అశోకుడి కాలం నాటి బ్రాహ్మీలిపి శాసనాలకు, వజ్రాలవేటకు పేరుమోసిన జొన్నగిరి.. ఇకపై స్వర్ణ కాంతులతో ధగద్ధగాయమానం కానుంది. భారతదేశ బంగారు అవసరాలను కొంత మేర తీర్చగలిగేలా, ఈ ప్రాంతంలోని బంగారు గనులు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రెవేటురంగంలో బంగారు గనులనుంచి ఉత్పత్తితో జొన్నగిరి దేశంలోనే అరుదైన గుర్తింపు పొందనుంది.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో పదివేల మంది నివసించే జొన్నగిరి గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో బంగారం వెలికితీతకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. వచ్చేవారం జొన్నగిరి గ్రామంలో బంగారం ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దేశంలోనే జొన్నగిరి బంగారుగనులు ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. జొన్నగిరి గ్రామంలో బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించి దశాబ్ద కాలానికి పైగా అయినప్పటికీ ఇన్నాళ్లకు వెలికితీత కార్యరూపం దాల్చింది. బంగారు వెలికితీసి, శుద్ధి చేయడానికి ప్రైవేట్ రంగంలో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీయంయస్ఐ) ముందుకు వచ్చింది. బంగారు గనుల నుంచి శుద్ధిచేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి వీలుగా అన్ని అనుమతులు తీసుకుంది. ఈ కార్యక్రమానికి 2021 లో శ్రీకారం చుట్టింది. వివిధ శాఖలనుంచి అనుమతులు, శుద్ధి చేయడానికి అవసరమైన ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఇన్నాళ్లకు అన్ని పనులు పూర్తయి కార్యరూపం దాల్చనుంది..
జొన్నగిరి గ్రామంలో బంగారు గనులను గుర్తించిన దాదాపు 597 హెక్టార్ల విస్తీర్ణంలోని భూములను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ భూములను జియో మైసూర్ సంస్థకు అప్పగించింది. ఈ భూముల్లో దాదాపు 13 వేల టన్నుల బంగారు ఉన్నట్లు అంచనా వేశారు. ఓపెన్ కాస్ట్ విధానంలో ఆధునిక టెక్నాలజీతో బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 2063 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రోజుకు 1000 టన్నుల గోల్డ్ ఓర్ శుద్ధికి అవకాశం కలుగుతుంది. ఏడాదికి 500 కిలోలు కి పైగా బంగారు ఉత్పత్తి కానుంది. దీని ద్వారా బంగారు దిగుబడులు తగ్గి విదేశీ నిల్వలు పెరగనున్నాయి.
ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న బంగారు వెలికితీత కార్యక్రమం విజయవంతమైతే, మరిన్ని కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో సైతం బంగారుపాళెం, కుప్పం ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు గతంలోని గుర్తించారు. అయితే ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందో లేదోననే సర్వేలు జరుగుతున్నాయి.
.. కృష్ణయ్య మేళ్ల
సీనియర్ పాత్రికేయుడు

.
Discussion about this post