండా కృషిచేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వాడడం అవసరం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ–సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలి. నా విశాఖ పర్యటనలో నేను సైకిలుపై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను’ అని చంద్రబాబు పోస్టు చేశారు.
ఈ పోస్టు చాలా గొప్ప ఉద్దేశంతో చేసినదే అయినప్పటికీ.. దీనిని జాగ్రత్తగా గమనిస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే.. పర్యావరణం కోసం సైకిలు మీద ప్రేమను ప్రకటించడం అనేది కేవలం ఒక తద్దినం వ్యవహారం అయిపోయింది. ‘తత్-దిన’ మన్నట్టుగా ఏడాదిలో ఒక్కరోజు.. మహా అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు లేదా అలాంటి ఒకటి రెండు రోజులు సైకిలు తొక్కితే చాలునని సంకేతం ఇస్తున్నట్టుగా ఉంది. ఏడాదిలో ఈ ఒక్కరోజు ప్రజలు సైకిలు తొక్కితే సరిపోతుందా? దాని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందా? ఈ ఒక్కరోజుకోసం ప్రజలు సైకిళ్లను, ఈ సైకిళ్లను ఆశ్రయించాలా? అనేది అసలు ప్రశ్న! ఈ రకంగా- సైకిలుపై ప్రేమ అనేది ఒక అకేషనల్ వ్యవహారంగా మారిపోకూడదు.
నిజంగానే పర్యావరణం మీద ప్రభుత్వాలకు ప్రేమ ఉన్నా.. లేదా ఇంధన వినియోగాలను వాడుకలో బాగా తగ్గించాలనే సదుద్దేశం ఉన్నా చేయాల్సిన పనులు ఇవి కాదు. తాము పిలుపు ఇచ్చిన రోజు మాత్రమే కాకుండా.. ప్రజలు స్వచ్ఛందంగా సైకిళ్లమీద మోజుపడే పరిస్థితిని తీసుకురావాలి. నిత్యకృత్యమైన వారి అలవాట్లలో సైకిలు ఒక భాగమయ్యేలా చూడాలి. అలాంటి కృషిని ప్రభుత్వాలు చేయడం లేదు. ఇటీవల ఇంధన పొదుపు గురించి మోడీ పిలుపు ఇచ్చిన తర్వాత.. డీజిలు పొదుపు అంటూ సీఎం చంద్రబాబు సహా మంత్రులందరూ కూడా కాన్వాయ్ వాహనాల్ని తగ్గించుకున్నారు. సైకిలుపై ఒక ట్రిప్ పర్యటించారు. ఆ ఫోటోలు ప్రెస్ రిలీజ్ ల ద్వారా పత్రికలకు పంపారు. కానీ అలా ఎన్ని రోజులు చేశారు? ఇదే అసలు ప్రశ్న.
ఫోటో సెషన్ కోసం చేసినట్టుగా ఒకటీ రెండు గంటలు మాత్రమే కాకుండా, తమ అలవాటుగా సైకిలును మార్చుకుంటున్నారా? అనేది ఇంపార్టెంట్. నాయకులు సైకిలుపై ప్రయాణించిన ప్రతిసారీ పత్రికలకు ఫోటోలు, చానెళ్లకు వీడియోలు పంపే ప్రచారకాంక్షతో ఉండరాదు. కానీ, ఆ ఫోటోలు వీడియోలు అన్నీ తమతమ వ్యక్తిగత సోషల్ మీడియా హాండిల్స్ లో ప్రతిరోజూ పెట్టాలి. అలాంటప్పుడు.. ప్రజలు కూడా ఇంధన పొదుపు లేదా, సైకిళ్లవైపు మొగ్గే అవకాశం ఉంటుంది. సైకిళ్ల వినియోగం పెరగడానికి మరింత నిర్దిష్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి.
ప్రభుత్వాలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. సైకిళ్ల విక్రయంపై ఉండే జీఎస్టీ పన్నులను పూర్తిగా మినహాయించాలి. ప్రస్తుతం సైకిళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే పెడల్స్ తో తొక్కే సైకిళ్లకు, ఎలక్ట్రిక్ సైకిళ్లకు, ఎలక్ట్రిక్ బైక్ లకు కూడా కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ పన్నును కూడా మినహాయించాలి. అలాగే సైకిళ్లు కొనేవారికి కొత్త ప్రోత్సాహకాలు ఉండేలా చూడాలి. ఏదో ఒక విధంగా వారికి లబ్ధి కలిగించే మార్గాలు చూడాలి. వివిధ సంస్థలు ఎన్జీవోలతో అనుసంధానమై గిఫ్ట్ వోచర్లు లాంటివి సైకిళ్లు కొంటున్న సమయంలో వారికి అందించాలి. ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటే సైకిళ్ల కొనుగోలు పెరుగుతుంది. తదనుగుణంగా వాడకమూ పెరుగుతుంది.
సైకిళ్ల వినియోగం పెరగడానికి ప్రభుత్వం చేయాల్సిన పనులున్నాయి. రద్దీతో ఉండే ప్రధాన నగరాల్లో సైకిలు ట్రాకులు ప్రత్యేకంగా అందుబాటులోకి తేవాలి. అవి టూవీలర్ల, కార్ల కబ్జాకు గురికాకుండా.. సైకిలుపై ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించాలి. ఆఫీసులకు సైకిళ్లపై వచ్చే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉండాలి. ఫరెగ్జాంపుల్.. నెలలో కనీసం ఇరవై రోజులు సైకిలుపై ఆఫీసుకు వచ్చే వారికి ఒక హాఫ్ డే సెలవును అదనంగా ఇచ్చే ఏర్పాటు ఉన్నదని అనుకుందాం. దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. సైకిళ్ల మీద నాయకులు, ఇతర ముఖ్యులు, అధికారులు తిరుగుతూ ఉంటే.. సామాన్య ప్రజలు కూడా తిరగడం జరుగుతుంది. సైకిలుమీద సవారీ చేయడాన్ని నామోషీగా భావించే పరిస్థితి పోతుంది. లక్షల ఖరీదైన మోటారు సైకిళ్లపై మాత్రమే తిరిగే డాంబికపు ఆర్భాటాల ఊబినుంచి ప్రజలు బయటపడతారు.
సైకిలుపై తిరగడం అనేది పర్యావరణానికి మంచిది, వ్యక్తి ఆరోగ్యానికి కూడా మంచిది.. అని ప్రచారం చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయకుండా.. ఆచరణలో ఇలాంటి పనులు చేసినట్లయితే నిజంగా సైకిలు వినియోగం పెరుగుతుంది. అప్పుడు అన్ని రకాలుగానూ సామాజిక వ్యవస్థ గాడిన పడుతుంది. ‘సైకిలుపై ప్రేమ’ను ఒక తద్దినం వ్యవహారంగా, అకేషనల్ ఎలిమెంట్ గా చూడకుండా.. చిత్తశుద్ధితో అమలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

.
Discussion about this post