ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ మామిడి రైతు కళ్లల్లో ఆనందం ఆవిరవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన తోతాపురి మామిడి ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడికి కేవలం రూ.3లకు మించి చెల్లించడం లేదు. గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అంతా ఒకటై సిండికేట్గా మారడంతోనే రైతులకు ఈ దుస్థితి దాపురించింది.
స్వయంగా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించి తోతాపురికి కిలోకు రూ. 8 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా, పరిశ్రమల యాజమాన్యాలు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెడచేవిన పెట్టాయి. పాలకులు మాత్రం కేవలం ఏసీ గదుల సమీక్షలకే పరిమితమై కాలం గడుపుతుండటంతో, క్షేత్రస్థాయిలో మామిడి రైతు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నాడు.
పెట్టుబడులు భారమై… దిగుబడులు తగ్గి
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో తోతాపురి మామిడి సాగవుతోంది. గతేడాది జిల్లాలో 6 లక్షల టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల దిగుబడి 5 లక్షల టన్నులకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు సాగు ఖర్చు దాదాపు రూ. 35 వేల వరకు అవుతోంది. గతేడాది ఎకరాకు 6 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది అది 4 నుంచి 5 టన్నులకు పడిపోయింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, దిగుబడి తగ్గిన తరుణంలో కిలో మామిడికి కనీసం రూ. 10 ఇస్తేనే రైతుకు అసలు గిట్టుబాటు అవుతుంది. అలాంటిది ప్రస్తుత మార్కెట్ ధరలు చూస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవు.
అదను చూసి దెబ్బ కొడుతున్న ర్యాంపులు
రైతుకు మద్దతు ధర లభించకపోవడానికి పరిశ్రమల ధరకు, ఉత్పత్తి ఖర్చుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండటమే కారణం. మామిడిని తోట నుంచి తరలించాలంటే టన్నుకు రూ. 2,500 వరకు రవాణా ఖర్చవుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 గుజ్జు పరిశ్రమలు ఉండగా, ప్రస్తుతం కేవలం 33 పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. ఇవి కూడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవడంతో రైతులు పరిశ్రమల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కో రైతు సగటున రెండు రోజుల పాటు ఫ్యాక్టరీల ముందే నిరీక్షిస్తున్నాడు. మరోవైపు గుజ్జు పరిశ్రమల వారు కొనుగోలు చేసిన మామిడికి నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. చేతిలో పైసలు లేక, అప్పులవాళ్ల ఒత్తిడి భరించలేక రైతులు విధిలేక తక్కువ ధరకైనా సరేనని స్థానిక ర్యాంపులను ఆశ్రయిస్తున్నారు. దీన్నే అదనుగా తీసుకుంటున్న ర్యాంపుల నిర్వాహకులు ధరలను రూ. 3 కి పడేసి రైతుల రక్తాన్ని పిండుకుంటున్నారు.
పాలకుల మాట నీటిమూటలేనా?
గత ఏడాది తోతాపురికి కిలోకు రూ. 12 మద్దతు ధరగా నిర్ణయించారు. ఇందులో పరిశ్రమల వారు రూ. 8 చెల్లించాలని, మిగిలిన రూ. 4 లను ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ, గుజ్జు పరిశ్రమల వారు సీఎం మాటను సైతం ఖాతరు చేయకుండా కిలోకు రూ. 5 నుండి రూ. 6 మాత్రమే చెల్లించారు. గతేడాది ప్రభుత్వం రూ. 187 కోట్లు సబ్సిడీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది రైతులకు ఆ సబ్సిడీ బకాయిలు అందలేదు.
మ్యాంగో బోర్డు ఊసేది?
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించకపోవడానికి ప్రధాన కారణం ప్రత్యేకంగా ఒక మ్యాంగో బోర్డు లేకపోవడమే. ఏటా సీజన్ రాగానే ప్రభుత్వాలు తాత్కాలిక సమీక్షలు జరపడం, సబ్సిడీలు ప్రకటిస్తామని కాలయాపన చేయడం పరిపాటిగా మారింది. చిత్తూరు కేంద్రంగా మ్యాంగో బోర్డును ఏర్పాటు చేస్తే… అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లను విశ్లేషించి తోతాపురి రకానికి ముందే మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించవచ్చు. దీనివల్ల ప్రైవేట్ వ్యాపారుల, గుజ్జు పరిశ్రమల సిండికేట్ మాయాజాలానికి పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు. బోర్డు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అత్యాధునిక శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేయడం ద్వారా, రైతులు పంటను తక్కువ ధరకు అమ్ముకోకుండా నిల్వ చేసుకుని, డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకునే వీలుంటుంది. కేవలం స్థానిక గుజ్జు పరిశ్రమలపైనే ఆధారపడకుండా, విదేశాలకు తోతాపురిని ఎగుమతి చేసేలా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే రకాలపై పరిశోధనలు చేయడం, ఎరువుల రాయితీలు అందించడం మరియు సకాలంలో పంట బీమా పరిహారం అందేలా ఈ బోర్డు పర్యవేక్షించగలదు.
మామిడి రైతుల కష్టాలు తీరాలంటే…
రైతు కన్నీరు తుడవడానికి, మామిడి రంగాన్ని ఈ తీవ్ర సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలి. కలెక్టర్ ఆదేశించిన రూ. 8 కనీస ధరను కూడా ఇవ్వకుండా మొండికేస్తున్న గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలపై ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే ఫ్యాక్టరీల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వాటిపై భారీ జరిమానాలు విధించాలి.
మద్దతు ధర పెంపు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గాయి, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కిలో తోతాపురికి కనీసం రూ. 12 నుంచి రూ. 16 వరకు మద్దతు ధర ప్రకటించి, పరిశ్రమలు ఆ ధరకు కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి.
సబ్సిడీ బకాయిల తక్షణ విడుదల
గతేడాది ప్రభుత్వం ప్రకటించిన రూ. 187 కోట్ల సబ్సిడీ బకాయిలు ఇప్పటికీ చాలా మంది రైతులకు అందలేదు. ఈ బకాయిలను వడ్డీతో సహా తక్షణమే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలి. ఇది రైతులకు కొత్త పెట్టుబడుల కోసం కొంతైనా ఊరటనిస్తుంది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ప్రైవేటు ర్యాంపులు, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. ప్రభుత్వమే మార్కెట్లోకి దిగి కొనుగోళ్లు జరిపితే స్థానిక ర్యాంపులు దానంతట అవే ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
సహకార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన
ప్రైవేటు పరిశ్రమల గుత్తాధిపత్యాన్ని శాశ్వతంగా దెబ్బతీయడానికి ప్రభుత్వ రంగంలో లేదా అమూల్ డైరీ తరహాలో సహకార ప్రాతిపదికన ప్రభుత్వమే తోతాపురి గుజ్జు పరిశ్రమలను స్థాపించాలి. దీనివల్ల రైతులకు లాభాల్లో వాటా దక్కడంతో పాటు స్థిరమైన ధర లభిస్తుంది.
రైతుకే హక్కు కావాలి
రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కు దళారులకో, ఫ్యాక్టరీలకో కాదు.. స్వేచ్ఛా మార్కెట్లో రైతుకే ఉండాలి. ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గినందున, తాము బ్రతకాలంటే కిలోకు రూ. 12 నుండి రూ. 16 వరకు ధర చెల్లించాలని తోతాపురి రైతులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. చెమటోడ్చి పండించిన పంటను రోడ్లపై పారబోయలేక, పరిశ్రమల సిండికేట్ మాయాజాలంలో చిక్కుకుని కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కేవలం కాగితపు సమీక్షలు పక్కనబెట్టి కళ్లు తెరవాలి. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని, ఈ ఏడాది కిలోకు రూ. 16 మద్దతు ధర దక్కేలా చూడాలని, బకాయి ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేసి మామిడి రైతును ఆదుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డును ఏర్పాటు చేసి, రైతుల కళ్లల్లో ఆనందం నింపాలని ఆశిద్దాం.
-వలిపి శ్రీరాములు,
9441135762

.
Discussion about this post